విజయవాడ, ఏప్రిల్ 1,
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలకే టిక్కెట్ కన్ఫర్మ్ చేశారట. మిగిలిన ఇద్దరికి మాత్రం నో చెప్పేశారట. పార్టీ వర్గాల్లో ఇది చర్చనీయాంశమైంది. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారని వారిపై వైసీపీ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ నలుగురిలో ఇద్దరికే 2024 ఎన్నికల్లో టిక్కెట్ హామీని చంద్రబాబు ఇచ్చారంటున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, గుంటూరు జిల్లాకు చెందిన ఉండవల్లి శ్రీదేవిల రాజకీయ భవిష్యత్ పై జోరుగా ఊహాగానాలు జరుగుతున్నాయి.ఈ నలుగురిలో ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలకు మాత్రమే టిక్కెట్ హామీ పార్టీ అధినేత నుంచి లభించిందంటున్నారు. ఆనంకు ఆత్మకూరు నియోజకవర్గం, శ్రీధర్ రెడ్డికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం టీడీపీ టిక్కెట్లు దాదాపు కన్ఫర్మ్ అయినట్లే. వారిద్దరూ గత కొంత కాలంగా అధికార పార్టీపై విమర్శలు చేస్తున్నదీ అందుకేనట. ముందుగానే చంద్రబాబుతో మాట్లాడుకున్న తర్వాత వారిద్దరూ థిక్కార స్వరం వినిపించారంటారు. అందుకే వారిద్దరి నియోజకవర్గాల్లో సమన్వయకర్తలను నియమించినా పెద్దగా బాధపడలేదు. మొన్న సస్పెండ్ చేసినా పెద్దగా ఆశ్చర్యానికి లోను కాలేదుఇప్పటికే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సోదరుడు గిరిధర్‌రెడ్డి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఎన్నికలకు ముందు శ్రీధర్ రెడ్డి కూడా కండువా కప్పేసుకుంటారు. ఆనం విషయంలో అది జరగకపోయినా ఆయన దారి కూడా అదేనన్నది ఇక అందరికీ తెలిసిన విషయమే. ఆత్మకూరులో పార్టీ గెలవాలంటే ఆనం అవసరమని చంద్రబాబు గట్టిగా భావిస్తున్నారు. అక్కడ సరైన అభ్యర్థి లేకపోవడంతో ఆనం ఆత్మకూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగనున్నారు. ఇక నెల్లూరు రూరల్ లో కొంత పాత టీడీపీ నేతలు కోటంరెడ్డి చేరికపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా అది టీ కప్పులో తుపాను మాత్రమేనని చంద్రబాబు భావిస్తున్నారు. మెల్లగా సర్దుకుంటాయని, వారి చేరికలకు ఇంకా సమయం ఉండటంతో అసమ్మతిపై చంద్రబాబు పెద్దగా దృష్టిపెట్టలేదు. . ఇక మరో ఇద్దరి ఎమ్మెల్యేల పరిస్థితి ఎటూ గాకుండా ఉంది. ఉండవల్లి శ్రీదేవిని పార్టీలో కూడా చేర్చుకునే అవకాశం లేదు. ఆమెకు టిక్కెట్ సంగతి అటుంచితే ఆమెకు పార్టీలో ఎంట్రీ కూడా కష్టమేనని పార్టీ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. ఆమెపై నియోజకవర్గంలో ఉన్న అసంతృప్తి అందుకు కారణమంటున్నారు. ఇకమరో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి సయితం ఉదయగిరి టిక్కెట్ టీడీపీ ఇవ్వడం కష్టమేనని చెబుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడం, నియోజకవర్గంలో అసంతృప్తితో కొత్త నేతకు అక్కడ టీడీపీ టిక్కెట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఇద్దరు ఎమ్మెల్యేల రాజకీయ భవిష్యత్ మాత్రం ఎటూ కాకుండా పోయిందంటున్నారు.