YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రోజుకో మలుపు తిరుగుతున్న పేపర్ లీకేజ్ కేసు

రోజుకో మలుపు తిరుగుతున్న పేపర్ లీకేజ్ కేసు

హైదరాబాద్, మార్చి 24, 
తెలంగాణలో పేపర్ లీక్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తీగ లాగితే డొంక కదిలినట్లు, ఇందులో పాత్రధారుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తవ్వే కొద్ది అక్రమార్కులు బయటపడుతూనే ఉన్నారు. ఉన్నతాధికారుల అజమాయిషీ లేకపోవడంతో టీఎస్‌పీఎస్సీలో కొందరు ఉద్యోగుల అక్రమాలకు అడ్డులేకుండా పోయింది. ఆడిందే ఆట.. పాడిందే పాటగా అన్నట్లు సాగింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాన్ని దొంగిలించి, ఇతరులకు లీక్ చేయడమే కాదు.. తమకేమీ తెలియదన్నట్టుగా వ్యవహరించారు. దొంగిలించిన ప్రశ్నపత్రం ఆధారంగా పరీక్షలో ఎక్కువ మార్కులు తెచ్చుకుని మెరిట్ సాధించినట్లు గొప్పలకు పోయారు. ప్రశ్నపత్రాల లీకేజీలో తొలుత కమిషన్‌లోని ఇద్దరు ఉద్యోగుల పాత్ర మాత్రమే ఉందని భావించగా.. తాజా అరెస్టులతో మరికొందరు ఉద్యోగులు ఇందులో ఉన్నట్లు నిర్ధారణ అయింది.తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు సంబంధించి పాలనాపరమైన అన్ని వ్యవహారాలు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉంటాయి. కమిషన్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు బాధ్యతలు అప్పగించడంతో పాటు నిబంధనలకు లోబడి పనిచేస్తున్నారా? అని చూడాల్సిన బాధ్యత కూడా కార్యదర్శిదే. పరీక్షల నిర్వహణకు సంబంధించిన అంటే ప్రశ్నపత్రాల తయారీ, నిల్వ చేయడం, మూల్యాంకనం వంటి రహస్య కార్యకలాపాలన్నీ కార్యదర్శి అధీనంలోనే ఉంటాయి. ఇక్కడ పనిచేసే ఉద్యోగులు కమిషన్ నిర్వహించే ఏ పరీక్ష రాయాలన్నా కార్యదర్శి నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి. అనుమతి పొందిన ఉద్యోగులను సెలవుపై పంపించాలి. లేకుంటే పరీక్షల వ్యవహారాలకు సంబంధించిన సెక్షన్ల నుంచి వారిని దూరంగా పెట్టాలి. ఈ విషయంలో ఉన్నతాధికారులు ఉదాసీనంగా వ్యవహరించారు. గ్రూప్-1 పరీక్ష రాసేందుకు అనుమతి పొందిన ఉద్యోగులపై ఎలాంటి ఆంక్షలు విధించలేదు. దీంతో వారు ఇష్టానుసారంగా వ్యవహరించారు. నిరుద్యోగులు, ఉద్యోగార్థులు రాత్రింబవళ్లూ సిద్ధమవుతుండగా వారు మాత్రం యథావిధిగా ఉద్యోగం చేసుకుంటూ పరీక్ష రాశారు. శాశ్వత, పొరుగు సేవల ఉద్యోగులు మొత్తం 20 మంది పరీక్ష రాయగా, వీరిలో ఎనిమిది మంది మెయిన్స్‌కు అర్హత సాధించడం గమనార్హం.ప్రిలిమినరీ పరీక్షలో మొత్తం 121 మందికి 100 మార్కులకు పైగా వచ్చాయి. సాధారణంగా కమిషన్ నిర్వహించిన పరీక్షలో అత్యధిక మార్కులు సాధించిన మొదటి 20 మంది అభ్యర్థుల ఓఎంఆర్ పత్రాలను మరోసారి మాన్యువల్‌గా పరిశీలిస్తారు. కంప్యూటర్ మూల్యాంకనంలో ఏమైనా లోపాలు జరిగాయా? మార్కులు సరైనవేనా? అని పరిశీలిస్తారు. ఓఎంఆర్ పత్రాలు, కీని సరిచూస్తారు. ఏమైనా తేడా ఉన్నట్లు తేలితే మిగతా వాటినీ పరిశీలిస్తారు. మూల్యాంకనంలో తప్పులు దొర్లకుండా ఈ పద్ధతి అవలంబిస్తారు. అయితే కమిషన్ కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులు రమేష్, షమీమ్‌లకు 120కి పైగా మార్కులు వచ్చినా పరిపాలన, కాన్ఫిడెన్షియల్ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు గుర్తించలేకపోయారు. వీరిద్దరికీ గ్రూప్-1 ప్రశ్నపత్రం లీకేజీ అయినట్లు సిట్ దర్యాప్తులో నిర్ధారణ కావడంతో పోలీసులు అరెస్టు చేశారు. షమీమ్‌కు రాజశేఖర్, రమేష్‌కు ప్రవీణ్ ప్రశ్నపత్రం చేరవేసినట్లు గుర్తించారు.