భువనేశ్వర్, మార్చి 24,
పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమత బెనర్జీ బీజేపీయేతర, కాంగ్రెసేతర కూటమి కోసం చాన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్ లో గట్టి పోటీ ఇచ్చిన బీజేపీ ని ఓడించారు. దేశవ్యాప్తంగా బీజేపీని ఓడించడం లక్ష్యంగా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా, పలు రాష్ట్రాల్లో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలతో కలిసి ఒక బలమైన మూడో కూటమి ఏర్పాటుకు కృషి చేస్తున్నారు. ఒడిశాలో బలంగా ఉన్న, 21 లోక్ సభ స్థానాల్లో కనీసం 20 సీట్లు గెలుచుకోగల బీజేడీ ని తమ కూటమిలో చేర్చుకోవడం కోసం మమత ప్రయత్నిస్తున్నారు. మరోవైపు, తెలంగాణ సీఎం, భారత రాష్ట్రీయ సమితి అధ్యక్షుడు కే చంద్ర శేఖర్ రావు కూడా రానున్న లోక్ సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ (BRS) కేంద్రంగా మూడో కూటమి కోసం ప్రయత్నిస్తున్నారు.పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ ఒడిశాలో పర్యటిస్తున్నారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఆహ్వానంపై ఆమె ఆ రాష్ట్రంలో మూడు రోజుల పర్యటన ప్రారంభించారు. లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఈ రెండు బీజేపీయేతర ముఖ్యమంత్రులు భేటీ కావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.మమత బెనర్జీ ఇటీవల ఉత్తర ప్రదేశ్ లోనూ పర్యటించారు. అక్కడ సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ లు సంయుక్తంగా ఒక ప్రకటన చేశారు. రానున్న ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కు సమాన దూరం పాటిస్తామని వారు స్పష్టం చేశారు. దాంతో, ఇప్పుడు ఒడిశా పర్యటనలోనూ మమత బెనర్జీ బిజూజనతాదళ్ చీఫ్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా అదే తరహాలో ఒక సంయుక్త ప్రకటన చేసే అవకాశముందని భావిస్తున్నారు. అయితే, మూడో ఫ్రంట్ ఏర్పాటు విషయమై ఇంతవరకు ఎవరితో చర్చించలేదని నవీన్ పట్నాయక్ ప్రకటించారు. 2009లో బిజూ జనతాదళ్ బీజేపీ తో పొత్తు తెంచుకుని ఎన్డీఏకు దూరమైంది. అప్పటి నుంచి ఆ పార్టీ బీజేపీకి, కాంగ్రెస్ కు సమదూరం పాటిస్తోంది. అయినా, కేంద్రంలోని బీజేపీ విధానాలకు మద్దతిస్తూ వస్తోంది.