YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మాజీ మంత్రి ... గంటా యూ టర్న్...

మాజీ మంత్రి ... గంటా యూ టర్న్...

విశాఖపట్టణం, మార్చి  25, 
అధికారం ఎక్కడ ఉంటే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అక్కడ ఉంటారనేది పొలిటికల్ సర్కిల్స్‌లో తరచూ వినిపించించే కామెంట్. రాజకీయ ప్రత్యర్థులకైతే ఇదో విమర్శనాస్త్రం కూడా. తన రాజకీయ ప్రయాణం.. ఎత్తుగడలపై ఎన్నో లీకులు.. మరెన్నో ప్రచారాలు పుట్టించుకుని తరచూ చర్చల్లో ఉండేలా జాగ్రత్త పడుతుంటారు. 20ఏళ్ల రాజకీయ ప్రయాణంలో ఉనికి ప్రశ్నార్ధకమైన ప్రతీసారీ గంటా ప్రచారాలు పీక్స్ కు వెళుతాయని సొంత పార్టీలోని సీనియర్లే పబ్లిక్ గా కామెంట్స్ చేస్తారు. 2019 లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి గెలిచిన గంటా శ్రీనివాస్.. టీడీపీ కార్యక్రమాలతో ముడున్నరేళ్ల పాటు ఎటువంటి సంబంధం లేనట్టు వ్యవహరించారు. అసెంబ్లీ సమావేశాలకు మొక్కుబడిగానే వెళ్లి వస్తున్నారు. అధినాయకత్వంతో ఉన్న గ్యాప్ కారణంగా గంటాకు టీడీపీలో ప్రాధాన్యం బాగా తగ్గిందనే ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే ఈ మాజీ మంత్రి కదలికలు ఉండేవి. పార్టీ మారేందుకు గంటా సీరియస్ ప్రయత్నాలు కూడా చేశారు.వైసీపీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే గంటా అక్కడ వాలిపోతారనే ప్రచారంతో ప్రత్యర్థులు అలెర్ట్ అయ్యారు. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్.. వైసీపీ ముఖ్యనేత బహిరంగంగానే అభ్యంతరం వ్యక్తం చెయ్యడంతో బ్రేకులు పడ్డాయి. ఆ తర్వాత కూడా వైసీపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు కొనసాగిస్తునే వచ్చారు. వైసీపీ ముఖ్యులతో చర్చలు జరిగినప్పటికీ ఆ ప్రయత్నం కొలిక్కి రాలేదు. ఆ తర్వాత జనసేనకు వెళ్లేందుకు గంటా రెడీ అయ్యారనే ప్రచారం జరిగింది. మెగా ఫ్యామీలితో ఉన్న సంబందాలు ఉపయోగించుకుని అక్కడ ఆశ్రయం పొందుతారనే వాదనలు వినిపించాయి. ఐతే., గంటా రూపంలో బలమైన నాయకుడు పార్టీలోకి రావడం వల్ల లాభ నష్టాలను జనసేన చర్చించుకుందట. విశాఖకు వచ్చిన పవన్ కళ్యాణ్ ను బీచ్ రోడ్ లోని ఓ హోటల్లో కలిశారనే పుకార్లు షికారు చేశాయి. వీటిని ఖండించిన గంటా.. ఆ తర్వాత వైసీపీలో చేరేందుకు ఆసక్తిని చూపించడం చర్చగా మారింది. ఇప్పుడు టీడీపీ, జనసేన పొత్తు అనివార్యమైతే తాను ఉన్న చోటే భవిష్యత్‌ బాగుంటుందనే అంచనాలు వేసుకున్నారట. పక్క చూపులు ఆపి టీడీపీలో యాక్టివ్ అయ్యే ప్రయత్నాలు ప్రారంభించారు.కొద్దిరోజులుగా టీడీపీ ఆఫీసుకు వస్తూ.. వెళ్తూ.. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ సొంత పార్టీ నాయకులనే ఆశ్చర్య పరుస్తున్నారు గంటా. మొదటి నుంచి మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడితో రాజకీయ విభేదాలు ఉన్నాయి. ఈ వైరం ఎలా సెట్‌ అవుతుందో కానీ.. టీడీపీ హైకమాండ్‌ దగ్గర వ్యూహకర్తగా నిరూపించుకునే తాపత్రయం గంటాలో ఎక్కువైందనేది హాట్ టాపిక్. ఇటీవల ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక విషయంలో అదే జరిగిందని గంటా సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. లెక్చరర్ వేపాడ చిరంజీవి రావును 40రోజుల క్రితం తెరపైకి తీసుకొచ్చారు గంటా. ఉత్తరాంధ్రకు చెందిన ఓ ఎమ్మెల్సీ ద్వారా చంద్రబాబు దగ్గరకు పంపించారు. అప్పటికే మాజీ మంత్రి అయ్యన్న ప్రోత్సాహంతో గాడు చిన్నకుమారి లక్ష్మిని అభ్యర్థిగా ప్రకటించడంతో ఆమె ప్రచారం, ఓటర్ల నమోదుపై దృష్టి పెట్టారు. అయితే, చిరంజీవి రావైతే సామాజికంగా, ఆర్ధికంగా, ఓటర్ల పరంగా బలమైన అభ్యర్థి అనే విషయం గంటానే హైకమాండ్ దగ్గరకు పరోక్షంగా చేర వేశారని టాక్‌. దీంతో మహిళా అభ్యర్థి ప్లేస్‌లో చిరంజీవి రావు వచ్చారు. అంతే.. టీడీపీ అభ్యర్థి తరపున ప్రచారం కూడా చేశారు.ఇప్పుడు తన వ్యూహం ఫలించడంతో ఆ క్రెడిట్‌ అంతా తనదే అనే కలర్‌ ఇచ్చే ప్రయత్నాల్లో గంటా ఉన్నారట. అర్ధరాత్రి కౌంటింగ్ సెంటర్ల దగ్గరకు వచ్చి అధికారపార్టీని విమర్శించారు. తాను టీడీపీకి నిఖార్సైన నేతనని చెప్పుకొనే ప్రయత్నం చేశారు. ఫలితం సానుకూలంగా మారిన వెంటనే ఇప్పుడు కొత్త విన్యాసాలు చేస్తున్నారు గంటా. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు అంశం తెరపైకి తెచ్చాక.. ముఖ్యమంత్రి నిర్ణయం స్వాగతిస్తున్నామని ప్రకటించి సొంత పార్టీనే ఇరుకున పెట్టారు గంటా. అప్పుడు పొగిడిన నోటితోనే ఇప్పుడు వైసీపీ తెగిడేశారు గంటా. తన వియ్యంకుడైన మాజీ మంత్రి నారాయణ రాజకీయంగా ఇబ్బంది పడుతున్నా.. పోలీసు కేసుల చట్రంలో ఇరుక్కుంటున్నా.. గంటా సైలెన్స్‌ వీడి.. కొత్త రాగం అందుకుంటున్నారు. మరి.. గంటానాదం చివరి వరకు ఇదే సౌండ్‌ చేస్తుందో లేదో చూడాలి.

Related Posts