YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

నాణ్యతేదీ..

నాణ్యతేదీ..

తెలంగాణ ప్రభుత్వం ఎంతో సదుద్దేశంతో చెరువులకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు చేపట్టిన పథకం మిషన్‌ కాకతీయ. ఈ పథకం కింద దశలవారీగా చెరువులను ఎంపిక చేసి మరమ్మతులు చేస్తున్నారు. ప్రస్తుతం నాలుగోదశ పనులు నడుస్తున్నాయి. ఈ పథకం కింద అధికారులు చేపట్టిన మరమ్మతు పనులు పూర్తయిన ఏడాది తర్వాత ఆ పనుల్లోని లోపాలు కొట్టొచ్చినట్లు కన్పిస్తున్నాయి. అధికారులు, గుత్తేదారుల నిర్లక్ష్యం వెరసి పనులు నాసిరకంగా సాగాయి. మొదటి, రెండు దశల్లో చేపట్టిన చెరువుల మరమ్మతుల్లో నాణ్యత డొల్ల బయటకు కన్పిస్తుంది. చెరువు కట్టలు నెర్రలుబారడం, తూముల గేట్లు ఊడిపోవడం, అలుగు పనులు అంతంత మాత్రమే కనిపిస్తున్నాయి. ఇలా ఒక్కటేమిటీ అన్నింట్లో నాణ్యత లోపించింది. మూడో విడత పనులు పూర్తికాకపోవడం, నాలుగో విడత పనులు ప్రారంభం  కావడం ఆ దశలలోని లోపాలు పూర్తిస్థాయిలో బయటకు రాలేదు.

చెరువుల మరమ్మతుల్లో భాగంగా పూడికతీత, చెరువు కట్టల బలోపేతం, తూముల ఆధునికీకరణ, అలుగులకు మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. వాస్తవంగా పూడికతీత పనులు సక్రమంగా చేయలేదనే ఆరోపణలు బలంగా వినిపించాయి. ఆయా గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులే ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసిన దాఖలాలున్నాయి. చెరువు కట్టల బలోపేతం కార్యక్రమంలో అధికారులు చూసీచూడనట్లు పోవడంతో ఆ చెరువు కట్టలు ఏడాదికే నెర్రలు బారుతున్నాయి. వాస్తవంగా చెరువుకట్టకు ఉన్న చెట్లను తొలగించి కట్ట పొడవునా మట్టి పోసి కట్టను రెండువైపులో బలోపేతం చేయాలి. కట్ట బలంగా ఉండేందుకు రోలర్‌తో తొక్కించాలి. కానీ, అలా జరగలేదు. నామమాత్రంగా చెరువుకట్టపై ఉన్న చెట్లను తొలగించి కొన్ని చోట్ల తొలగించలేదు. కట్టపై మొరం పోసి చేతులు దులిపేసుకున్నారు. ఏదో మరీ బలహీనంగా ఉన్న చెరువు కట్టపై మాత్రమే మొరం పోసి రోలర్‌తో తొక్కించారు. ఎక్కువ చెరువులను రోలర్‌తో తొక్కించలేదనే ఆరోపణలున్నాయి. దీంతో పనులు పూర్తయిన ఏడాది తరువాత పనుల్లో నాణ్యతా లోపాలు బయటకు కన్పిస్తున్నాయి.

చెరువుల మరమ్మతుల్లో భాగంగా అధికారులు తూములను ఆధునికీకరించి వాటికి గేట్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ గుత్తేదారులు తూములకు చేయాల్సిన సిమెంట్‌ పని సక్రమంగా చేపట్టలేదు. కొన్ని చెరువులకు పెట్టిన గేట్లు ఊడిపోతున్నాయి. కామంచికల్లు ఎర్రగుంట చెరువు, కాచిరాజుగూడెంలోని ఊరకుంట, బాపనకుంట చెరువులకు ఏర్పాటు చేసిన గేట్లు ఊడిపోతున్నాయి. తూములను కూడా సక్రమంగా మరమ్మతులు చేయలేదు. నాసికరం పనుల వల్ల వెంటనే ఆ తూములు మళ్లీ మరమ్మతులకు గురవుతున్నాయి. చెరువులకు అలుగులు మరమ్మతులు చేయడంలో కూడా అధికారులు నిర్లక్ష్యంగానే వ్యవహరించారు. కాచిరాజుగూడెం ఊరచెరువుకు అసలు అలుగే ఏర్పాటు చేయలేదు.

కోసం చెరువుల్లో గుంతలుపెట్టి మట్టి తోలకాలు చేపట్టారు. ఆ చెరువులకు మిషన్‌ కాకతీయ పథకం కింద నిధులు మంజూరు కావడంతో కొంతమంది గుత్తేదారులు గతంలో ఉన్న గుంతలనే తాము పూడిక తీసినట్లుగా సృష్టించి బిల్లులు కాజేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఖమ్మం కార్పొరేషన్‌ పరిధిలోని రామన్నపేట చెరువులో ఇటువంటి సంఘటనే చోటుచేసుకుందని స్థానిక కార్పొరేటర్‌ గతంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు కూడా చేశారు.

Related Posts