YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

దిశ మార్చుకుంటున్న అలలు

దిశ మార్చుకుంటున్న అలలు

కాకినాడ, మార్చి 17, 
తూర్పు తీరాన ఉన్న హోప్‌ ఐలాండ్‌కు భవిష్యత్తులో ముప్పు పొంచి ఉందా? అంటే అవుననే అంటున్నారు పర్యావరణ వేత్తలు. కాకినాడ సీ పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో సముద్రంలో తరచూ జరుగుతున్న డ్రెడ్జింగ్‌ పనులు వల్ల ప్రమాదం పొంచి ఉందని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలలు దిశమార్చుకుంటున్నాయని, తీరం కోతకు గురవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
కాకినాడలో 200 ఏళ్ల క్రితం సహజ సిద్ధంగా హాప్‌ ఐలాండ్‌ ఏర్పడింది. గోదావరి నదీపాయల్లో యానాం సమీపంలో ఒక పాయ కలుస్తుంది. మరో పాయ కాకినాడ సమీపంలో ఉన్న కోరంగి మడ అడవుల్లోంచి సముద్రంలోకి వెళ్తుంది. ఈ నదీపాయ నుంచి కొట్టుకొచ్చిన మట్టి దిబ్బగా ఏర్పడింది. అలా కాలక్రమంలో కొన్నేళ్లకు ఏర్పడిన దిబ్బే హోప్‌ ఐలాండ్‌. సుమారు 2,500 ఎకరాల్లో 16 కిలోమీటర్ల పొడవు, 500 మీటర్ల వెడల్పున ఇది విస్తరించి ఉంది. ఇది కాకినాడ నగరానికి రక్షణ కవచంలా ఉంది. తుపాను, ప్రకృతి విపత్తుల నుంచి కాపాడుతోంది. ఈ దీవిలో మడ అడవులు ఉండటంతో దీనిని వైల్డ్‌ లైఫ్‌ ఫారెస్టు అధికారులు పర్యవేక్షిస్తున్నారు.16 కిలోమీటర్ల పొడవు గల ఐలాండ్‌ దక్షిణ భాగాన సన్నగా మొదలయ్యి, ఉత్తరం వైపు క్రమంగా వెడల్పు పెరుగుతూ వస్తుంది. దీంతో కాకినాడ పోర్టుకు నౌకల రాకపోకలకు ఆటంకం ఏర్పడడంతో కాకినాడ సీ పోర్ట్స్‌ అధికారులు నిత్యం డ్రెడ్జింగ్‌ చేపడుతూ ఉంటారు. గోదావరి నుంచి వచ్చే ఇసుక కారణంగా ఐలాండ్‌ విస్తీర్ణం పెరుగుతూ ఉంటుంది. ఇది పోర్టు కార్యకలాపాలకు అడ్డంకిగా ఉంటుందనే కారణంతో సముద్ర తీరానికి, ఐలాండ్‌కి మధ్య అధికారులు ఏడాదిలో రెండు, మూడు పర్యాయాలు డ్రెడ్జింగ్‌ చేస్తుంటారు. ఈ డ్రెడ్జింగ్‌ పనులు జరిగే ప్రాంతానికి వెళ్లేందుకు ఎవ్వరికీ అనుమతులు లేవు. నిబంధనలకు విరుద్ధంగా గుట్టుచప్పుడు కాకుండా సీపోర్టు అధికారులు ఈ పనులను కానిచ్చేస్తున్నారు.నిబంధనలకు విరుద్ధంగా లోతుగా డ్రెడ్జింగ్‌ చేయడం వల్ల సముద్ర కెరటాల స్వరూపం మారుతోందని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. హోప్‌ ఐలాండ్‌ పశ్చిమం వైపు పరిధి పెరగకుండా డ్రెడ్జింగ్‌ చేస్తున్నారు. దీని వల్ల ఉప్పాడ, కొనపాపపేట గ్రామాల్లో సముద్రం కోతకు గురవుతుంది. కెరటాలు దిశ మార్చుకుని కాకినాడ-ఉప్పాడ మధ్య తీరాన్ని తాకుతున్నాయి. ఇక్కడ కెరటాల ఉధృతి కూడా ఎక్కువగా ఉంటోంది. అల్పపీడనాలు, తుపానులు వచ్చినప్పుడు రాకాసి అలలు ఎగసిపడుతూ తీరంలో కోత తీవ్రమవుతోంది. ఏటా ఉప్పాడ తీరం వద్ద పదుల సంఖ్యలో మత్స్యకారుల ఇళ్లు సముద్రంలో కలుస్తున్నాయి. ఐదు దశాబ్దాల కాలంలో కిలోమీటరు మేర తీరం ముందుకు వచ్చింది. ఫలితంగా దాదాపు 1,500 ఇళ్లు, పలు దేవాలయాలు, ప్రభుత్వ భవనాలు సైతం సముద్రంలో కలిసిపోయాయని స్థానిక మత్స్యకారులు చెబుతున్నారు.డ్రెడ్జింగ్‌ వల్ల హోప్‌ ఐలాండ్‌తో పాటు సమీపంలో ఉన్న తీర ప్రాంతానికి ప్రమాదం పొంచి ఉంది. దీనిపై గతంలో ఢిల్లోలోని అటవీ, పర్యావరణ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాం. సహజ సిద్ధంగా ఏర్పడిన ఐలాండ్‌ను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరి పైనా ఉంది. తీర ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. డ్రెడ్జింగ్‌ సమస్యకు అటవీ, పర్యావరణ శాఖ అధికారులు పరిష్కారం చూపాలి.

Related Posts