YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

గుడివాడ, గన్నవరంలు..కొరకరాని కొయ్యలు

గుడివాడ, గన్నవరంలు..కొరకరాని కొయ్యలు

విజయవాడ, మార్చి 27, 
వచ్చే ఎన్నికల్లో గుడివాడ.. గన్నవరం నియోజకవర్గాల్లో టీడీపీ జెండా ఎగరాలని కోరుకుంటోంది పార్టీ కేడర్‌. ఇదే ఆ పార్టీకి పెద్ద టాస్క్‌. దానికి కారణం ఏంటో ప్రజలకు కూడా తెలుసు. కొద్దికాలంగా టీడీపీ నుంచి ఇలాంటి ప్రకటనలే వచ్చాయి. గుడివాడలో కొడాలి నాని.. గన్నవరంలో వల్లభనేని వంశీల ఓటమే టీడీపీకి టాప్‌ ప్రయారిటీ. కొన్నేళ్లుగా వీరిద్దరూ టీడీపీకి కొరకరాని కొయ్యగా మారడమే దానికి ప్రధాన కారణం. కొడాలి నాని, వంశీ ఇద్దరూ టీడీపీ నుంచే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు అదే టీడీపీకి ప్రధాన రాజకీయ శత్రువులుగా మారారు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు.నాని గతంలో రెండుసార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత వైసీపీలో చేరి మరో రెండుసార్లు శాసనసభ్యుడయ్యారు. మొన్నటి వరకు మంత్రిగానూ చేశారు. వంశీ 2019 తర్వాత ప్లేటు ఫిరాయించారు. వీరిద్దరూ టీడీపీని.. చంద్రబాబును, లోకేష్‌ను ఏ విధంగా కార్నర్‌ చేస్తున్నారో చూస్తున్నాం. తమ మాటలతో.. చేతలతో ప్రత్యర్థి పార్టీని ఇరుకున పెట్టిన సందర్భాలు అనేకం. అందుకే ఈ రెండుచోట్లా నాని, వంశీలను ఓడించాలనే కసి తెలుగు తమ్ముళ్లలో నెలకొంది. టీడీపీ అధిష్ఠానం మూడ్‌ కూడా అలాగే ఉన్నప్పటికీ.. గుడివాడ, గన్నవరంలో క్షేత్రస్థాయి పరిస్థితులు మరోలా ఉన్నాయి.కొడాలి నాని తన మాటలతో టీడీపీపై విరుచుకుపడుతుంటే.. గన్నవరంలో టీడీపీ ఆఫీసుపై దాడుల వరకు వ్యవహారం వెళ్లింది. ఎన్నికలకు మరో ఏడాదే సమయం ఉండటంతో ఇక్కడ పార్టీ పెద్దలు ప్రత్యేక దృష్టి పెట్టారని.. బలమైన అభ్యర్థులను బరిలో దించుతారని.. ఇంఛార్జులు కూడా బలమైన నాయకులే ఉంటారని తమ్ముళ్లు ఎదురు చూస్తున్నారు. ఇలా ఎదురు చూడటంలోనే రోజులు గడిచిపోతున్నాయి కానీ.. అధిష్ఠానం నుంచి ఉలుకు పలుకు లేదు. గుడివాడలో గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన దేవినేని అవినాష్‌ ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. గుడివాడలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ఉన్నా.. మరికొందరు హడావిడి చేస్తున్నా.. వారే అభ్యర్థులని పార్టీ ప్రకటించలేని పరిస్థితి. నానిని ఢీకొట్టాలంటే నానికంటే బలమైన నాయకుడు కావాలని వెతకడంలోనే టీడీపీకి కాలం గడిచిపోతోంది. ఇది స్థానికంగా టీడీపీ కేడర్‌ను డైలమాలో పడేస్తుంటే.. అధికారపక్షం ఫుల్‌ జోష్‌లో ఉందట. ఎన్ని అనుకున్నా.. మరెన్ని శపథాలు చేసినా.. మళ్లీ టీడీపీనే గుడివాడలో నానిని గెలిపిస్తుందా అనే అనుమానాల్లో ఉన్నారట తెలుగు తమ్ముళ్లు.ఇక గన్నవరంలోనూ టీడీపీకి దిక్కు మొక్కు లేకుండా పోయింది. వరసగా రెండుసార్లు గెలిచిన వంశీని ఢీకొట్టడానికి టీడీపీ అనేక ప్రయోగాలు చేస్తోంది కానీ.. ఏదీ వర్కవుట్‌ కావడం లేదు. మొన్నటి వరకు ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఇంఛార్జ్‌గా ఉన్నారు. ఆయన అకాల మరణంతో ఆ పోస్టు కూడా ఖాళీ. అర్జునుడు సైతం గన్నవరంలో తనదైన ముద్ర వేయలేకపోయారనే అభిప్రాయం టీడీపీ శిబిరంలో ఉంది. ఇక్కడ టీడీపీకి బలమైన కేడర్‌ ఉన్నప్పటికీ.. వాళ్లను నడిపించే ఇంఛార్జే లేరని చర్చ సాగుతోంది. వంశీకి గన్నవరం వైసీపీలో వ్యతిరేకులు కూడా గట్టిగానే ఉన్నారు. ఇక్కడ రాజకీయ వాతావరణాన్ని అనుకూలంగా మలుచుకోవాలని టీడీపీ అనుకుంటున్నా.. అందుకు తగ్గా కార్యాచరణ లేదు. ఇప్పటికీ ఇంఛార్జ్‌ ఎవరో తెలియదు.. వచ్చే ఎన్నికల్లో వంశీని గట్టిగా ఢీకొట్టే టీడీపీ అభ్యర్థి ఎవరో కూడా చెప్పలేకపోతున్నారు నాయకులు. ఇదే వైఖరి కొనసాగితే.. గన్నవరంలోనూ టీడీపీనే వంశీని గెలిపించేలా ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గుడివాడ, గన్నవరంలో సిట్టింగ్‌లను ఓడించాలనే కసి ఉంటే సరిపోదని..దానికి తగ్గా ప్లాన్‌ కూడా ఉండాలనేది టీడీపీ పెద్దలకు తెలిసినా.. ఎందుకు లైట్‌ తీసుకుంటున్నారో తమ్ముళ్లకు అంతుచిక్కడం లేదట.

Related Posts