YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ముగ్గురు మంత్రులపై వేటు తప్పదా...?

ముగ్గురు మంత్రులపై వేటు తప్పదా...?

విజయవాడ, మార్చి  29, 
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసంతృప్తితో రగిలిపోతున్నారా? పట్టభద్రుల, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు నిరాశపరచడంపట్ల అసహనంతో ఉన్నారా? మంత్రుల తీరు మార్చుకోవాలని హెచ్చరించినా మార్పు రాకపోవడంతో ఆగ్రహంతో ఉన్నారా? ఎమ్మెల్యే, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పరిణామాల నేపథ్యంలో చర్యలకు సీఎం జగన్ ఉపక్రమించారా? అందుకే ప్రస్తుతం జగన్ మౌనం దాల్చారా? ఇటీవల ఏలూరు జిల్లాలో జరిగిన సభలో కూడా రాజకీయాలపై సవాళ్లు విసరకుండా.. వైనాట్ 175 అనే నినాదం ఇవ్వకపోవడానికి కారణం కూడా ఇదేనా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాభంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర నిరాశలో ఉన్నారని ఇందులో భాగంగా మంత్రివర్గ విస్తరణకు శ్రీకారం చుట్టబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇద్దరు ముగ్గురు మంత్రులను తప్పిస్తారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇందులోభాగంగా గవర్నర్ జస్టిస్ అబ్ధుల్ నజీర్‌తో భేటీ కానున్నారంటూ వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.పట్టభద్రుల, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వెల్లడవటంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పార్టీ శ్రేణులపై తీవ్ర అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. పరిపాలన రాజధానిగా విశాఖను ప్రకటించినప్పటికీ ఉత్తరాంధ్రలో ఓడిపోవడం.. వైసీపీకి కంచుకోట అయిన రాయలసీమ ప్రాంతాల్లో కూడా వైసీపీ అభ్యర్థులు ఓడిపోవడంపై సీఎం జగన్ ఆగ్రహంతో రగిలిపోతున్నారట. అంతేకాదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఎట్టి పరిస్థితుల్లో గెలవకూడదనే లక్ష్యంతో ఉన్న జగన్ పలు బాధ్యతలను మంత్రులు, మాజీమంత్రులు, పార్టీ సీనియర్ నేతలకు అప్పగించారు. విందులు సైతం ఏర్పాటు చేశారు. ఏకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేరుగా రంగంలోకి దిగి ఫోన్ చేసి మరీ బుజ్జగించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ అసమ్మతి ఎమ్మెల్యేలు మీరేం చెప్పినా సరే.. మేము చేసేది చేస్తాం అన్నట్లు జగన్‌కు క్రాస్ ఓట్లు వేసి మరీ నిరూపించారు. దీంతో వైఎస్ జగన్ బొక్కబోర్లా పడ్డారు. ప్రభుత్వ సలహాదారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఓడిపోయినప్పటికీ పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని తెలుస్తోంది. వైనాట్ 175 అని ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని కానీ లోలోపల మాత్రం ఆ ఫలితాలు వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్లు పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది.ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాస్త దూకుడు తగ్గించారు. ప్రభుత్వ పరంగా సమీక్షలు నిర్వహిస్తూ ముందుకు వెళ్తున్నారు. అయితే ఇటీవలే ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ ఆసరా మూడో విడత నిధుల విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంత ఉత్సాహంగా కనిపించలేదు. అంతేకాదు ప్రతీ సభలోనూ ప్రతిపక్షాలను తూర్పారబట్టే జగన్ అసలు వాటి ఊసేఎత్తలేదు. కేవలం చంద్రబాబు నాయుడు హయాంలో బకాయిలు అంశాన్ని మాత్రమే ప్రస్తావించారు. అంతేకాదు వైనాట్ 175 అనే నినాదం పలకనే పలకలేదు. దీంతో సీఎం జగన్ పర్యటన, సభలో వ్యవహరించిన తీరుపై వైసీపీ నేతల్లో ఆందోళన కలిగింది. పార్టీలో ఏదో జరుగుతుందని గుసగుసలాడుకున్నారు. తుఫాను వచ్చే ముందు వాతావరణం ప్రశాంతంగా ఉన్నట్లు సీఎం జగన్ మౌనంగా ఉన్నారంటే ఏదో జరగబోతుందని చర్చ జరిగింది. ఊహించినట్లుగానే టీడీపీకి ఓటు వేసిన ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు పడింది.వైసీపీ నుంచి గెలుపొంది టీడీపీకి క్రాస్ ఓటు వేసిన ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేసిన అధిష్టానం ఇక మంత్రులపై వేటుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మార్చి 14న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొందరు మంత్రులపై అసహనం వ్యక్తం చేశారు. మంత్రుల పనితీరు మార్చుకోవాలని లేని పక్షంలో నలుగురు ఐదుగురు మంత్రులను మార్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని చెప్పుకొచ్చారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ అనుకున్న టైం రానే వచ్చినట్లు తెలుస్తోంది. కొందరు మంత్రులను మార్చడంతోపాటు శాఖలను కూడా మారుస్తారని ప్రచారం జరుగుతుంది. ఇందులో భాగంగానే సోమవారం సాయంత్రం గవర్నర్ అబ్ధుల్ నజీర్‌తో సీఎం వైఎస్ జగన్ భేటీ అవుతారని తెలుస్తోంది.ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రస్తుత తరుణంలో మంత్రివర్గ విస్తరణకు శ్రీకారం చుడతారా అన్న చర్చ జరుగుతుంది. ఇంకా ఎన్నికలకు ఏడాది సమయం మాత్రమే ఉంది. మంత్రివర్గంలో బెర్త్ ఆశించే వారి సంఖ్య చాంతాడంత ఉంది. ఇలాంటి తరుణంలో మంత్రివర్గవిస్తరణ జరిగితే తేనెతుట్టెను జగన్ కదిపినట్లేనని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇప్పటికే పార్టీలో అసంతృప్తులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ అసమ్మతి మరింత పెంచేందుకు మంత్రివర్గ విస్తరణ కారణమవుతుందని చెప్తున్నారు. అంతేకాదు ఏడాది కాలం సమయం ఉండగా కేబినెట్‌లో చోటు దక్కించుకునేవారు ఏం ప్రూఫ్ చేసుకుంటారనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. మంత్రి ఆయా శాఖలోని అన్ని అంశాలపై అవగాహన తెచ్చుకోవడానికి చాలా సమయం పడుతుందని అలాంటిది ఏడాదిలో కొత్త మంత్రులు సాధించేదేముందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. గవర్నర్ అబ్ధుల్ నజీర్‌తో భేటీ కేవలం పాలనపరమైన అంశాలపైనే ఉంటుందని కొందరు వాదిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, ఆమోదించిన బిల్లులపై గవర్నర్‌తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చర్చిస్తారని మరో ప్రచారం జరుగుతుంది. మరి సీఎం జగన్ మదిలో ఏముందో భేటీ తర్వాతే తెలుస్తుంది.

Related Posts