YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

బిల్లులేని ఇళ్లు

బిల్లులేని ఇళ్లు

పేద వర్గాల సొంతింటి నిర్మాణాలకు బాలారిష్టాలు వీడటం లేదు. ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో ఇల్లు సమకూరుతుందన్న ఆశతో నిర్మాణ పనులు తలకెత్తుకున్న లబ్ధిదారులు పలు అగచాట్లు పడాల్సి వస్తోంది. ముందస్తు నుంచి నరేగా నిధులు పొందడం సమస్యాత్మకంగా మారింది. గడచిన రెండు నెలలుగా గృహ నిర్మాణ సంస్థ ద్వారా ఇవ్వాల్సిన బిల్లులు కూడా నిలిచిపోవడంతో నిర్మాణాల పురోగతి మందగించింది. సకాలంలో బిల్లుల వస్తాయన్న నమ్మకంతో అప్పులు తెచ్చి పనులు చేపట్టిన నిర్మాణదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గడచిన మార్చి నుంచి ఇప్పటి వరకూ లబ్ధిదారులకు చెల్లించాల్సిన దాదాపు రూ.56 కోట్ల బిల్లులు గృహ నిర్మాణ సంస్థ పెండింగ్‌లో ఉన్నాయి. వీటికి తోడు నరేగా నిధుల ద్వారా రావాల్సిన బకాయిలకు కూడా ఎటువంటి మోక్షం లభించలేదు.

అధికారం చేపట్టాక టీడీపీ ప్రభుత్వం తిరిగి ఎన్టీఆర్‌ గృహ నిర్మాణం పేరుతో పథకాన్ని పునః ప్రారంభించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 2016 నుంచి భారీ ఎత్తున గృహ నిర్మాణాలకు అనుమతులిచ్చారు.  రాష్ట్ర ప్రభుత్వ పరంగా రూ.1.50 లక్షల యూనిట్‌ విలువతో ఎన్టీఆర్‌ గ్రామీణ గృహ నిర్మాణ పథకాన్ని, కేంద్రం సహకారంతో ఎన్టీఆర్‌(గ్రామీణ) ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం ద్వారా రూ.2 లక్షల యూనిట్‌ విలువతో గృహాలను మంజూరు చేశారు. రూ.1.50 లక్షల యూనిట్‌ విలువలో రాష్ట్ర ప్రభుత్వ రాయితీ రూ.95 వేలు ఉండగా మిగిలిన రూ.55 వేలు ఉపాధిహామీ(నరేగా) నిధులుగా పేర్కొన్నారు.  రూ.2 లక్షల యూనిట్‌ విలువలో రూ.72 వేలు కేంద్రం, రూ.48 వేలు రాష్ట్ర ప్రభుత్వ రాయితీ, రూ.58,260 నరేగానిధులు, రూ.18,740 రుణంగా పేర్కొన్నారు. 

ప్రభుత్వం ఇచ్చే రాయితీతో ఆర్థిక ఊతం లభిస్తుందన్న భావనతో పలువురు ఆశగా గృహ నిర్మాణాలను ప్రారంభించారు. తొలినాళ్లలో నిబంధనల పేరుతో లబ్ధిదారులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోగా ప్రజాపత్రినిధుల జోక్యంతో అవి సమసిపోయాయి.  బిల్లుల మంజూరు విషయంలో ఆది నుంచి ఇబ్బందులు తప్పడం లేదు. నరేగా నిధుల విడుదలే లబ్ధిదారుల సహనాన్ని పరీక్షించేలా చేస్తోంది. నరేగా నిధులకు సంబంధించి  దాదాపు రూ. 55 వేలల్లో 90 పని దినాలు కల్పనతో పాటు ఇటుక రాయి తయారీ చేయాల్సి ఉంటుంది. ఇటుక రాయి సొంతంగా తయారు చేసుకొనే పరిస్థితి లబ్ధిదారునికి లేకపోవడం, బిల్లుల తయారీ క్లిష్టతరంగా ఉండే క్రమంలో ఆ నిధులు సక్రమంగా విడుదల కావడం లేదు. ఇంటి నిర్మాణాలను ఏనాడో పూర్తి చేసుకున్న వారికి సైతం ఇప్పటికి నరేగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వాస్తవంగా ప్రభుత్వం ఇచ్చే మొత్తంతో గృహ నిర్మాణం పూర్తవదని తలిసినా ఏదోలా ఒడ్డున పడవచ్చన్న ఆశతో పలువురు గృహ లబ్ధిదారులు నిర్మాణ పనులు ప్రారంభించారు. నిర్మాణాలకు అవసరమైన కంకర, ఇనుము, సిమెంట్‌, తదితర సామగ్రి ధరలు అందుబాటులో లేని పరిస్థితుల్లో అప్పులు చేసి మరీ పనులు కొనసాగించారు. 

నరేగాకు సంబంధించిన బిల్లులు రాకున్నా గృహ నిర్మాణ శాఖ పరంగా వచ్చే బిల్లులపై ఆధారపడి పనులు ఆగకుండా చూసుకుంటున్నారు. మార్చి మొదటి నుంచి గృహ నిర్మాణ శాఖ పరంగా రావాల్సిన బిల్లులు కూడా నిలిచిపోయాయి. ఓ పక్క నిర్మాణ పనులను పూర్తి చేసుకోలేక, మరోపక్క తెచ్చిన అప్పులు తీర్చలేక తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. బిల్లులు భారీ ఎత్తున పేరుకుపోవడంతో నిర్మాణ పనుల పురోగతి పూర్తిగా మందగించగా, నూతనంగా నిర్మాణాలు ప్రారంభించాలనుకున్న వారు పునరాలోచనలో పడుతున్నారు. మార్చి 2వ తేదీ నుంచి ఇప్పటి వరకూ జిల్లా వ్యాప్తంగా రూ.55.65 కోట్ల బిల్లులు ఆగిపోయాయి. ఫలితంగా నిర్మాణ పనులు దాదాపుగా స్తంభించిపోయాయి. లక్ష్యాల సాధన కోసం ఉన్నతాధికారుల ఒత్తిడి నేపథ్యంలో గృహ నిర్మాణ శాఖ సిబ్బంది లబ్ధిదారులపై ఎన్ని ఒత్తిళ్లు తెస్తున్నా తగు సహకారం కన్పించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ పరంగా చెల్లించాల్సిన దాదాపు రూ. 56 కోట్ల బకాయిలతో పాటు నరేగా నిధుల నుంచి రావాల్సిన బకాయిలు కూడా అంతే మొత్తంలో ఉండే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి, కేంద్రం రాష్ట్రాన్ని ఇస్తున్న నామమాత్రపు సహకారం నేపథ్యంలో బిల్లుల మంజూరుపై లబ్ధిదారుల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ వారం వ్యవధిలో నిధుల మంజూరుకు చొరవ తీసుకుంటామని చెప్పడంతో మొత్తం కాకపోయినా కనీసం రూ. 30 కోట్ల మేర బిల్లులకైనా మోక్షం లభించే అవకాశం ఉంది. నరేగా నిధుల విషయంలో నెలకొన్న సమస్యను పరిష్కరించే చర్యల్లో భాగంగా వాటి బాధ్యతను కూడా రాష్ట్ర ప్రభుత్వమే తీసుకొనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. 

Related Posts