YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కర్ణాటకలో ఉనికి కోసం జేడీఎస్ పోరాటం

 కర్ణాటకలో ఉనికి కోసం జేడీఎస్ పోరాటం

బెంగళూరు, మార్చి 25, 
జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్).. కర్ణాటక రాజకీయాల్లో ఎప్పుడు సంచలనాలు జరిగినా వార్తల్లో నిలిచే పార్టీ ఇది! సొంతంగా ప్రభుత్వాన్ని స్థాపించలేకపోయినా.. అనేక సందర్భాల్లో 'కింగ్ మేకర్'గా ఆవిర్భవించి.. సీఎంతో పాటు ఇతర కీలక పదవులను వెనకేసుకుంది జేడీఎస్. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. జేడీఎస్ మరోమారు వార్తల్లో నిలుస్తోంది. ఈసారి మాత్రం పరిస్థితులు పూర్తిగా మారిపోయినట్టు కనిపిస్తోంది. కింగ్ మేకర్ స్థాయి నుంచి పార్టీ ఉనికి కోసం పోరాటం చేసే స్థాయికి జేడీఎస్ పడిపోయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.2018 అసెంబ్లీ ఎన్నికల్లో 'కింగ్ మేకర్'గా ఆవిర్భవించి కర్ణాటకలో సంచలన పరిణామాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచింది జేడీఎస్. బీజేపీ, కాంగ్రెస్లు మెజారిటీ సాధించలేకపోవడంతో జేడీఎస్ను అధికారం వరించింది. కాంగ్రెస్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి.. కర్ణాటక రాజకీయాల్లో తన శక్తిని చాటిచెప్పింది. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రభుత్వం కూలడం, రాష్ట్రంలో బీజేపీకి మద్దతు పెరగడం, పార్టీలో అంతర్గత కలహాలు, వలసలతో జేడీఎస్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. మరీ ముఖ్యంగా.. జేడీఎస్ ఒక కుటుంబానికి చెందిన పార్టీ అని బీజేపీ చేసిన ప్రచారాలు మంచి ఫలితాల్ని ఇచ్చినట్టు కనిపిస్తోంది. వారసత్వ రాజకీయాలు చేస్తోందనే మచ్చ ఆ పార్టీపై పడింది. జేడీఎస్ వ్యవస్థాపకుడు, మాజీ ప్రధాని దేవెగౌడ్ వయస్సు రిత్యా రాజకీయాలకు దూరంగా ఉండటం కూడా పార్టీకి ఒకింత నష్టం చేస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆయన కుమారుడు హెచ్డీ కుమారస్వామి ఒక్కరే.. పార్టీ బాధ్యతలను తన భుజాల మీద మోసుకుని నడిపిస్తున్నారు. 1999లో జేడీఎస్ను స్థాపించారు దేవెగౌడ. అప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ఒక్కసారి కూడా ఈ పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. రెండుసార్లు సంకీర్ణ ప్రభుత్వాలను నడిపింది. 2006 ఫిబ్రవరిలో బీజేపీతో కలిసి 20 నెలల పాటు రాష్ట్రాన్ని పాలించింది. 2018 మేలో కాంగ్రెస్తో కలిసి 14 నెలలపాటు అధికారంలో నిలిచింది. ఈ రెండు సందర్భాల్లోనూ కుమారస్వామి సీఎంగా నిలిచారు.ఈసారి మాత్రం.. చరిత్రను తిరగరాయాలన్న దృఢసంకల్పంలో ఉంది జేడీఎస్. రాష్ట్రంలో స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 'మిషన్ 123' అనే పేరుతో పార్టీలో ఉద్యమం చేపట్టింది. త్వరలో 224 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో.. 123 సీట్లల్లో గెలిచి, ప్రభుత్వాన్ని స్థాపించాలన్నదే ఈ మిషన్ లక్ష్యం. ఇందుకోసం ప్రాంతీయ వాదాన్ని అస్త్రంగా ఉపయోగిస్తోంది. 'కన్నడ ప్రజల గౌరవం' అంటూ విపరీతంగా ప్రచారాలు చేస్తోంది. రాష్ట్రంలో ఉన్న ఒకైక కన్నడిగ పార్టీ తమదేనని.. జేడీఎస్ను గెలిపిస్తే కర్ణాటకను గెలిపించినట్టేనని ప్రజల్లోకి వెళుతోంది.కానీ ఈ మిషన్ సక్సెస్ అవుతుందా? అని ఇటు సొంత పార్టీ సభ్యుల్లో, అటు రాజకీయ విశ్లేషకుల్లో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. గత రికార్డులను చూస్తే.. కర్ణాటక ఎన్నికల్లో.. జేడీయూ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసి దాదాపు రెండు దశాబ్దాలు గడిచిపోయింది! 2004 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో.. 58 సీట్లు గెలిచింది ఈ పార్టీ. ఇదే జేడీఎస్కు అత్యధికం. 2013లో 40 సీట్లు వెనకేసుకుంది. ఇక 2018 ఎన్నికల్లో 37 సీట్లతో కింగ్ మేకర్గా అవతరించింది.ఇది ఇలా ఉండగా.. పార్టీపై ఓ వర్గం నేతలు మాత్రం ఎన్నో ఆశలు పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన చేసి.. 'రాజకీయాల'తో ప్రభుత్వ స్థాపనలో కీలక పాత్ర పోషించాలని వారు అభిప్రాయపడుతున్నట్టు సమాచారం. ఇందుకోసం.. గతంలో కన్నా ఇంకొన్ని సీట్లు ఎక్కువ గెలిస్తే సరిపోతుందని వీరు భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Related Posts