ముంబై, మార్చి 24,
దేశంలో అత్యధిక బిలియనర్లు నివాసముంటున్న నగరాల జాబితాలో ముంబై టాప్లో నిలిచింది. దేశ వాణిజ్య రాజధానిలో 66మంది బిలియనీర్లు నివాసముంటున్నారు. 2023 హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్లో ఈ విషయం తేలింది.ఇండియాలో యూఎస్ డాలర్ బిలియనీర్ల సంపద తగ్గట్టుగా ర్యాంకింగ్స్ ఇస్తుంది ఈ హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్. 2023 రిచ్ లిస్ట్ ప్రకారం.. ముంబై తర్వాత, ఎక్కువ మంది బిలియనీర్లు ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో ఉన్నారు. 39మంది సంపన్నులు ఢిల్లీలో ఉండగా, 21మంది కోటీశ్వరులు బెంగళూరులో నివాసముంటున్నారు. దేశంలోని 24 నగరాలు/ పట్టణాల్లో 187 బిలియనీర్లు ఉన్నారు. ఈ విషయంలో, ప్రపంచవ్యాప్తంగ ఇండియా 6వ స్థానంలో నిలిచింది. 2023 హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ ప్రకారం.. అత్యధిక మంది బిలియనీర్లు ఉన్న టాప్ 25 నగరాల్లో ముంబై, ఢిల్లీ, బెంగళూరుకు స్థానం దక్కింది.గ్లోబల్ రిచ్ లిస్ట్లో భారతీయుల ర్యాంక్లు శరవేగంగా పెరుగుతున్నట్టు హురున్ సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా.. అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ కుటుంబం గత పదేళ్లల్లో 437 ర్యాంక్లు దాటేసింది. ముంబైలో అత్యంత సంపన్నుడిగా ముకేశ్ అంబానీ కొనసాగుతున్నారు. గత పదేళ్లల్లో ఆయన సంపద 356శాతం మారింది. ముకేశ్ అంబానీతో పాటు బిలియనీర్లు దిలీప్ శాంగ్వీ, రాధాకృష్ణన్ దమానీ, కుమార మంగళం బిర్లా, ఉదయ్ కొటాక్లు ముంబైలోనే నివాసముంటున్నారు.2023 ఏషియన్ రిచ్ లిస్ట్లో ముకేశ్ అంబానీకి తొలి స్థానం దక్కింది. ఆయన సంపద.. గతంతో పోల్చుకుంటే 20శాతం తగ్గి 82 యూఎస్ బిలియన్ డాలర్లకు చేరింది. అదానీ కుటుంబం 35శాతం సంపద కోల్పోవడంతో మూడో స్థానానికి పడిపోయింది. రెండో స్థానంలో షాంగ్ షాంషా ఉన్నారు," అని హురున్ రిచ్ లిస్ట్ వెల్లడించింది.