విజయవాడ, మార్చి 24,
జనాలకు ఎలాంటి ఆసక్తి లేని ఎమ్మెల్సీ ఎన్నికలకి కూడా మంచి ఊపు తీసుకొచ్చాయి వైసీపీ, తెలుగుదేశం. ఎప్పుడూ ఈ ఎన్నికలు చాలా సైలెంట్‌గా అసలు జరిగాయా లేదా అన్నట్టు సాగిపోయేవి. అద్భుతాలు జరిగే ఆ ఒక్కరోజు మాత్రమే చర్చలో ఉండేవి. కానీ ఈసారి ఏపీలో జరిగిన కొన్ని ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలు మాత్రం చాలా టెన్షన్ పెట్టాయి. నోటిఫికేషన్ పడినప్పుడు కనిపించని టెన్షన్ ఫలితాలు రోజున మాత్రం పీక్స్‌కు వెళ్లింది. సాధారణ ఎన్నికలకు ఉన్న హైప్ వచ్చింది. అదే టెంపోను ఎమ్మెల్యే కోట ఎన్నికల్లో కూడా కనిపిస్తోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ ఓటమిపాలైంది. అప్పటికే ఎమ్మెల్సే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో ఉన్న టీడీపీ తన వ్యూహానికి మరింత పదును పెట్టింది. మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఓటమి బాధలో ఉన్న వైసీపీ మరింత కలవర పెట్టేందుకు ప్లాన్ చేసింది. ఆ పార్టీలో చాలా మంది అసంతృప్త ఎమ్మెల్యేలు ఉన్నారని.. వారి కచ్చితంగా తమకే ఓటు వేస్తారని బాంబు పేల్చింది. ఇప్పటికే కోటం రెడ్డి, ఆనంరాంనారాయణ రెడ్డి లాంటి వారితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వైసీపీ మరింత అలర్ట్ అయింది. ఓ వైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతన్న టైంలోనే తమ వైపు నుంచి ఎలాంటి తప్పు జరగకుండా ఒక్క ఓటు కూడా వృథా పోకుండా ఉండేలా ప్లాన్ చేసింది. అసలు వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేసేది ఎవరో... అలాంటి ఆలోచనతో ఎవరు ఉన్నారో తెలియదు కానీ అధికార పార్టీ మాత్రం పరుగులు పెట్టింది. మాక్ పోలింగ్ పేరుతో ఎమ్మెల్యేలకు శిక్షణ ఇచ్చింది. ఎలా ఓటు వేయాలి... అంటూ ఒకటికి పదిసార్లు చెప్పింది. ఒక్కో ఎమ్మెల్సీ అభ్యర్థికి 22 మంది ఎమ్మెల్యేలను కేటాయించింది. వారంతా ఆ ఎమ్మెల్సీకే ఓటు వేయాలని మాక్ పోలింగ్‌లో చెప్పారు. అంతే కాదు.. ఆ ఎమ్మెల్యేల నుంచి తప్పు జరగకుండా మంత్రులను కూడా వారికి అటాచ్ చేసింది. ఇలా వారం రోజుల నుంచి అధికార పార్టీ జాగ్రత్త పడుతూ వచ్చింది. అంతే కాదు... కాస్త అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేల ఫ్యామిలీలతో కూడా మాట్లాడినట్టు ప్రచారం జరుగుతోంది. స్వయంగా సీఎం జగన్ రంగంలోకి దిగి కొందరి ఎమ్మెల్యేలతో చర్చలు జరిపినట్టు కూడా టాక్ నడుస్తోంది. కావాల్సిన పనులకు కూడా ఆమోదం తెలిపారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇలా ఏ చిన్న తప్పు జరగకుండా ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఇదంతా ముందు జాగ్రత్త అంటున్నారు వైసీపీ నేతలు. తాము పన్నిన వ్యూహంలో వైసీపీ చిక్కుకుందని.. జాగ్రత్త పడి ఎమ్మెల్యేల పనులు చేసిందని.. పరుగులు పెట్టిందని విమర్శిస్తున్నారు టీడీపీ నేతలు.
పోలింగ్‌కు కొన్ని గంటల ముందు గంటా రాజీనామా ప్రచారంతో అధికార పార్టీ మైండ్ గేమ్. ఎప్పుడో రెండేళ్ల క్రితం స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో పాల్గొంటానని చెప్పి రాజీనామా చేసిన గంటా ఎపిసోడ్‌ను తమకు అనుకూలంగా మార్చుకుంది వైసీపీ. దాన్ని స్పీకర్ ఆమోదించారని... గంటాకు ఓటు వేసే హక్కు లేదంటూ ప్రచారం మొదలు పెట్టింది. దీంతో టీడీపీ శ్రేణుల్లో కాస్త అలజడి రేగింది. ఓటర్ లిస్టు రెడీ అయిందని... ఈ టైంలో రాజీనామా ఆమోదించినా నష్టం లేదంటూ క్లారిటీ ఇచ్చింది టీడీపీ. గంటా శ్రీనివాసరావు నిర్భయంగా ఓటు వేసుకోవచ్చని కూడా చెప్పింది. దీంతో గంటా రాజీనామా ఆమోదం ప్రచారానికి తెరపడింది. ఓటు వేసిన తర్వాత తన రాజీనామా ఆమోదంపై క్లారిటీ ఇచ్చారు. ఇదంతా వైసీపీ చేసిన దుష్ప్రచారంగా కొట్టిపారేశారు. గంటా రాజీనామా ఆమోదం ప్రచారానికి విరుగుడుగా టీడీపీ మరో ప్రచారాన్ని మొదలు పెట్టింది. 16 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారంటూ బాంబు పేల్చింది. వాళ్లంతా వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తున్నారని ప్రచారం మొదలు పెట్టారు. టీడీపీ పోలింగ్ ఏజెంట్ నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలోనూ తెలుగుదేశం అభ్యర్థి గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. అంతరాత్మ ప్రభోదానుసారం వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు తమకు ఓటు వేయబోతున్నారని అన్నారు. వైఎస్ఆర్ సీపీలో అసంతృప్తితో ఉన్న 16 మంది ఎమ్మెల్యేలు తమకు టచ్‌లోనే ఉన్నారని అన్నారు. పట్టభద్రుల ఎన్నిక తర్వాత వైఎస్ఆర్ సీపీ మునిగిపోయే పడవ అని సొంత పార్టీ ఎమ్మెల్యేలే గ్రహించారని అన్నారు. ఎమ్మెల్యే కోటాలో ఝలక్ ఇస్తేనే జగన్ మారతారనే భావనలో చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారని అన్నారు. సీక్రెట్ ఓటింగ్‌లో ఎవరు ఎవరికి వేశారో తెలిసే అవకాశమే లేదని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు.