YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

బడిబాట కు అంతా సిద్ధం

బడిబాట కు అంతా సిద్ధం

విద్యా సంవత్సరం ప్రారంభానికి సమయం దగ్గర పడుతుండటంతో విద్యాశాఖ అధికారులు ముందస్తుగా సమాయత్తం అవుతున్నారు. జూన్‌ 1 నాటికి ప్రైవేట్‌ పాఠశాలల్లో విద్యార్థులు చేరిపోతున్న నేపథ్యంలో ముందస్తుగా కార్యక్రమం నిర్వహించడం కారణంగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. దీంతోపాటు ఉపాధ్యాయులు జూన్‌ 1న పాఠశాలలు తెరిచేందుకు అవసరమైన సన్నద్ధత చేసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా పాఠశాలలను శుభ్రం చేసుకోవడం, అవకాశం ఉన్న చోట రంగులు వేయించడం చేయిస్తున్నారు. ఫలితంగా ఇటు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించడంతోపాటు పునః ప్రారంభానికి పాఠశాలలను సిద్ధం చేసుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు.అధికారికంగా బడిబాట ప్రణాళిక విడుదల కాకముందే బుధవారం నుంచి స్వచ్ఛందంగా బడిబాట కార్యక్రమం నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. ప్రధానంగా విద్యార్థులు తక్కువగా ఉన్న పాఠశాలలు, అసలు విద్యార్థులు లేక పాఠశాలలు మూతపడిన ప్రాంతాల్లో దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. మండల విద్యాధికారులు సైతం ముందస్తుగా బడిబాట కార్యక్రమం నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో బడిబయటి పిల్లల వివరాలపై ప్రతిసారీ స్పష్టత ఉండేది కాదు. విద్యాశాఖ అధికారులు లెక్కలు వేసుకొని ప్రతిసారి కార్యక్రమం నిర్వహించేవారు. గతేడాది బడిబాట కార్యక్రమం నిర్వహించే సమయంలో 1,476 మంది విద్యార్థులు ఉండగా సుమారు 600ల మందిని పాఠశాలల్లో చేర్పించారు. ఈ ఏడాది బడిబయటి పిల్లల వివరాలు పక్కాగా ఉండాలనే ఆలోచనతో కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ ప్రత్యేకంగా సర్వే నిర్వహించారు. విద్యాశాఖ అధికారులను మినహాయించి సెర్ప్‌, మెప్మాలకు చెందిన మహిళా సంఘాల సభ్యులతో సర్వే చేయించారు. ఫలితంగా గత ఏడాది కంటే కూడా రెట్టింపు సంఖ్యలో బడిబయట పిల్లలు ఉన్నట్లు గుర్తించారు. సర్వేలో 2,243 మంది బాలబాలికలు బడిబయట ఉన్నట్లు తేలింది. వీరందరిని పాఠశాలల్లో చేర్పించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. బడిబాట కార్యక్రమాన్ని వచ్చే నెల నాలుగో తేది నుంచి నిర్వహించేందుకు అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన ప్రణాళిక ఇంకా విడుదల చేయలేదు. ఈలోగానే ఇంటింటికి తిరిగి పాఠశాలల ప్రాముఖ్యత తెలియజేయడం, తల్లిదండ్రులు వారి పిల్లలను పాఠశాలల్లో చేర్పించే విధంగా అవగాహన కల్పించడంపై జిల్లా అధికారులు దృష్టి పెట్టారు. తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటు చేసి పాఠశాలల్లో బోధన తీరు, ఎలాంటి మార్పులు వచ్చాయి, విద్యార్థుల్లో ప్రమాణాలు ఎలా ఉన్నాయనే విషయాలను వివరించనున్నారు.

Related Posts