YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

తెలంగాణ

గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో ప్లాస్టిక్ వినియోగంపై పూర్తిగా నిషేదం జీహెచ్ఎంసీ స‌ర్వ‌స‌భ్య స‌మావేశంలో ఏక‌గ్రీవ‌ తీర్మానం

 గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో ప్లాస్టిక్ వినియోగంపై పూర్తిగా నిషేదం      జీహెచ్ఎంసీ స‌ర్వ‌స‌భ్య స‌మావేశంలో ఏక‌గ్రీవ‌ తీర్మానం
ప‌ర్యావ‌ర‌ణానికి పెనుముప్పుగా ఏర్ప‌డ‌డంతో పాటు చెరువులు, నీటి వ‌న‌రుల కాలుష్యానికి ప్ర‌ధాన కార‌ణ‌మైన ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేదించాల‌ని నేడు జ‌రిగిన జీహెచ్ఎంసీ స‌ర్వ‌స‌భ్య స‌మావేశం ఏక‌గ్రీవంగా తీర్మానించింది. న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన స‌ర్వ‌స‌భ్య స‌మావేశంలో క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి, డిప్యూటి మేయ‌ర్ బాబా ఫ‌సియుద్దీన్‌తో పాటు న‌గ‌రంలోని ప‌లువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కో-ఆప్ష‌న్ స‌భ్యులు, కార్పొరేట‌ర్లు పాల్గొన్నారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో ప్ర‌తిరోజు 5,000 మెట్రిక్ ట‌న్నుల చెత్త ఉత్ప‌త్తి అవుతుండ‌గా వీటిలో 450 నుండి 500 మెట్రిక్ టన్నుల వ‌ర‌కు ప్లాస్టిక్ వ్య‌ర్థాలు వ‌స్తున్నాయి. తాత్కాలిక అవ‌స‌రాల నిమిత్తం ప్లాస్టిక్ క్యారీబ్యాగ్‌లు, ఇత‌ర ప్లాస్టిక్ వ‌స్తువుల‌ను నిత్య‌జీవితంలో ఉప‌యోగిస్తున్న‌ప్ప‌టికీ ఇవి దీర్ఘ‌కాలికంగా ప‌ర్యావ‌ర‌ణంపై తీవ్ర ప్ర‌భావం చూపించి ఎన్నో ఆరోగ్య ప‌ర‌మైన స‌మ‌స్య‌ల‌కు కార‌ణ‌మ‌వుతున్నాయ‌ని మేయ‌ర్ రామ్మోహ‌న్ అన్నారు. ముఖ్యంగా హైద‌రాబాద్ న‌గ‌రంలో కురిసే భారీ వ‌ర్షాల‌కు నాలాలు, సీవ‌రేజ్ లైన్లు ప్లాస్టిక్ వ్య‌ర్థాల‌తో బ్లాకై రోడ్ల‌పై నీరు చేర‌డం ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు ఎదురుకావ‌డం త‌దిత‌ర స‌మ‌స్య‌లు నిత్య‌కృత్యంగా మారాయ‌ని, ఈ నేప‌థ్యంలో 1986 ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ చ‌ట్టాన్ని లోబ‌డి 50మైక్రాన్ల క‌న్నా అధికంగా ఉండే అన్ని ర‌కాల‌ ప్లాస్టిక్ వ‌స్తువుల త‌యారీ, స‌ర‌ఫ‌రా, అమ్మ‌కాల‌పై నిషేదాన్ని విధించాల‌ని ప్ర‌భుత్వానికి ప్ర‌తిపాద‌న‌లు పంపే తీర్మాణాన్ని ఆమోదించాల‌ని మేయ‌ర్ రామ్మోహ‌న్ కోర‌గా స‌భ్యులు ఆమోదించారు. 
