అప్పుల బాధ భరించలేక ఆలయంలోనే ముగ్గురు ఆత్మహత్య చేసుకొన్న ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకొంది. దివ్యాంగుడైన వేలుస్వామి ఇంటి నిర్మాణం కోసం అప్పులు చేశాడు. అప్పులిచ్చిన వారు ఒత్తిడి చేయడంతో ఆయన తన చెల్లెళ్ళతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తమిళనాడులోని పళని అడివారం అరుల్‌జ్యోతి వీధిలో కలకలం రేపింది. దివ్యాంగుడయిన వేలుసామి (32) చిల్లర దుకాణం నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. వేలుసామికి నలుగురు చెల్లెలున్నారు. అందులో జయలక్ష్మి అనే సోదరికి వివాహమైంది. కానీ, ఆమె భర్తను వదిలేసింది.
ఆమె భర్తతో విడిపోయి వేలుస్వామి వద్దే ఉంటోంది. కాగా, వేలుసామి ఇంటి నిర్మాణానికి కొందరి వద్ద అప్పు చేశాడు. ఈ నేపథ్యంలో ఆయనపై కొన్ని రోజులుగా ఒత్తిడి పెరిగిపోయింది. తీసుకున్న అప్పు చెల్లించలేక వేలుసామి తన సోదరీమణులు చంద్ర, జయలక్ష్మితో పాటు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకొన్నాడు. పళని మురుగన్ ఆలయానికి వచ్చాడు. వారు ముగ్గురు అక్కడే విషం తీసుకోవడంతో నురగ కక్కుతూ స్పృహతప్పి పడిపోయారు. ఈ విషయాన్ని గుర్తించిన ఆలయ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.