శ్రీనగర్, మార్చి 28,
శ్రీనగర్ నుంచి లడఖ్ వరకు హిమపాతం కారణంగా నిలిచిపోయిన రాకపోకలు రికార్డు సమయంలో పునరుద్ధరించారు. పొరుగుదేశాల వ్యూహాత్మక ఎత్తుగడలను నిలువరించేలా సైన్యం రాకపోకలకు వీలుగా మూడు రహదారులు అందుబాటులోకి వచ్చాయి. శ్రీనగర్, మనాలి మీదుగా లడఖ్ వరకు వాహనాల రాకపోకలను బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ రికార్డు సమయంలో పునరుద్దరించింది. హిమాచల్ ప్రదేశ్‌లోని అటల్ సొరంగం యొక్క ప్రయోజనాన్ని అందిపుచ్చుకుంటూ వ్యూహాత్మక ప్రాంతాలకు అన్నిరకాల వాతావరణాల్లోనూ రాకపోకలు సాగించేందుకు వీలుగా మరో రెండు పర్వతాల గుండా సొరంగం నిర్మాణానికి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.39 కి.మీ పొడవైన శ్రీనగర్ మార్గం మార్చి 26వ తేదీన పునః ప్రారంభమైంది. శ్రీనగర్ నుంచి 100 కి.మీ దూరంలో సముద్ర మట్టానికి 11,540 అడుగుల ఎత్తులో ఉన్న జోజి లా మార్గం జనవరి 6వ తేదీన భారీ హిమపాతం కారణంగా మూసివేసిన 68 రోజుల తర్వాత తెరుచుకుంది. అటల్ సొరంగం ద్వారా 427 కి.మీ మనాలి - లేహ్ రహదారి 138 రోజుల తర్వాత శనివారం తిరిగి అందుబాటులోకి వచ్చింది. మే/ జూన్ నెలల్లో ఈ రహదారి పునఃప్రారంభమవుతుందని భావించినా అంతకుముందే అందుబాటులోకి రావడం విశేషం. నిమ్ము-పదమ్-దర్చా (NPD) రహదారిపై సముద్ర మట్టానికి 16,561 అడుగుల ఎత్తులోని షింకు లా మార్గం 55 రోజుల విరామం తర్వాత గురువారం ప్రారంభమైంది. ఈ రహదారిని లడఖ్‌కు మూడవ మార్గంగా నిర్మిస్తున్నారు, అయితే ఇంకా పూర్తి స్థాయిలో రహదారి నిర్మాణం పూర్తికాలేదు.జోజిలా అనేది కాశ్మీర్ లోయ - లడఖ్ మధ్య కీలకమైన లింక్‌ను అందించే వ్యూహాత్మక మార్గం. ఇది సాయుధ దళాల కార్యాచరణ సంసిద్ధతకు కీలకమైనది. విపరీతమైన హిమపాతం కారణంగా ఇది దాదాపు ఆరు నెలల పాటు మూసివేయబడింది. అయితే, గత కొన్ని సంవత్సరాలతో పోలిస్తే, ఈ సంవత్సరం 68 రోజుల రికార్డు సమయంలోనే BRO దీన్ని తిరిగి తెరిచింది. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ చౌదరి 11,650 అడుగుల ఎత్తులో ఉన్న జోజిలా పాస్ వద్ద ట్రాఫిక్ కోసం రహదారిని ప్రారంభించారు2020 మేలో గాల్వాన్ సరిహద్దులో చైనా సైన్యంతో ఘర్షణలు జరిగినప్పటి నుంచి ఈ ప్రాంతంలో సాధారణం కంటే అధిక సంఖ్యలో మన సైనికులు మోహరించారు. ఈ నేపథ్యంలో అనుకున్న సమయానికి ముందే రహదారులు పునరుద్దరించడంతో 3 నుంచి 4 నెలలు సైన్యం ఒకే ప్రాంతంలో ఉండిపోకుండా ఇతర ప్రాంతాలకు తరలించేందుకు వీలుంటుంది. ఈ రహదారులు అందుబాటులోకి రావడం వల్ల పౌరులు, ఇతర సరకు రవాణా కోసం విమాన ప్రయాణానికి ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. రహదారులు పునఃప్రారంభం కావడంతో స్వస్థలాలకు వెళ్లే కశ్మీరీలు, అక్కడి అందాలు తిలకించేందుకు వచ్చే అతిథులకు విమానయానంతో పోలిస్తే తక్కువ ఖర్చుతో చౌకైన ప్రయాణం అందుబాటులోకి వచ్చింది. మార్గాల్లో మంచును తొలగించడం ద్వారా బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సామర్థ్యం వెలుగుచూసింది. జోజి లా, షింకు లా రెండు సొరంగ మార్గాల ఏర్పాటు ద్వారా ఈ రహదారులను సమర్థంగా ఉపయోగించుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వీటి ద్వారా లడఖ్‌కు అన్ని కాలాల్లోనూ రాకపోకలను కొనసాగించాలని భావిస్తోంది. ఈ నిర్ణయం దేశ రక్షణకు సైనిక సన్నద్ధతతో పాటు, ఈ ప్రాంత ప్రజల జీవన విధానంపై ప్రభావం చూపుతుంది. మనాలి-లేహ్ మార్గంలో చలికాలంలో హిమపాతం సంభవించే నాలుగు ఇరుకైన దారులు, శీతల గాలుల కారణంగా విపరీతమైన చలి నుంచి ప్రయాణికులకు రక్షణ కల్పించడంతో పాటు రాకపోకలకు షింకు లా మార్గం అనువుగా ఉంటుంది.