న్యూఢిల్లీ,
బంగారం ధరలు మళ్లీ ఎగిసిపడుతున్నాయి. దేశీయ మార్కెట్‌లో ఇప్పటికే 24 క్యారెట్ గోల్డ్ రేటు రూ.60,000 దాటింది. గడిచిన 10 రోజుల్లోనే 10 గ్రాముల ధర దాదాపు రూ.5,000 పుంజుకోవడం గమనార్హం. ఈ క్రమంలో తర్వలోనే మునుపెన్నడూ లేనివిధంగా తులం విలువ రూ.70,000లను తాకవచ్చన్న అంచనాలు ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి. గత వారం భువనేశ్వర్‌లో రూ.57,620గా ఉన్న 10 గ్రాముల 99.9 స్వచ్ఛత పసిడి రేటు.. ప్రస్తుతం రూ.61,400లకు చేరింది. దీంతో ఇదే జోరు కొనసాగితే రాబోయే రోజుల్లో ధర రూ.70,000లకు వెళ్లవచ్చనే అభిప్రాయం మార్కెట్ వర్గాల్లో వ్యక్తమవుతున్నది.
నగల ధరలు ఇలా..
ఆభరణాల బంగారమైన 22 క్యారెట్ ధరలు కూడా దూసుకుపోతున్నాయి. ఈ నెల 9న 99.5 స్వచ్ఛత కలిగిన పుత్తడి ధర భువనేశ్వర్‌లో 50,500లుగా ఉన్నది. అయితే ఇప్పుడిది రూ.55,400 పలుకుతుండటం విశేషం. పెండ్లిళ్ల సీజన్ కావడంతో మార్కెట్‌లో బంగారానికి డిమాండ్ కనిపిస్తున్నదని నగల వర్తకులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే తులం 24 క్యారెట్ ధర రూ.70,000 తాకితే.. 22 క్యారెట్ రేటు సైతం రూ.65,000-66,000 దరిదాపుల్లోకి రావచ్చన్న అంచనాలను వెలిబుచ్చుతున్నారు.
బ్యాంకింగ్ సంక్షోభం వల్లే..
అమెరికా, ఐరోపాల్లో తలెత్తిన బ్యాంకింగ్ సంక్షోభం వల్లే బంగారం ధరల్లో ఈ పెరుగుదల అని మార్కెట్ నిపుణులు తాజా ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు. అమెరికా, యూరప్‌ల్లో ప్రధాన బ్యాంకులు మూతబడటంతో స్టాక్ మార్కెట్లపై మదుపరుల్లో విశ్వాసం సన్నగిల్లిందని, దీంతో క్యాపిటల్ మార్కెట్ల నుంచి వారు పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారని, ఈ పెట్టుబడులను తిరిగి బంగారం వైపు మళ్లిస్తున్నారని మార్కెట్ నిపుణుడు త్రినాథ్ లెంక తెలిపారు. ఇన్వెస్టర్లకు ఇప్పుడు పుత్తడి ఓ సురక్షిత పెట్టుబడి సాధనంగా ఉందని అంటున్నారు. పైగా ఈ బ్యాంకింగ్ సంక్షోభం ఓ కొలిక్కి వచ్చేదాకా బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయని అంచనా వేశారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధంతో ఏడాది కిందట ఔన్సు బంగారం ధర 2,052 డాలర్లను తాకినది తెలిసిందే.