విశాఖపట్టణం, మార్చి 31,
గుడివాడ అమర్నాథ్. ఏపీ మంత్రి. దాడి వీరభద్రరావు… మాజీ మంత్రి. ఇద్దరూ అధికారపార్టీలో ఉన్నారు. ఇద్దరి పొలిటికల్ కేంద్రం అనకాపల్లి. అమన్నాథ్‌కు, దాడికి అస్సలు పొసగడం లేదనేది పార్టీలో అందరికి తెలుసు. ఎవరి శిబిరం వాళ్లదే. అక్కడ వాలిన కాకి ఇక్కడ వాలదు. మొదట్లో ఇద్దరూ కలిసినట్టు ఉన్నా.. తర్వాత గ్యాప్ వచ్చింది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. స్వపక్షంలోనే విపక్షంగా ఉంటున్నారు ఈ ఇద్దరు నాయకులు. వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి టికెట్ గవర సామాజికవర్గానికి ఇస్తారనే ప్రచారంతో దాడి యాక్టివేట్ అవుతున్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే ఎక్కడో ఒకచోట అకామిడేట్ చేస్తారని ఆశించారు. కానీ.. అధిష్ఠానం అనకాపల్లి నేతలవైపు చూసినట్టు లేదు. అనకాపల్లిలో అమర్నాథ్ పోటీ చేస్తారో లేదోకానీ.. ఇక్కడ మాత్రం వర్గ రాజకీయం మాత్రం సెగలు కక్కుతోంది. తాజాగా అనకాపల్లి నూకాంబిక అమ్మవారి జాతర వేదికగా జరిగిన పరిణామాలు ఒకరినొకరు చెక్ పెట్టుకునే దిశగా వెళ్లాయి.ఈ నెల 21న అమ్మవారి దర్శనానికి రావాలని మంత్రి అమర్నాథ్‌ను ఆహ్వానించారు ఆలయ నిర్వాహకులు. కొత్త అమావాస్య కావడంతో భక్తుల రద్దీతో గుడి కిటకిటలాడింది. అదేరోజు సాయంత్రం ఆలయానికి వెళ్లారు మంత్రి. ప్రొటోకాల్ ప్రకారం అమర్నాథ్‌కు స్వాగతం పలికారు ఆలయ అధికారులు. అయితే దర్శనానికి మాత్రం గంటపాటు వెయిట్ చేయించారు. ఆలయ శుద్ధి.. నైవేధ్యం పేరుతో మంత్రిని ఆపేయడంతో అమర్నాథ్ కూడా లైట్ తీసుకున్నారట. అయితే కొద్ది రోజులు గడిచాక.. అసలు విషయం తెలుసుకుని మంత్రి ఫైర్ అయ్యారట. ఇప్పుడు దాని చుట్టూనే చర్చ జరుగుతోంది. ఆలయ ఈవోగా ఉన్న చంద్రశేఖర్.. దాదాపు ఆరు నెలల క్రితం ఇక్కడికి వచ్చారు. అప్పటి నుంచి ఆలయంలో దాడి వీరభద్రరావు ప్రాధాన్యం పెరిగిందని టాక్. దర్శనాలు.. ఆలయ ఆచార వ్యవహారాల్లో దాడి సూచనలు కీలకంగా మారినట్టు మంత్రికి తెలియడం.. తాజాగా తనను దర్శనానికి పిలిచి వెయిట్ చేయించడం వెనుక కుట్ర ఉండొచ్చని సందేహించారు అమర్నాథ్.జరిగిన ఘటనపై దేవాదాయ మంత్రికి ఫిర్యాదు చేశారు అమర్నాథ్. ఆ తర్వాత ఈవో చంద్రశేఖర్ ఏజెన్సీకి బదిలీ అయ్యారు. విమర్శలు రాకుండా.. మరో ఇద్దరు అధికారుల బాధ్యతల్లోనూ మార్పులు చేశారని సమాచారం. దీంతో దాడితో అమర్నాథ్‌కు జరుగుతున్న రాజకీయ యుద్ధం డైరెక్ట్ వార్‌గా మారిందని అభిప్రాయ పడుతున్నారు. త్వరలో వివిధ ఆలయాలకు ట్రస్ట్ బోర్డుల నియామకం జరగనుంది. నూకాంబిక ఆలయంలో పరిస్ధితులను కారణంగా చూపించి వచ్చే పదవుల్లో దాడి వర్గానికి ఎటువంటి అవకాశం కల్పించరాదనే డిమాండ్ మంత్రి దగ్గరకు వచ్చిందని సమాచారం. ఆ ప్రతిపాదనకు అమర్నాథ్ స్పందించకపోయినా రాజకీయాలు మాత్రం వేడెక్కడం ఖాయంగానే కనిపిస్తోంది. కీలెరిగి వాతపెట్టినట్టు ఉండాలంటే ప్రస్తుతం ఆలయం ఈవో బదిలీపై చర్చ జరగాలని కోరుకుంటోంది అమర్నాథ్ వర్గం. తద్వార అనకాపల్లిలో దాడి వర్గానికి సహకరిస్తే రియాక్షన్ ఎంత సీరియస్‌గా ఉంటుందో చెప్పడానికి నూకాంబిక ఆలయం ఎపిసోడ్‌ను ఎగ్జాంపుల్‌గా తీసుకోవాలని మంత్రి శిబిరం హెచ్చరిస్తున్నట్టు తెలుస్తోంది.