బ‌ల్దియాకు అవార్డుల ప‌రంప‌రపై స‌భ్యుల అభినంద‌న‌లు
ఇటీవ‌ల కాలంలో జీహెచ్ఎంసీకి వ‌రుస‌గా ప‌లు ప్ర‌తిష్టాత్మిక అవార్డులు రావ‌డం ప‌ట్ల స‌భ‌లోని అన్ని పార్టీల కార్పొరేట‌ర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అభినందించారు. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క ప్ర‌ధాన మంత్రి ఎక్స‌లెన్సీ అవార్డు, జాతీయ స్థాయిలో హైద‌రాబాద్ న‌గ‌రానికి సాలిడ్‌వేస్ట్ మేనేజ్‌మెంట్‌లో అగ్రస్థానం, తెలంగాణ ప్ర‌భుత్వ ఎక్స‌లెన్సీ అవార్డుల‌తో పాటు ప‌లు అవార్డులు వ‌రుస‌గా రావ‌డం ప‌ట్ల న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్, క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి, జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది చేస్తున్న కృషిని ఎమ్మెల్సీ ఎం.ఎస్‌.ప్ర‌భాక‌ర్ అభినందించారు. ప‌లువురు కార్పొరేట‌ర్లు కూడా చేసిన అభినంద‌న‌ల‌కు క‌మిష‌న‌ర్ జ‌నార్థ‌న్‌రెడ్డి జ‌వాబు ఇస్తూ జీహెచ్ఎంసీలోని 30వేల సిబ్బంది, కార్పొరేట‌ర్లు, న‌గ‌ర‌వాసులు, కాల‌నీ సంక్షేమ సంఘాలు, స్వ‌చ్ఛంద‌ సంస్థ‌లు ఉమ్మ‌డి కృషికి ఈ అవార్డులు నిద‌ర్శ‌న‌మ‌ని అన్నారు. 
98శాతం వీధిదీపాలు వెలిగితేనే చెల్లింపులు చేస్తాం
న‌గ‌రంలోని సాంప్ర‌దాయ‌క వీధిదీపాల స్థానంలో ఎల్‌.ఇ.డి లైట్ల వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేయ‌డంతో అనేక ప్రాంతాల్లో వీధిదీపాలు స‌క్ర‌మంగా వెల‌గ‌డంలేద‌ని, ముఖ్యంగా రంజాన్ మాసం సంద‌ర్భంగా వీధిదీపాల స‌క్ర‌మంగా వెలుగ‌క‌పోవ‌డం ప‌లు స‌మ‌స్య‌లు ఏర్ప‌డుతున్నాయ‌ని ఎం.ఐ.ఎం కార్పొరేట‌ర్లు స‌భ దృష్టికి తెచ్చారు. ఈ సంద‌ర్భంగా మేయ‌ర్ మాట్లాడుతూ న‌గ‌రంలో ప్ర‌త్యేక బృందాల‌ను ఏర్పాటుచేసి ప్ర‌తి వీధిలో స్ట్రీట్‌లైట్లను త‌నిఖీచేసి వెంట‌నే వెలిగేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని విద్యుత్ విభాగం అధికారుల‌ను ఆదేశించారు. మ‌జీద్‌లు, ఈద్గాల వ‌ద్ద నిర్మాణ వ్య‌ర్థాలు, ఇత‌ర వ్య‌ర్థాల‌ను వెంట‌నే తొల‌గించ‌డానికి సెంట్ర‌ల్‌, సౌత్ జోన్‌ల‌లోని ప్ర‌తివార్డుకు ఒక ప్ర‌త్యేక వాహ‌నం, ఇత‌ర జోన్ల‌లో నియోజ‌క‌వ‌ర్గానికి రెండు వాహ‌నాల‌ను కేటాయించిన‌ట్లు మేయర్ పేర్కొన్నారు. క‌మిష‌న‌ర్ జ‌నార్థ‌న్‌రెడ్డి మాట్లాడుతూ న‌గ‌రంలో ఇ.ఇ.ఎస్‌.ఎల్ ద్వారా ఎల్‌.ఇ.డి లైట్ల మార్పిడి విజ‌య‌వంతంగా జ‌రిగింద‌ని, ప్ర‌స్తుతం 96శాతం వీధిదీపాలు వెలుగుతున్నాయ‌ని, అయితే 98శాతానికిపైగా వీధిదీపాలు వెలిగితేనే ఇ.