రాష్ట్రంలో ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో పోటీపరీక్షల నిర్వహణ విధానంలో కీలక మార్పులు చేయాలని టీఎస్‌పీఎస్సీ భావిస్తోంది. ఈ మేరకు కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టబోతుంది. ఇకపై ఉద్యోగ నియామకాలకు సంబంధించిన రాతపరీక్షలను వేగంగా నిర్వహించి, వెంటనే ఫలితాలు వెల్లడించే దిశగా.. ఆన్‌లైన్ విధానంవైపు అడుగులు వేస్తోంది. పరీక్ష పత్రాల తయారీ, భద్రత, తదితర సాంకేతిక ఇబ్బందులు లేకుండా భారీ సంఖ్యలో ప్రశ్నలనిధి రూపొందించి, అభ్యర్థుల సంఖ్య ఎంత ఉన్నప్పటికీ విడతల వారీగా పరీక్షలు నిర్వహించనుంది. ప్రస్తుతం 25వేల మంది అభ్యర్థులు హాజరయ్యే పరీక్షలకు మాత్రమే కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహిస్తూ వస్తోంది. అంతకు మించి అభ్యర్థులు హాజరయ్యే పరీక్షలకు ఈ విధానాన్ని విస్తరించనుంది. అభ్యర్థులందరికీ ఒకేసారి కాకుండా విడతల వారీగా పరీక్షలు నిర్వహించి, నార్మలైజేషన్ విధానం అమలు చేయాలని కమిషన్ భావిస్తోంది. తెలంగాణలో టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం తీవ్ర దుమారానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఇంటిదొంగలే మోసం చేశారని సాక్షాత్తు టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ గోడు వెల్లబోసుకోవాల్సి వచ్చిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దీంతో తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌‌లో ప్రక్షాళన మొదలుపెట్టింది. కమిషన్‌లో అంతర్గత బదిలీలకు రంగం సిద్ధమైంది. టీఎస్‌పీఎస్సీ అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ ప్రవీణ్‌కుమార్‌, సిస్టమ్‌ అడ్మిన్‌ రాజశేఖర్‌రెడ్డి కలిసి ప్రశ్నపత్రాలను లీక్‌ చేసినట్టు తేలడంతో కొత్త సంస్కరణలకు కమిషన్‌ శ్రీకారం చుట్టింది. కార్యాలయంలో సిబ్బంది తక్కువగా ఉండటం, పనిభారం ఎక్కువ కావడం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటూనే.. బదిలీలు చేయాలని కమిషన్‌ భావిస్తోంది.

పేపర్ లీకేజ్ పై గవర్నర్ ఫోకస్ నివేదిక ఇవ్వాలని ఆదేశం
సంచలనం సృష్టిస్తున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో గవర్నర్‌ రియాక్ట్ అయ్యారు. పూర్తి వివరాలు తనకు సమర్పించాలని లేఖలు రాశారు. సీఎస్‌ శాంతికుమారి, టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ జనార్ధన్ రెడ్డి, డీజీపీ అంజనీకుమార్‌కు గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. పూర్తి నివేదిక ఇవ్వాలన్నారు. అదేటైంలో అసలు టీఎస్‌పీఎస్‌సీలో ఎంతమంది పని చేస్తున్నారు. అందులో  రెగ్యులర్‌ ఉద్యోగులు ఎవరు... ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ఎంతమంది వాళ్ల వివరాలు ఏంటో చెప్పాలని కూడా జనార్ధన్‌ను ఆదేశించారు. సిట్‌ దర్యాప్తు స్టాటస్‌ చెప్పాలని సిట్‌ అధికారులను కూడా ఆదేశించారు. ఈ మధ్యే తనను కలిసిన కాంగ్రెస్ నేతలతో గవర్నర్‌ తమిళిసై చాలా కీలక వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఆ కామెంట్స్ చేసిన ఒక్కరోజులోనే సమగ్ర నివేదిక కోరడంతో తర్వాత ఏం జరుగుతుందా ఆనే ఆసక్తి అందరిలో కనిపిస్తోంది. కాంగ్రెస్‌ నేతలతో సమావేశంలోనే పేపర్ లీక్ పరిణామాలపై సీరియస్‌గా ఉన్నట్లు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంకేతాలు పంపారు. టీఎస్‌పీఎస్సీ వ్యవహారం, విద్యార్థుల ఆత్మహత్య ఘటనలు తనను ఆవేదనకు గురి చేస్తున్నాయని అన్నట్టు టీ-కాంగ్రెస్ నేతలతో చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. దీన్ని సీరియస్‌గా తీసుకుంటున్నామని అంత ఈజీగా వదిలిపెట్టలేమంటూ కామెంట్ చేశారని కూడా హస్తం నేతలు చెప్పారు. కాంగ్రెస్ నేతలు చెప్పినట్టు పేపర్ లీకేజీపై గవర్నర్‌ సీరియస్‌గా ఉంటే తర్వాత ఏం చేస్తారు. ఈ వ్యవహారంలో ఆమెకు ఉన్న అధికారాలు ఏంటీ అన్న చర్చ మొదలైంది. ఇప్పటికే ప్రభుత్వానికి గవర్నర్‌కు పొసగడం లేదు. చాలా కాలంగా రెండు వ్యవస్థల మధ్య వార్ నడుస్తోంది. చాలా కీలకమైన బిల్లులు గవర్నర్ పెండింగ్‌లో పెట్టుకొని క్లియర్ చేయడం లేదని ఏకంగా కోర్టునే ఆశ్రయించింది ప్రభుత్వం. ఇది ఇంకా కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ మధ్య దీనిపై విచారణ చేసిన సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది కేసు విచారణ వాయిదా వేసింది. బిల్లుల క్లియరెన్స్‌పై వివాదం నడుస్తుండగానే ఇప్పుడు గవర్నర్‌ తన దృష్టిని టీఎస్‌పీఎస్సీ పెట్టారు. ఏం జరుగుతోంద తనకు చెప్పాలని ఆదేశాలు జారీ చేశారు. పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత ఆమె చేయబోతున్నారనేది కీలకంగా మారునుంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసిన ఉద్యోగులపై జాబితాను తీసిన సిట్... వారి మార్కులను తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో టీఎస్పీఎస్పీ ఉద్యోగుల్లో మరో ఇద్దరికి గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో అత్యధిక మార్కులు వచ్చినట్లు సిట్ అధికారులు గుర్తించారు. 2013లో గ్రూప్‌-2 ఉద్యోగం సాధించిన షమీమ్‌కు గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో 127 మార్కులు, టీఎస్పీఎస్సీలో పొరుగుసేవల ఉద్యోగిగా పనిచేస్తున్న రమేశ్‌కు 122 మార్కులు వచ్చినట్లు సిట్‌ అధికారుల దర్యాప్తులో తేలింది. పేపర్ల లీకేజీ కేసులో A2 నిందితుడు రాజశేఖర్‌ నుంచి గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పేపర్ పొందినట్లు షమీమ్‌ ఒప్పుకున్నాడు. అందుకు తాను డబ్బులు చెల్లించలేదని తెలిపాడు. పేపర్ల లీకేజీలో మరో కోణం వెలుగు చూస్తుంది. నిందితుల సెల్ ఫోన్లలోని డేటా, వాట్సప్‌ చాట్, గ్రూపుల ఆధారంగా సిట్ దర్యాప్తు చేస్తుంది. ఈ సమాచారంతో గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రాసి మెయిన్స్ కు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను తయారుచేసేందుకు సిట్ ప్రణాళిక సిద్ధం చేసింది. టీఎస్పీఎస్సీలో పలు విభాగాల్లో పనిచేస్తున్న 8 మంది ఉద్యోగులు... గత అక్టోబరులో జరిగిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష రాసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. వీరిలో కొందరు ఉద్యోగులు 100కు పైగా మార్కులు సాధించినట్లు తెలుస్తోంది. ఆ సమాచారం సేకరణలో పడింది సిట్‌ బృందం.

రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు నాలుగుకు చేరిన ఉద్యోగుల అరెస్ట్
రిమాండు రిపోర్టులో కీలక అంశాలివే!
