విజయవాడ, మార్చి 25,
ఏపీలో పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి. అంచనాలు లేకుండానే ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సంచలనం సృష్టిస్తోంది. ఎక్కడో ఉంటుందని అధికార పార్టీ చెప్పిన టీడీపీ… మొదటి వరుసలోకి వచ్చింది. అధికారపార్టీ దీనిని ఊహించలేదా? మొత్తం ఉత్తరాంధ్రను గుప్పెటపట్టిన వైసీపీ అక్కడ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలతో కూడిన తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గంలోనూ ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలతో కూడిన పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గంలోనూ టీడీపీ-వైసీపీ మధ్య హోరాహోరీ పోరు నడిచింది.తొమ్మిది జిల్లాలు… దాదాపు 15 పార్లమెంట్ నియోజకవర్గాలు… 108 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ ఎన్నికలు జరిగాయి. కర్నూలు నుంచి ప్రకాశం జిల్లా వరకు టీడీపీకి ఉన్న ఎమ్మెల్యేలు ఏడుగురే. అసెంబ్లీ ఎన్నికల్లో కర్నూలు, నెల్లూరు, కడప వైసీపీ స్వీప్ చేసింది. ఉత్తరాంధ్రలోని 35 నియోజకవర్గాల్లో టీడీపీకి ఉంది ఎంపీ ఒకరైతే… ఎమ్మెల్యేల బలం ఆరే. అటువంటి చోట్ల ఇప్పుడు ఈ ఫలితాలు ఎలా సాధ్యం అయ్యాయనేదానిపై చర్చ జరుగుతోంది. 2019 ఎన్నికల్లో టీడీపీ జనసేన విడివిడిగా పోటీ చేశాయి. ఈ జిల్లాల్లో జనసేనకు ఒక్కటంటే ఒక్క సీటు రాకపోగా… పవన్ కల్యాణ్ గాజువాకలో ఓడిపోయారు. కానీ ఈసారి ఈ పార్టీలు వ్యూహం మార్చాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని చెబుతున్న పవన్ కల్యాణ్ తన బలగాలను టీడీపీ వైపు మళ్లించారట. అందుకే టీడీపీ ఆధిక్యంలోకి వచ్చిందట. పవన్ కల్యాణ్ కోరుకుంటోంది ఇదే. బీజేపీతో పొత్తులో ఉన్నా… టీడీపీతో కలిస్తేనే జగన్ ను ఓడించడం సాధ్యం అవుతుందనేది పవన్ లెక్క. దీనికి బీజేపీ ససేమిరా అంటోంది. అందుకే ఈ ఎన్నికల్లో బీజేపీ బరిలోఉన్నా… ఆ పార్టీకి మద్దతు ఇవ్వలేదు పవన్ కల్యాణ్. జనసేన-బీజేపీ కలయిక వల్ల ఒరిగేదీమీ లేకపోగా వైసీపీకి మేలు జరుగుతుందని పవన్ అంచనా వేశారట. అందుకే తమ పార్టీ వాళ్లకు వైసీపీని ఓడించాలని పిలుపు ఇచ్చారట. అది వర్కవుట్ కావడం వల్లే వైసీపీ వెనుకబడిందని లెక్కలు వేస్తున్నారు. జనసేన-టిడీపి కలిసి ఉంటే 2019 ఎన్నికల్లోనే గాజువాకలో పవన్ కల్యాణ్, విశాఖ ఎంపీ సీట్ లో టీడీపీ లేదా జనసేన గెలిచి ఉండేవని అప్పటి లెక్కలు చెబుతున్నాయి.ఈ కలయిక ఉండకూడదనే వైసీపీ కోరుకుంటోందని జనసేన భావిస్తోంది. మొన్న జరిగిన పార్టీ పదో ఆవిర్భావ సదస్సు చివరిలో ఇదే విషయాన్ని పవన్ కల్యాణ్ ప్రస్తావించారు. వైపీసీ కోరుకుంది జరగదు…. మీరేం కోరుకుంటున్నారో…. నేనూ అదే కోరుకుంటున్నాను అంటూ టీడీపీ-జనసేన కలయికపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు పవన్. జనసేన నేతలతోపాటు ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు కూడా జనసేన వల్లే టీడీపీ ఆధిక్యత సాధ్యం అయిందని బహిరంగంగానే చెబుతున్నారు. ఈ పార్టీల లెక్కల్లో ఎంత నిజం ఉందీ లేనిదీ…. సాధారణ ఎన్నికల్లో చూస్తే కానీ అర్ధం కాదు…