ఇ.ఎస్‌.ఎల్ చెల్లింపులు జ‌రుపుతామ‌ని స్ప‌ష్టం చేశారు. అయితే ప‌లు ప్ర‌ధాన మార్గాల్లో వీధివ్యాపారులు స్ట్రీట్‌లైట్ల‌కు చెందిన విద్యుత్ లైన్ల నుండి అక్ర‌మంగా విద్యుత్‌ను వినియోగిస్తున్నార‌ని, దీని వ‌ల్ల కండెన్స‌ర్లు కాలిపోయి స్ట్రీట్ లైట్ల‌కు అంత‌రాయం ఏర్ప‌డుతుంద‌ని క‌మిష‌న‌ర్ వివ‌రించారు. 
పూడిక‌లో ఆధునిక విధానాలు పాటింపు
గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో నాలాల పూడికలో ఆధునిక విధానాలను పాటించ‌నున్న‌ట్టు మేయ‌ర్ రామ్మోహ‌న్ స్ప‌ష్టం చేశారు. నాలా పూడిక ప‌నులు న‌త్త‌న‌డ‌క‌న న‌డుస్తున్నాయ‌ని ప‌లువురు స‌భ్యులు లేవ‌నెత్తిన అంశాల‌పై మేయ‌ర్ స‌మాధాన‌మిస్తూ నాలా పూడిక ప‌నుల్లో అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డితే స‌హించేదిలేద‌ని, గ‌తంలో ఈ విష‌య‌మై ప‌లువురు ఉద్యోగులు, కాంట్రాక్ట‌ర్ల‌పై తీసుకున్న చ‌ర్య‌ల‌ను గుర్తుచేశారు. సంవ‌త్స‌రం పొడుగునా పూడిక ప‌నుల‌ను చేప‌డుతున్నామ‌ని ఈ పూడిక ప‌నుల‌ను మ‌రింత వేగ‌వంతం చేయ‌నున్న‌ట్టు తెలిపారు. ఇప్ప‌టికే 1,85,000  క్యూబిక్ మీట‌ర్ల పూడిక మ‌ట్టిని తొల‌గించామ‌ని, గ‌త సంవ‌త్స‌రంతో పోలిస్తే అధికంగా ఉంద‌ని, నిర్వాహ‌ణ విభాగం చీఫ్ ఇంజ‌నీర్ జియాఉద్దీన్ తెలిపారు. నాలాల‌పై కీల‌కమైన 840 బాటిల్ నెక్స్ (అడ్డంకు)ల‌ను గుర్తించామ‌ని వీటిలో ఇప్ప‌టికే 350 నిర్మాణాల‌ను తొల‌గించ‌గా ఈ నెలాఖ‌రు వ‌రకు మ‌రో 200ల‌ను తొల‌గించ‌నున్న‌ట్టు సిసిపి దేవేంద‌ర్‌రెడ్డి తెలియ‌జేశారు. 
స్పోర్ట్స్ విభాగంలో ఆన్‌లైన్ విధానంతో పార‌ద‌ర్శ‌క‌త‌
జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ విభాగంలో ఆన్‌లైన్ ప‌ద్ద‌తిని ప్ర‌వేశ‌పెట్టినందున ఈ విభాగంలో అవ‌క‌త‌వ‌క‌ల‌కు అడ్డుక‌ట్ట వేశామ‌ని, కోట్లాది విలువైన స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ల‌ను ఉప‌యోగించ‌డం ద్వారా అధిక శాతం మందికి అందుబాటులోకి తెచ్చామ‌ని జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి తెలిపారు. కార్పొరేట‌ర్ స్వ‌ప్ప‌సుంద‌ర్‌రెడ్డి అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇస్తూ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ల‌లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయ‌డం, క్రీడా కాంప్లెక్స్‌ల‌కు వ‌చ్చేవారికి త‌గు కౌన్సిలింగ్ నిర్వ‌హిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. 
