నెల్లూరు, మార్చి 29,
పార్టీ అధికారంలోకి రాగానే జగన్, అనిల్ కి మంత్రి పదవి ఇచ్చారు, దానికి ఆయన బాగా పనిచేసి శెహభాష్ అనిపించుకున్నారు. నెల్లూరు నగరంలో అనిల్ గురించే చర్చ అంతా, ఆయనకి హారతి పడుతున్నారు. నెల్లూరు ప్రజల్లో ఎవరి నోట విన్నా అనిల్, అనిల్ అనే పేరే వినపడుతోంది. అనిల్ అనిల్ అని అందరూ అంటున్నారు, అనిల్ గెలుస్తాడని కాదు, ఓడిపోతాడని.." అంటూ అనిల్ పై సెటైర్లు పేల్చారు వైసీపీ సస్పెండెడ్ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. గతంలో ఆయనెప్పుడూ ఇంత సెటైరిక్ గా మాట్లాడలేదు. తొలిసారి జగన్ గొప్ప మహానుభావుడు అంటూ కౌంటర్ ఇచ్చారు. అనిల్ ని కూడా ఆయన టార్గెట్ చేశారు. అయితే ఈ గొడవ ముందు మొదలు పెట్టింది అనిల్ కావడం విశేషం. తననిరెచ్చగొట్టి, తనతో మళ్లీ మాటలు అనిపించుకోవద్దని అన్నారు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. ఆ ముగ్గురు నెల్లూరు జిల్లాలో ఓడిపోవడం ఖాయం అంటూ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సస్పెండ్ అయిన ఎమ్మెల్యేల గురించి కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఆయన కోటంరెడ్డిని టార్గెట్ చేద్దామనుకున్నారు, కానీ మేకపాటి బాగా హర్ట్ అయ్యారు. అందుకే ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ అనిల్ ని ఉతికి ఆరేశారు. అనిల్ సింగిల్ డిజిట్ మెజార్టీ ఎమ్మెల్యే అని ఎద్దేవా చేశారు. నోరు ఉంది కాబట్టే ఆయనకు జగన్ మంత్రి పదవి ఇచ్చారని చెప్పుకొచ్చారు. గతంలో తాము చాలామందిని మోటుకున్నామని, వయసులో ఉన్నావు కదా అని రెచ్చిపోవద్దని అన్నారు. నెల్లూరు అంతా అనిల్ గురించే మాట్లాడుకుంటున్నారని, ఆయన ఓడిపోతారని అనుకుంటున్నారని సెటైర్లు పేల్చారు మేకపాటి. తమ కుటుంబం సాయం పొందిన జగన్, తమకి అన్యాయం చేశారని మరోసారి మండిపడ్డారు.మేకపాటి కుటుంబం పేరు చెప్పగానే అందరికీ ముందు గుర్తొచ్చేది పెద్దాయన రాజమోహన్ రెడ్డి, ఆ తర్వాత మేకపాటి గౌతమ్ రెడ్డి మంత్రిగా మంచి పేరు తెచ్చుకున్నా అర్థాంతరంగా ఆయన తనువు చాలించడంతో ఆయన స్థానంలో మేకపాటి విక్రమ్ రెడ్డి ప్రస్తుతం నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి నాలుగుసార్లు ఎమ్మెల్యే అయినా కూడా పెద్దగా ఆయన లైమ్ లైట్లోకి రాలేదు. 2004, 2009లో వరుసగా కాంగ్రెస్ పార్టీనుంచి ఉదయగిరి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు చంద్రశేఖర్ రెడ్డి. ఆ తర్వాత 2012లో ఉప ఎన్నికల్లో వైసీపీ తరపున బరిలో నిలిచి గెలిచారు. 2019లో తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అలాంటి సీనియిర్ నేత, వైసీపీ పెట్టినప్పటి నుంచి పార్టీలో ఉన్న నేతపై ఇటీవల ఆ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. దీన్ని చాలాప్రెస్టీజియస్ గా తీసుకున్నారు మేకపాటి. అందుకే జగన్ ని పదే పదే టార్గెట్ చేస్తున్నారు. కోటంరెడ్డి దాదాపుగా టీడీపీలో చేరడం ఖాయం. ఆనం కూడా అటువైపే చూస్తున్నారు. ఉండవల్లి శ్రీదేవి కూడా అమరావతికి జై కొట్టి దాదాపుగా టీడీపీకి దగ్గరయ్యారు. ఇక మేకపాటి విషయం మాత్రం తేలడంలేదు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గతంలో టీడీపీతో ఎప్పుడూ మంతనాలు సాగించలేదు. ఆయన విషయంలో కూడా టీడీపీ అంత సీరియస్ గా ఆలోచించలేదు. అందుకే ఆయన ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేసి గెలుస్తానంటున్నారు.