ముంబై, ఏప్రిల్ 1,
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ పై మరో పరువునష్టం కేసు నమోదైంది. భారత్ జోడో యాత్ర సందర్భంగా పలు బహిరంగ సభల్లో రాహుల్ గాంధీ ప్రసంగించారు. అలా ఒక సభలో ప్రసంగిస్తూ, ఆరెస్సెస్ పై విమర్శలు గుప్పించారు. ఆ విమర్శలపై ఇప్పుడు పరువు నష్టం దావా వేశారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ ఆరెస్సెస్ వారిని 21వ శతాబ్దపు కౌరవులుగా అభివర్ణించారు. భారత్ జోడో యాత్ర ముగిసి కూడా మూడు నెలలు ముగిశాయి. తాజాగా రాహుల్ గాంధీ నాడు ఆరెస్సెస్ వారిని 21వ శతాబ్ధపు కౌరవులుగా అభివర్ణించడంపై హరిద్వార్ కోర్టులో శుక్రవారం పరువునష్టం పిటిషన్ దాఖలైంది. రాహుల్ గాంధీ పై బిహార్ లోని ఒక కోర్టులోనూ పరువునష్టం దావా దాఖలైంది. ఆ కేసును బిహార్ ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ వేశారు. ప్రధాని నరేంద్రమోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై గుజరాత్ కోర్టు రాహుల్ గాంధీ కి ఇటీవల రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ తీర్పుపై పై కోర్టులో అప్పీల్ చేసుకోవడానికి కోర్టు నెల రోజుల గడువు ఇచ్చింది. కాగా, ఈ తీర్పు వెలువడిన మర్నాడే, ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల ప్రకారం, రాహుల్ గాంధీ ని లోక్ సభ సభ్యత్వానికి అనర్హుడిగా లోక్ సభ సెక్రటేరియట్ ప్రకటించింది. ఆ మర్నాడే, ఎంపీగా ఢిల్లీలో ఆయనకు కేటాయించిన బంగళాను ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని విపక్షాలు ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించాయి. మహారాష్ట్రలోని థానేలో కూడా రాహుల్ గాంధీ పై ఒక పరువు నష్టం కేసు నడుస్తోంది. మహాత్మా గాంధీ హత్యకు ఆరెస్సెస్కారణమని 2014 లో రాహుల్ గాంధీ ఒక బహిరంగ సభలో ఆరోపించారు. ఆ వ్యాఖ్యలపై ఆరెస్సెస్ కార్యకర్త ఒకరు థానే కోర్టులో దావా వేశారు. మరోవైపు, సావర్కర్ ను బ్రిటిష వారిని క్షమాపణలు కోరారంటూ రాహుల్ గాంధీ పదేపదే చేస్తున్న వ్యాఖ్యలపై బీజేపీ నేతలే కాకుండా, మిత్రపక్షమైన శివసేన నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.