YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నెల్లూరు వైసీపీలో పడనున్న మరొక వికెట్

నెల్లూరు వైసీపీలో పడనున్న మరొక వికెట్

నెల్లూరు, మార్చి 28, 
నెల్లూరు జిల్లాలో ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలపై వైసీపీ వేటు వేసింది. మంత్రి పదవులు రాని ఒకరిద్దరు ఇంకా అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే వారెవరూ పార్టీ లైన్ దాటలేదు, ఎక్కడా పల్లెత్తు విమర్శ కూడా చేయలేదు. పైగా అవకాశం వస్తే మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకి చాకిరేవు పెట్టడానికి బాగా ఉత్సాహం చూపిస్తారు. అలాంటి ఎమ్మెల్యేలపై కూడా ఇప్పుడు వాట్సాప్ లో ప్రచారం హోరెత్తిపోతోంది. తాజాగా కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి వైసీపీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారంటూ నెల్లూరు వాట్సప్ గ్రూపుల్లో ఓ మెసేజ్ తెగ వైరల్ అవుతోంది. నెల్లూరు రాజకీయాల్లో ఇది హాట్ టాపిక్ గా మారింది.
ప్రసన్నకుమార్ రెడ్డి.. 2012 నిండి జగన్ కు అండగా నిలిచిన సీనియర్ నాయకుడు
2019 తర్వాత తనకు ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుంది అని ఆశించిన ప్రసన్నకుమార్ రెడ్డి
మంత్రి పదవి అటుంచితే .. తనకు రావాల్సిన పెండింగ్ బిల్లులు కూడా రావట్లేదు అని అనుచరుల దగ్గర వాపోయిన ప్రసన్నకుమార్ రెడ్డి. పార్టీలో కనీస గౌరవం లేదు అని అసంతృప్తి
పార్టీ మారడం తప్ప తనకు వేరే మార్గం లేదని అనుచరులకు స్పష్టం చేసిన ప్రసన్నకుమార్ రెడ్డి
టీడీపీ బీజేపీలలో ఒక పార్టీలో చేరే అవకాశం ఉందని తెలిపిన ప్రసన్నకుమార్ రెడ్డి
ఈ విషయంపై మరికొద్ది రోజుల్లో మరికొంత స్పష్టత వచ్చే అవకాశం.."
ఇదీ ఆ మెసేజ్ సారాంశం. ఎవరో పొలిటికల్ అనలిస్ట్ వార్త రాశారా అనేలా కనిపిస్తున్న ఈ న్యూస్ ను ఫార్వార్డ్ చేసినట్టుగానే ఒక ఫేక్ వార్త సృష్టించారనిపిస్తోంది. సీఎం జగన్ పై అసంతృప్తితో రగిలిపోతున్నారని, ఆయన పార్టీ మారతారని అంటున్నారు. ఇందులో టచ్ చేసిన పాయింట్ కూడా మరీ అంత తీసిపారేసేలా లేదు. మంత్రి పదవి రాలేదనే ఉద్దేశంతో ప్రసన్న పార్టీ మారతారంటున్నారు. పార్టీ స్థాపించినప్పటి నుంచి జగన్ తోనే ఉన్న అతికొద్దిమంది నేతల్లో ప్రసన్న కూడా ఒకరు. సీనియర్ నేత, రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. అలాంటి నల్లపురెడ్డి ప్రసన్నకు సీఎం జగన్ మంత్రి పదవి ఇవ్వకుండా పక్కనపెట్టారు. దీంతో సహజంగానే ఆయనలో అసంతృప్తి ఉంటుంది. కానీ ఆయనెప్పుడూ బయటపడలేదు. ఇటీవల నెల్లూరు బ్యారేజ్ కి నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి పేరుని ఖరారు చేశారు సీఎం జగన్. ఆ పేరుతో ప్రసన్నను కాస్త కూల్ చేయాలనుకున్నారు. ఆమధ్య గడప గడప కార్యక్రమంలో కూడా హుషారుగా లేరంటూ చురకలంటించారు. ఆ తర్వాత ప్రసన్న గడప గడపలో స్పీడ్ పెంచారు. జగన్ ఇచ్చిన టార్గెట్ ని రీచ్ అవుతున్నారు. ఐప్యాక్ దృష్టిలో పడేందుకు ప్రచారాన్ని కూడా ముమ్మరం చేశారు. ప్రస్తుతానికి ఆయనెక్కడా జగన్ కి వ్యతిరేకంగా నోరు మెదపలేదు. ఇటీవల నలుగురు ఎమ్మెల్యేలపై పార్టీ సస్పెన్షన్ వేటు వేసిన తర్వాత కూడా ప్రసన్న కుమార్ రెడ్డి అధిష్టానానికి సపోర్ట్ గా మాట్లాడారు. చంద్రబాబుపై ధ్వజమెత్తారు. ఆ నలుగురిపై విరుచుకుపడ్డారు. అలాంటి ప్రసన్న సడన్ గా పార్టీకి దూరం ఎందుకు జరుగుతారు. చంద్రబాబుని జీవితంలో ఎవరూ తిట్టనన్ని తిట్లు తిట్టాడు కాబట్టి, ఆయన టీడీపీలో చేరే అవకాశమే లేదు. అలాగని బీజేపీలో చేరి రాజకీయ జీవితాన్ని నాశనం చేసుకునేంత అమాయకుడు కూడా కాదు. పోనీ ప్రసన్నకు కోవూరు టికెట్ ఇవ్వనని జగన్ చెప్పారా అంటే అలాంటి ప్రచారం కూడా లేదు. మరి అసలు నిప్పే లేకుండా ఈ పొగ ఎలా వస్తోంది. ఈ పొగ ఎవరు పెట్టారనేది తేలాల్సి ఉంది.

Related Posts