పేపర్ లీకేజ్ కేసులోని రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు బయటపడ్డాయి. ఇప్పటికి వరకు 12 మంది నిందితులను ఆరెస్ట్ చేసినట్టు రిమాండ్ రిపోర్టులో సిట్ పేర్కొంది. తొమ్మిది మంది నిందితులతో పాటు మరో ముగ్గురు అదుపులోకి తీసుకున్నారు అధికారులు.  ఆ ముగ్గురిలో ఇద్దరు టీఎస్పిఎస్సీ ఉద్యోగులే. వీరితో కలిపి ఇప్పటివరకు నలుగురు టీఎస్పిఎస్సీ ఉద్యోగుల అరెస్ట్ అయ్యారు.  వారిలో A1ప్రవీణ్  టీఎస్పిఎస్సీ సెక్రటరీ పీఏ, A2 రాజశేఖర్, నెట్వర్క్ అడ్మిన్ : A10 షమీమ్ ASO, A12 రాజశేఖర్, డాటా ఎంట్రీ ఆపరేటర్.  19మంది సాక్ష్యులను విచారించినట్టు రిమాండ్ రిపోర్టులో సిట్ పేర్కొంది. టీఎస్పిఎస్సీ  ఉద్యోగి శంకర్ లక్ష్మి ని ప్రధాన సాక్షిగా చేర్చారు. శంకర్ లక్ష్మి తో పాటు టీఎస్పిఎస్సీ,  తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీస్ ఉద్యోగులను కూడా సాక్షులుగా పేర్కొన్నారు. కర్మన్ ఘాట్ లోని ఒక హోటల్ యాజమని, అందులో ఉద్యోగిని కూడా సాక్షిగా చేర్చారు. హోటల్లోని సీసీటీవి కెమెరాలో పేపర్ మార్పిడి వ్యవహారం రికార్డయినట్టుగా సిట్ గుర్తించింది. ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు షమీమ్, రమేష్, సురేష్ ను ఆరెస్ట్ చేశారు. ముగ్గురు నిందితుల నుంచి ఒక ల్యాప్ టాప్ మూడు మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు.పేపర్ లీకేజ్ నిందితులకు గురువారం నాటికి పోలీస్ కస్టడీ విచారణ ముగిసింది. తాజాగా అరెస్ట్ చేసిన సురేష్, రమేష్, షమీమ్‌కి ఏప్రిల్ 4 వరకు జూడిషియల్ రిమాండ్ విధించారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో షమీమ్‌కి 126 మార్కులు, రమేష్‌కి 120 మార్కులు వచ్చినట్లు గుర్తించారు. షమీమ్‌కి వాట్సాప్‌లో గ్రూప్ 1 పేపర్‌ రాజశేఖర్ రెడ్డి పంపాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి షమీమ్ ఇంట్లో సోదాలు చేసింది సిట్ బృందం. గ్రూప్-1 లో వందకు పైగా మార్కులు వచ్చిన 121 మందిని గుర్తించి.. అందులో కొందరికి నోటీసులిచ్చారు. ఇందులో కొందరు విదేశాల్లో ఉన్నట్లు తెలిసింది. రాజశేఖర్ రెడ్డి బంధువు న్యూజిలాండ్ నుంచి వచ్చి ఎగ్జామ్ రాసి వెళ్లినట్లు సిట్ గుర్తించింది. అతనితో పాటు ఇంకొంతమంది ఫారిన్ నుంచి వచ్చి పరీక్ష రాసి వెళ్లినట్లు సమాచారం. FSL రిపోర్ట్ కోసం సిట్ అధికారులు ఎదురుచూస్తున్నారు.
మొత్తమ్మీద పేపర్ లీక్‌ వ్యవహారంలో కీలక సూత్రదారి రాజశేఖరే అని తేల్చింది సిట్. ఉద్దేశపూర్వకంగానే రాజశేఖర్‌ TSPSCకి డిప్యుటేషన్‌పై వచ్చాడని తేలింది. టెక్నికల్ సర్వీస్‌ నుంచి డిప్యూటేషన్‌పై వచ్చాడు. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తున్న రాజశేఖర్ కంప్యూటర్‌ని హ్యాక్ చేసి పాస్‌వర్డ్‌ని దొంగిలించాడు. పాస్‌వర్డ్‌ని తాను ఎక్కడా రాయలేదని శంకర్‌ లక్ష్మి చెప్పింది అబద్ధమని తేలింది. శంకర్‌ లక్ష్మి చెప్పిన ప్రకారమే కంప్యూటర్‌ హ్యాక్‌ చేసినట్లు గుర్తించారు. పెన్‌డ్రైవ్ ద్వారా 5 పరీక్షా పత్రాలను కాపీ చేశాడు రాజశేఖర్. కాపీచేసిన పెన్‌డ్రైవ్‌ను ప్రవీణ్‌కు ఇచ్చాడు. AE పరీక్ష పత్రాన్ని ప్రవీణ్‌ రేణుకకు అమ్మాడు. ఫిబ్రవరి 27నే పేపర్‌ను రాజశేఖర్ కాపీ చేసనట్టు తేలింది. గ్రూప్‌-1 లో ప్రవీణ్‌కు 103 మార్కులు రావడంపైనా సిట్ విచారణ చేసింది.

Related Posts