YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఈడీ దర్యాప్తు అధికారికి కవిత లేఖ

ఈడీ దర్యాప్తు అధికారికి కవిత  లేఖ

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మూడోసారి ఈడీ విచారణకు హాజరయ్యారు. సరిగ్గా 11.15 గంటలకు ఢిల్లీలోని సీఎం కేసీఆర్ నివాసం నుంచి బయటికొచ్చిన కవిత 11.30 గంటలకు ఈడీ ఆఫీసులోకి ఎంటరయ్యారు. అంతకుముందు ఈడీ దర్యాప్తు అధికారి జోగేంద్రకు కవిత సంచలన లేఖ రాశారు. ఈ లేఖలో పలు కీలక విషయాలను ఆమె ప్రస్తావించారు. కవిత ఫోన్లు ధ్వంసం చేశారని ఈడీ అభియోగం మోపిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఈడీ ఆరోపణలను తీవ్రంగా తప్పబట్టారు.
కవిత చెప్పిన లాజిక్ ఇదీ..!
‘నేను విచారణకు సహకరిస్తున్నాను. ఈడీ దురుద్దేశ పూర్వకంగా వ్యవహరిస్తున్నప్పటికీ కూడా నేను గతంలో వాడిన ఫోన్లను సమర్పిస్తున్నాను. ఒక మహిళ ఫోన్‌ను స్వాధీనం చేసుకోవడం గోప్యత హక్కుకు భంగం కలగదా.. ?. దుర్బుద్ధితో వ్యవహరిస్తున్న దర్యాప్తు సంస్థ నేను ధ్వంసం చేశానని పేర్కొంది. నాకు సమన్లు కూడా ఇవ్వకుండానే.. కనీసం అడగకుండానే ఏ పరిస్థితుల్లో దర్యాప్తు సంస్థ ఈ ఆరోపణలు చేసింది?. నన్ను తొలిసారిగా మార్చి నెలలో విచారణ కోసం ఈడీ పిలిచింది. కానీ గత ఏడాది నవంబరులోనే ఫోన్లు ధ్వంసం చేశానని ఈడి ఆరోపించడం అంటే దురుద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేయడమే. తప్పుడు ఆరోపణను ఉద్దేశపూర్వకంగా లీకేజీ ఇవ్వడం వల్ల నా రాజకీయ ప్రత్యర్థులు నన్ను ప్రజల్లో నిందిస్తున్నారు. తద్వారా నా ప్రతిష్టకు తీవ్ర భంగం కలగడమే కాకుండా నా పరువును మా పార్టీ ప్రతిష్టను ప్రజల్లో తగ్గించే ప్రయత్నం జరిగింది. రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఈడీ వంటి దర్యాప్తు సంస్థ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలన్న విధిని తొక్కిపెట్టి వ్యవహరించడం దురదృష్టకరం. అందుకే నా పాత ఫోన్లన్నీ ఈడీ అధికారికులకే ఇచ్చేస్తున్నాను’ అని లేఖలో కవిత పేర్కొన్నారు. మొత్తానికి చూస్తే.. ఫోన్లను ధ్వంసం చేయలేదన్న విషయాన్ని ఇలా తన పాత ఫోన్లన్నీ మీడియా ముందే చూపించడంతో పాటు.. ఈడీకి ఇచ్చి కవిత నిరూపించారు. అంతేకాదు.. మార్చిలో విచారణకు పిలవడం.. నవంబర్‌లోనే ఫోన్లను ధ్వంసం చేశారని చెప్పడమేంటని గట్టి లాజిక్‌తోనే కవిత ఈడీని కొట్టారని నిపుణులు చెబుతున్నారు.

పాత ఫోన్ల తో మూడోసారి ఈడీ విచారణకు హాజరయిన కవిత
మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మూడోసారి ఈడీ విచారణకు హాజరయ్యారు. విచారణకు వెళ్తూ.. వెళ్తూ ధ్వంసం చేశారని ఆరోపణలు వచ్చిన 10 పాత ఫోన్లను కవిత మీడియాకు చూపించారు. కారులో ఉన్న ఫోన్లను బయటికి తీసి ప్లాస్టిక్ కవర్లలో ప్యాకింగ్ చేసిన ఫోన్లను స్వయంగా ఆమే చూపించారు. ఈడీ కార్యాలయానికి ఆ ఫోన్లను కవిత తీసుకెళ్లారు. ఢిల్లీలోని కేసీఆర్ నివాసం దగ్గర ఒకసారి.. ఈడీ ఆఫీసు ముందు మరోసారి కవిత తన ఫోన్లను చూపించారు. సోమవారం జరిగిన విచారణలో మొబైల్స్ తీసుకురావాలని ఈడీ అధికారులు ఆదేశించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో ఇవాళ తన వెంట కవిత ఆ ఫోన్లు తీసుకెళ్లారని తెలియవచ్చింది. ఈ ఫోన్లన్నీ ఈడీ ఆఫీసర్లకు కవిత ఇవ్వనున్నారు. కాగా సెప్టెంబర్ 2021 నుంచి ఆగస్టు 2022 వరకు కవిత 10 ఫోన్లు వాడినట్లు, ధ్వంసం కూడా చేసినట్లు ఈడీ అభియోగం ఉంది. ఈ కేసులో మొత్తం 36 మంది 170 ఫోన్లు మార్చారని ఈడీ అభియోగాలు ఉన్నాయి. స్పెషల్ కోర్టుకు దాఖలు చేసిన ప్రాసిక్యూషన్‌ కంప్లైంట్‌లో కవిత 10 ఫోన్లు వాడినట్లు ఈడీ స్పష్టంగా తెలిపింది. మొత్తానికి చూస్తే.. ఫోన్లు ధ్వంసం చేశారన్న ఈడీ అభియోగంపై ఇవాళ్టితో కవిత ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. కాగా మొదటిరోజు విచారణ రోజే కవిత వ్యక్తిగత ఫోన్‌ను ఈడీ సీజ్ చేసింది.కాగా.. ఇప్పటి వరకూ రెండుసార్లు విచారణకు హాజరైన కవిత తన వెంట లాయర్లను తీసుకెళ్లలేదు. అయితే ఇవాళ మాత్రం లాయర్లతో కలిసే ఈడీ ఆఫీసుకు వెళ్లారు. దీంతో విచారణ తర్వాత ఏం జరుగుతుందో ఏమో అని బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్ పెరిగిపోయింది. అంతకుముందే న్యాయనిపుణులతో కవిత కీలక సమావేశం నిర్వహించారు. ఇవాళ్టి విచారణలో ఎలా ముందుకెళ్లాలి..? అనేదానిపై న్యాయవాదులతో ఆమె సలహాలు, సూచనలు తీసుకున్నట్లు తెలుస్తోంది. సుమారు అరగంటకుపైగా లాయర్లతో కవిత, మంత్రి కేటీఆర్ చర్చించినట్లు తెలుస్తోంది. న్యాయవాదులతో సమావేశం అనంతరం కవిత తిరిగి కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. ఆ తర్వాత కవిత ఈడీ ఆఫీసుకు బయల్దేరివెళ్లారు. వాస్తవానికి ఈడీ విచారణకు ముందు కవిత ప్రెస్‌మీట్ పెట్టే అవకాశాలున్నాయని మొదట వార్తలు వచ్చాయి. మీడియా ప్రతినిధులు కూడా కేసీఆర్ నివాసం దగ్గర సిద్ధంగా ఉన్నారు. అయితే చివరి నిమిషంలో ప్రెస్‌మీట్ రద్దయ్యింది.

Related Posts