YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మేల్కోకుంటే ప్రమాదమే...

మేల్కోకుంటే ప్రమాదమే...

సాగునీటి వనరులు ఉన్న జిల్లా.. జలాశయాలు, గోదావరి పరివాహకం, ఊరూరా చెరువులు, నదులతో జలసవ్వడి చేస్తున్నా.. రోజురోజుకు భూగర్భజలం క్షీణిస్తుంటే భావితరాలకు నీటి ఇక్కట్లు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతేడాది ఏప్రిల్‌ నెలాఖరు వరకు జిల్లాలో 11.05 మీటర్లలోతులో నీరుండగా.. ఈసారి 13.28 మీటర్లకు పడిపోయింది. ఈ లెక్కన 2.23 మీటర్లు లోతుకు వెళ్లిపోయింది.

 నిర్మల్‌ జిల్లాలో సాధారణ సగటు వర్షపాతం 1105.5 మిల్లీమీటర్లు.. నీటి వనరులు పుష్కలంగా ఉన్నా వినియోగం ఎక్కువ కావడంతో భవిష్యత్తులో ప్రమాద ఘంటికలు సూచిస్తున్నాయి. నీరు పుష్కలంగా ఉండటంతో ఆశించిన మేరకు ఓ వైపు వృద్ధి చెందుతున్నా మరోవైపు భూమిలోకి ఇంకించే చర్యలు లేకపోవడంతో రానున్న రోజుల్లో నీటి కోసం ఇక్కట్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సారి సాధారణ వర్షాలు ఉంటాయని ఇప్పటికే భారత వాతావరణశాఖ స్పష్టం చేయడంతో నీటి పొదుపుపై ముందస్తు చర్యలు లేకుండా కరవు ఛాయలు ఏర్పడే పరిస్థిలు ఉండొచ్చని భూగర్భజలశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

పుష్కరకాలంలో ఎన్నడూలేని విధంగా ఈ సారి భూగర్భజలాలు గణణీయంగా పడిపోయాయి. దీనికితోడు వ్యవసాయానికి నిరంతర విద్యుత్తు సరఫరా చేస్తుండటంతో బోరుబావుల ఆధారంగా వరి పంటలు సాగు చేయడంతో నీటి వాడకం ఎక్కువ అవుతోంది. యాసంగిలో వరి సాధారణ విస్తీర్ణం 22 వేల ఎకరాలు ఉండగా.. ఈ సారి 47,350 ఎకరాల్లో సాగుచేశారు. పంటకు ఆఖరి సమయంలో నీరు ఎక్కవగా అవసరం ఉండటంతో బోర్ల ద్వారా భూగర్భజలాలు వాడుకున్నారు. ఎవరో వస్తారు.. ఏదో చేస్తారని ఎదురుచూడకుండా ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆవరణలో ఇంకుడుగుంతలు తవ్వించి నీటిని భూమిలోకి ఇంకించకుంటే రానున్న రోజుల్లో జల ప్రళయం తప్పదు. ఇప్పటినుంచైనా నీటిని పొదుపుగా వాడుకోవడమే శ్రేయస్కరం. మండుతున్న ఎండల కారణంగా ఆవిరి రూపంలో 30 శాతం నీరు కనుమరుగవుతోందని భూగర్భజలశాఖ అధికారులు చెబుతున్నారు.  నీటి పొదుపుపై అధికార యంత్రాంగం ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. నీటిని అత్యంత పొదుపుగా వాడుకోవాల్సి ఉంటుంది. భావితరాలకు నీటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే ఇప్పటినుంచి పకడ్బందీగా ముందుకు అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఇందుకు పాలకులు, అధికారులు, ప్రజలు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలి.

వాగులు, వంకలు, ఒర్రెల నుంచి ఇసుక తీయడం చట్టరీత్యానేరం. అక్రమంగా ఇసుక తీస్తే వాల్టా చట్టం కింద కేసులు నమోదు చేయొచ్చు. కానీ జిల్లాలో ఎక్కడా నమోదు కావడం లేదు. ఇసుక తవ్వకాలు జోరుగా సాగడంతో పాటు అనుమతులు లేకుండా ఇష్టారీతిన బోర్లు వేయించడం కూడా భూగర్భజలాలు తగ్గిపోవడానికి కారణంగా చెప్పొచ్చు. ఎక్కడైనా ఒక బోరు వేయించాలంటే ముందుగా భూగర్భజల శాఖ అధికారులు, రెవెన్యూ అధికారుల అనుమతి తప్పనిసరి. కానీ ఇదెక్కడా అమలు కావడం లేదు. అధికారులు ఇసుక రవాణాను అడ్డుకోకుండా చూస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వాల్టా చట్టాన్ని పకడ్బందీగా అమలుచేస్తే కొంతవరకైనా భూగర్భజలాలు పెరిగే అవకాశం ఉంది. ఈ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలి.

Related Posts