ఎస్‌.ఎఫ్‌.ఏల బ‌దిలీల్లో ఏవిధ‌మైన మార్పు ఉండ‌దు
పాల‌న సౌల‌భ్యానికిగాను జీహెచ్ఎంసీలోని ఎస్‌.ఎఫ్‌.ఏల‌ను చేసిన అంత‌ర్గ‌త బ‌దిలీల్లో ఏవిధ‌మైన మార్పులు ఉండ‌వ‌ని న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ స్ప‌ష్టం చేశారు. రంజాన్ మాసం సంద‌ర్భంగా ఎస్‌.ఎఫ్‌.ఏల బ‌దిలీలు చేసినందున పారిశుధ్య కార్య‌క్ర‌మాల‌కు తీవ్ర ఇబ్బందులు ఏర్ప‌డుతాయ‌ని ప‌లువురు అధికార పార్టీ కార్పొరేట‌ర్లు మేయ‌ర్ దృష్టికి తీసుకువ‌చ్చారు. దీంతో మేయ‌ర్ స‌మాధానం ఇస్తూ రంజాన్ పండుగ వెంట‌నే బోనాలు, వినాయ‌క చ‌వితి త‌దిత‌ర పండ‌గ‌లు వ‌రుస‌గా ఉన్నాయ‌ని, ప్ర‌స్తుతం చేసిన ఎస్‌.ఎఫ్‌.ఏల బ‌దిలీల వ‌ల్ల పారిశుధ్య కార్య‌క్ర‌మాల‌కు ఏవిధ‌మైన అంత‌రాయం ఏర్ప‌డ‌ద‌ని పేర్కొన్నారు. ఇప్ప‌టికే అత్య‌ధిక‌శాతం ఎస్‌.ఎఫ్‌.ఏలు నూత‌న స్థానాల్లో జాయిన్ అయ్యార‌ని, మిగిలిన‌వారు కూడా జాయిన్ అయ్యేవిధంగా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని జోన‌ల్ క‌మిష‌న‌ర్లను మేయ‌ర్ ఆదేశించారు. జాయిన్ కాని ఎస్‌.ఎఫ్‌.ఏల ఖాళీ స్థానాల్లో ఇత‌ర ఎస్‌.ఎఫ్‌.ఏల‌కు ఇన్‌చార్జీలుగా నియ‌మించే అంశాన్ని ప‌రిశీలించాల‌ని స్ప‌ష్టం చేశారు. 
దోమ‌ల నివార‌ణ‌కు ప్ర‌త్యేక చ‌ర్య‌లు
న‌గ‌రంలో దోమ‌ల నివార‌ణ‌కు మ‌రింత ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని మేయ‌ర్ రామ్మోహ‌న్ అధికారుల‌ను ఆదేశించారు. న‌గ‌రంలో దోమ‌ల తీవ్ర‌త అధిక‌మైంద‌ని కార్పొరేట‌ర్ రాజేంద‌ర్ యాద‌వ్ లేవ‌నెత్త‌గా మేయర్ రామ్మోహ‌న్ మాట్లాడుతూ ఎంట‌మాలజి విభాగానికి ఇటీవ‌ల అద‌న‌పు సిబ్బందిని కూడా మంజూరు చేశామ‌ని, వీటితో పాటు దోమ‌ల నివార‌ణ‌కు మిష‌న్ల‌ను పెంచాల‌ని సూచించారు.

Related Posts