న్యూఢిల్లీ మార్చ్ 27
వైఎస్ వివేకా హత్య కేసులో దర్యాప్తు అధికారిని మార్చాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. దర్యాప్తు వేగంగా సాగటం లేదని.. దర్యాప్తు అధికారులు మార్చాలని కోరుతూ వివేకా హత్య కేసులో ఏ5 నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డి భార్య తులశమ్మ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ నిర్వహించిన సర్వోన్నత న్యాయస్థానం.. వివేకా హత్య కేసును ఇంకా ఎంత కాలం విచారణ చేస్తారని ప్రశ్నించింది. సీబీఐ దాఖలు చేసిన సీల్డ్ కవర్ నివేదిక ఆసాంతం చదివామని ధర్మాసనం పేర్కొంది. సీబీఐ తీరుపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. స్టేటస్ రిపోర్టులో ఎలాంటి పురోగతి లేదని అసహనం వ్యక్తం చేసింది. తదుపరి దర్యాప్తు పేరుతో ఎంతకాలం సాగదీస్తారని ధర్మాసనం నిలదీసింది. విచారణ అధికారిని మార్చాలని ఆదేశించింది. అయితే రామ్ సింగ్‌ను మాత్రం కొనసాగించాలని తెలిపింది.కేసు అంతా... రాజకీయ దురుద్దేశ్యంతో కూడినదేనని రిపోర్ట్‌లో రాశారని జస్టిస్ ఎంఆర్ షా పేర్కొన్నారు. హత్యకు గల ప్రధాన కారణాలు, దాని వెనుక ఉన్న ఉద్దేశాలు బయటపెట్టాలని ధర్మాసనం ఆదేశించింది. విచారణాధికారిని మార్చాలని.. లేదా ఇంకో అధికారిని నియమించాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఇప్పుడున్న అధికారి కూడా కొనసాగుతారని తెలిపింది.స్టేటస్ రిపోర్టులో ఎక్కడ చూసినా రాజకీయ వైరం అని మాత్రమే రాశారని.. విస్తృత స్థాయిలో ఉన్న కుట్ర గురించి ఏమాత్రం దర్యాప్తు చేసినట్టు లేదని అసహనం వ్యక్తం చేసింది. మెరిట్స్ మీద ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వడం లేదని తెలిపింది. సీబీఐ డైరక్టర్ నుంచి తగిన ఆదేశాలు తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించింది.