శ్రీకాకుళం, మార్చి 31,
శ్రీకాకుళం జిల్లా రాజకీయాలలో టెక్కలికి ఓ ప్రత్యేకత ఉంది. టెక్కలి నియోజకవర్గం నుంచి ఎంతో మంది నాయకులు రాజకీయాలలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ఎవరి పరిధిల్లో వారు రాణించి మంచి పేరు తెచ్చుకున్నారు. అటువంటి టెక్కలిలో రాజకీయాలు ఇప్పుడు తరుచూ వివాదాస్పదమవుతున్నాయి. ప్రత్యేకించి అధికార పార్టీ నాయకుల ఆగడాలు దుమారం రేపుతున్నాయి. వైసీపీ గ్రూపుల గోల ఒక వైపు పార్టీలో కలకలం సృష్టిస్తుంటే మరో వైపు అధికారం అండదండలతో ఎమ్మెల్సీ అనుచరులు చేస్తున్న పనులు చర్చణీయాంశమవుతుంది. పార్టీకే చెడ్డపేరు తెచ్చేలా వారి చేష్టలు ఉంటున్నాయన్న విమర్శలు వైసీపీ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి. తాజాగా టెక్కలి ప్రధాన మార్గంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు జన్మదినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పోస్టర్లను ఆయన అనుచరులు అతికించారు.
టెక్కలి నియోజకవర్గ నాయకుడు, పేదల పెన్నిది ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కి శ్రీరామ నవమి శుభాకాంక్షలు అంటూ ఆయన అభిమానులు, ప్రజాప్రతినిధు కార్యకర్తల పేరుతో పోస్టర్లు వెలిశాయి. ప్రింట్ చేసిన పోస్టర్లను నేరుగా తెలుగుదేశం పార్టీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై పేస్ట్ చేశారు. అచ్చెన్న ఫోటో కన్పించకుండా దువ్వాడ ఫోటోలు కనిపించేలా పోస్టర్లు పెట్టారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అభిమానులకి శ్రీరామ నవమి శుభాకాంక్షల పోస్టర్లను అతికించేందుకు తెదేపా ఫ్లెక్సీలు తప్పా మరెక్కాడ స్థలం దొరకలేదన్నట్లుగా వారు దుశ్చర్యలకి పాల్పడ్డారు. వైకాపా నేతలు వ్యవహరించిన తీరుపై తెలుగుతమ్ముళ్ళు మండిపడుతున్నారు. ఇటువంటి సంస్కృతికి వైకాపా కార్యకర్తలు తెగబడడాన్ని వారు ఖండిస్తున్నారు. చేతనైతేసొంతంగా బోర్డులు ఏర్పాటు చేసుకుని వాటిపై వైకాపా నేతలు పోస్టర్లు అతికించుకోవాలని అంతేగాని ప్రతిపక్ష నాయకులు పెట్టిన ఫ్లెక్సీలపై పోస్టర్లు అతికించడం ఏంటని తెలుగుతమ్ముళ్ళ ధ్వజమెత్తారు. సాధారణ కార్యకర్తలెవ్వరికీ ఇటువంటి ఆలోచనలు రావని కేవలం వైకాపా కీలక నేతల ఆదేశాల మేరకే వారి అనుచరులు బరితెగించి ఉంటారని తెదేపా శ్రేణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రామరాజ్యం స్థాపనే లక్ష్యమని, ప్రతి ఇంటా సంతోషం నింపేలా సాగిన రాముడి పాలనే ఉత్తమ మార్గమని, నైతిక ప్రవర్తన ఎన్నటికీ ఆధర్వమంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెబుతూ వస్తుంటారు. జగనే తన దేవుడు అని చెప్పుకునే దువ్వాడ శ్రీనివాస్ అనుచరులు ఇలాంటి చేష్టలకు పాల్పడుతున్నారని స్థానికులు అంటున్నారు.టెక్కలిలో ఈ పోస్టర్ల వివాదం కలకలం రేపుతుంది. వైకాపా శ్రేణుల చర్యలను తెదేపా నేతలు ఖండిస్తుండగా దువ్వాడ వ్యతిరేక వర్గీయులు సైతం తప్పుపడుతున్నారు. టెక్కలిలో నెలకొన్న ఈ వివాదం దుమారం రేపుతుంది. టెక్కలి నియోజకవర్గంలో గెలుపు కోసం వైకాపా పడరాని పాట్లు పడుతుందని, కింజరాపు అచ్చెన్నను ఓడించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారంటున్నారు. తెదేపా నాయకులు, కార్యకర్తలు కూడా వైకాపాకి ధీటుగా సమాధానం చెప్పేందుకు సిద్దమవుతున్నారు. టెక్కలిలో పాగా వేసేది నువ్వా నేనా అన్న రీతిలో వైకాపా, తెదేపాల మధ్య పోరు కొనసాతుండగా ఈ తరుణంలో అచ్చెన్న ఫ్లెక్సీలపై దువ్వాడ పోస్టర్లు అతికించిన తీరు స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ తీరుపై తెలుగుతమ్ముళ్ళు మండిపడుతున్నారు.టెక్కలిలో తెదేపా రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు జన్మదినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై ప్రత్యర్థి పార్టీకి చెందిన వ్యక్తులు శ్రీరామ నవమి శుభాకాంక్షలు పేరుతో పోస్టర్లను అతికించారని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు టెక్కలి పోలీసులకు వారంతా కలిసి ఫిర్యాదు చేశారు. టెక్కలి ప్రధాన మార్గంలో పోలీస్ స్టేషన్ కి కూతవేటు దూరంలో ఇటువంటి కవ్వింపు చర్యలు చోటుచేసుకోవడం దురదృష్టకరమని వారు పేర్కొన్నారు.