YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

నేపాల్ కు అమృత్ పాల్..?

నేపాల్ కు అమృత్ పాల్..?

ఛండీఘడ్, మార్చి 29, 
ఖలిస్థాన్ వేర్పాటు వాది అమృత్ పాల్ సింగ్ పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్నాడు. ఆచూకీ కోసం దాదాపు 8 రాష్ట్రాల పోలీసులు గాలిస్తున్నారు. పంజాబ్ నుంచి మారు వేషంలో పరారైన అమృత్ పాల్ సింగ్ తొలుత హర్యానా వెళ్లినట్టుగా సీసీటీవీ విజువల్స్ వైరల్ అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న అమృత్‌ పాల్ పోలీసులు తనను పట్టుకుంటారనే ఆలోచనతో ఉత్తరాఖండ్‌కి మకాం మార్చినట్లు సమాచారం అందింది. తాజాగా అమృత్ పాల్ సింగ్ తలకు టర్బన్ లేకుండా ఢిల్లీ వీధుల్లో తిరుగుతూ కనిపించినట్లు సీసీటీవీ ఫుటేజీ వెలుగులోకొచ్చింది. ఆ సమయంలో అమృత్ పాల్ సింగ్ ప్రధాన అనుచరుడైన పపల్ ప్రీత్ సింగ్ కూడా అతడి వెంటే ఉన్నట్టు సీసీటీవీ ఫుటేజీ స్పష్టంచేస్తోంది. తలకు టర్బన్ లేకుండా పెరిగిన జుట్టుతో ఉన్న అమృత్ పాల్ సింగ్.. ముఖానికి మాస్క్ ధరించి కనిపించాడు. అందులో ఉన్నది అసలు అమృత్ పాల్ సింగ్, అతడి అనుచరుడు పపల్ ప్రీత్ సింగేనా లేక అలా కనిపిస్తున్న మరొకరా అనే విషయాన్ని ధృవీకరించుకునే పనిలో ఉన్నారు పోలీసులు. అంతేకాకుండా అసలు సీసీటీవీ కెమెరా దృశ్యాలు కూడా అసలు ఢిల్లీ మార్కెట్ లోనివేనా అనే అనుమానాలు ఉన్నాయి.ఈ క్రమంలోనే అమృత్ పాల్ నేపాల్‌లో ఉన్నట్టు సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన కేంద్రం...నేపాల్‌ను అలెర్ట్ చేసింది. నేపాల్ నుంచి నకిలీ పాస్‌పోర్ట్‌తో వేరే దేశానికి పారిపోవాలని చూస్తున్నట్టు నిఘా వర్గాలు చెబుతున్నాయి. అక్కడి నుంచి పారిపోకుండా నేపాల్ అధికారులు నిఘా పెట్టాలని భారత్ కోరింది. ఖాట్మండ్‌లోని ఇండియన్ ఎంబసీ ప్రభుత్వ అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. నేపాల్ పరారయ్యేందుకు అమృత్ పాల్ స్కెచ్ వేస్తున్నాడని, వెంటనే అతడిని అరెస్ట్ చేయాలని తెలిపింది. ఈ మేరకు ఓ లేఖ కూడా రాసింది."నేపాల్ ఇమిగ్రేషన్ డిపార్ట్‌మెంట్‌కు మా విజ్ఞప్తి. అమృత్ పాల్ సింగ్‌ విదేశానికి పారిపోకుండా అడ్డుకోవాలని కోరుతున్నాం. వెంటనే అరెస్ట్ చేయండి. ఇండియన్ పాస్‌పోర్ట్‌ లేదా నకిలీ పాస్‌పోర్ట్‌తో వేరే దేశానికి పారిపోవాలని చూస్తున్నట్టు సమాచారం అందింది"ఇదే లెటర్‌ను నేపాల్‌లోని కీలక హోటల్స్‌కూ పంపారు. అమృత్ పాల్ సింగ్‌కు రకరకాల పేర్లతో పలు పాస్‌పోర్ట్‌లు ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. పంజాబ్‌లోని జలంధర్‌ వద్ద పోలీసుల కళ్లుగప్పి పారిపోయిన అమృత్...అప్పటి నుంచి పరారీలోనే ఉన్నాడు. అమృత్‌పాల్‌ సింగ్ నేపాల్ మీదుగా కెనడా పారిపోయే అవకాశాలు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే వారిస్ పంజాబ్ దే నేత కోసం భద్రతా దళాలు పంజాబ్ ను గాలిస్తున్నాయి. చాలా కాలం దుబాయ్ లో ఉన్న అమృత్‌పాల్‌ కు అక్కడే పాకిస్థానీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐతో పరిచయాలు ఏర్పడ్డట్లు అధికారులు గుర్తించారు. అతడిని పాక్ ఐఎస్ఐ పావుగా వాడుకుంటోందని, పంజాబ్‌లో కల్లోలం సృష్టించడానికి అమృత్‌పాల్ ను వాడుకున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. అమృత్‌పాల్ 2012లో ట్రక్ డ్రైవర్ గా పని చేసేందుకు దుబాయ్ కు వెళ్లాడు. అక్కడే ఖలిస్థానీ నాయకుడు లఖ్బీర్ సింగ్ రోడే సోదరుడు జశ్వంత్ తో, ఉగ్రవాది పరమ్‌జీత్‌ సింగ్ పమ్మాతో పరిచయం ఏర్పడింది. వారు అమృత్ పాల్ కు బ్రెయిన్ వాష్ చేశారు. ఆ తర్వాత అమృత్‌పాల్‌ను జార్జియా పంపించారు. అక్కడే అతడికి ఐఎస్ఐ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారని ఇంటెలిజెన్స్ అధికారులు అనుమానిస్తున్నారు. పంజాబ్ లో ఆందోళనలు రేపడానికే అమృత్ పాల్ దేశంలోకి అడుగుపెట్టినట్లు అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత వారిస్ పంజాబ్ దేలో చేరి చాలా వేగంగా ఎదిగాడు. దీంతో పాటు సిక్ ఫర్ జస్టిస్ సంస్థతో కూడా అమృత్ పాల్‌కు సంబంధాలు ఉన్నాయి.

Related Posts