YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రాముడు అందరి వాడు-ఫరూక్ అబ్దుల్లా

రాముడు అందరి వాడు-ఫరూక్ అబ్దుల్లా

శ్రీనగర్, మార్చి 24, 
జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా మరోసారి రాముడిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలందరికీ మంచి మార్గంలో నడిపించేందుకు శ్రీరాముడిని స్వయంగా అల్లాయే పంపాడని అన్నారు. రాముడు అందరి దేవుడు అని వెల్లడించారు. ఓ ర్యాలీలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. "రాముడు కేవలం హిందువులకు మాత్రమే దేవుడు కాదు. అలాంటి ఆలోచనను పక్కన పెట్టేయండి. రాముడు అందరివాడు. అందరికీ ఆయన దేవుడే. ముస్లిమైనా, క్రిస్టియనైనా...అంతెందుకు అమెరికన్ అయినా, రష్యన్ అయినా నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరికీ ఆయన దేవుడే" - ఫరూక్ అబ్దుల్లా, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఇదే సమయంలో పాకిస్థానీ రచయిత చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు ఫరూక్ అబ్దుల్లా. "ఎవరైతే తాము రాముడి భక్తులం అని చెప్పుకుంటూ తిరుగుతున్నారో వాళ్లంతా మూర్ఖులే. కేవలం ఆయన పేరు చెప్పుకుని బతికేస్తున్నారంతే. వాళ్లకు రాముడిపై భక్తి, ప్రేమ ఉండవు. కేవలం అధికారం కోసమే అలా మాట్లాడుతుంటారు"
- ఫరూక్ అబ్దుల్లా, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి
జమ్ముకశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించే సమయంలో ప్రజల దృష్టిని మరల్చేందుకు అదే సమయంలో అయోధ్య రామ మందిరాన్ని ప్రారంభించే అవకాశాలున్నాయని అన్నారు. జమ్ము కశ్మీర్ ఎన్నికల కోసం కేంద్రం భారీ మొత్తంలో ఖర్చు చేసే అవకాశముందని చెప్పారు. హిందువులంతా ప్రమాదంలో ఉన్నారని ప్రచారం చేస్తారని..అలాంటి మాటల్ని పట్టించుకోవద్దని సూచించారు. గతంలోనూ ఫరూక్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. "రాముడు అందరివాడు. ఆయనను హిందూ మతానికే పరిమితం చేయాల్సిన అవసరం లేదు" అని వెల్లడించారు. ఏ మతమూ చెడు నేర్పించదని, ప్రజలే అలా తయారవుతారని తెలిపారు. "మాపై నిత్యం ఆరోపణలు చేస్తూనే ఉంటారు. కానీ మేమెప్పుడూ పాకిస్థాన్‌ సైడ్ తీసుకోలేదు. వారితో ఎప్పుడూ స్నేహం చేయలేదు. మా నాన్నను కలవడానికి జిన్నా వచ్చారు. కానీ మేము కనీసం ఆయనకు షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు" అని తేల్చి చెప్పారు. జమ్ముకశ్మీర్‌లోని యువతకు ఉద్యోగాలు ఇస్తామన్న కేంద్ర ప్రభుత్వం..ఆ మాట నిలబెట్టుకోలేక పోయిందని విమర్శించారు. "మనకు 50 వేల ఉద్యోగాలు ఇస్తామన్నారు..?  ఆ హామీ ఏమైంది" అని ప్రశ్నించారు. తరచూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు ఫరూక్. త్వరలోనే ఎన్నికలు నిర్వహించాలని ఇటీవలే ఎన్నికల సంఘాన్ని కోరారు.

Related Posts