నెల్లూరు, ఏప్రిల్ 1,
నెల్లూరులో బ్యూటీ సెలూన్, స్పాల పేరుతో కొంతమంది అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. కొన్నాళ్లుగా ఆయా స్పా సెంటర్లపై నిఘా పెట్టారు. చివరకు రెడ్ హ్యాండెడ్ గా అక్కడ నిర్వాహకుల్ని పట్టుకున్నారు. మొత్తం 15మందిని అదుపులోకి తీసుకున్నారు. అందులో 8 మందిని బాధితులుగా గుర్తించి వారిని సేఫ్టీ హోమ్స్ కి తరలించినట్టు తెలిపారు నెల్లూరు పోలీసులు. నెల్లూరు దర్గామిట్టలోని రోజ్ కింగ్ స్పా, లోటస్ స్పా కి సంబంధించిన మొత్తం 3 బ్రాంచ్ లపై దాడులు చేశారు పోలీసులు. దాడుల వ్యవహారం మీడియాకి తెలియకుండా జాగ్రత్తపడ్డారు. అరెస్ట్ అయిన తర్వాత మాత్రం ప్రెస్ మీట్ పెట్టి వివరాలు తెలియజేశారు. మూడు స్పా లపై ఏకకాలంలో దాడులు చేశారు. స్పా ముసుగులో లోపల జరుగుతున్న వ్యవహారాలు బయటపడ్డాయి. పైకి స్పా, మసాజ్ సెంటర్ అనే పేరు ఉంటుంది. లోపలికి వెళ్లిన తర్వాత ఆర్డినరీ సర్వీసా, స్పెషల్ సర్వీసా అనే ప్రశ్న వినపడుతుంది. స్పెషల్ సర్వీస్ కి వెళ్తే అందులో ఎక్స్ ట్రా సర్వీస్ అనే పేరుతో నిర్వాహకులు అమ్మాయిలతో అసభ్య కార్యకలాపాలు చేపడుతున్నారని తెలిపారు పోలీసులు. అయితే ఈ సర్వీసులు కేవలం ఆయా స్పా ల వ్యవహారం తెలిసినవారికి మాత్రమే అందుబాటులో ఉంటాయ. అంటే వారంతా అక్కడికి రెగ్యులర్ కస్టమర్లు. కొత్తగా వచ్చేవారికి, అనుమానంగా ఉన్నవారికి ఎలాంటి ఆఫర్లు ఇవ్వరు. అక్కడ నార్మల్ స్పా లలో జరిగే మసాజ్ లు మాత్రమే చేసి పంపిస్తారు.మొత్తం 8మంది అమ్మాయిలను పోలీసులు అదుపులోకి తీసుకుని సేఫ్టీ హోమ్స్ కి తరలించారు. పశ్చిమబెంగాల్, ఢిల్లీ, ముంబై నుంచి వీరిని తీసుకొస్తున్నారు. నెల్లూరు నగరంలో వారికి అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లోనే బస ఏర్పాట్లు చేస్తున్నారు. స్పా లలో వ్యభిచారం కోసం తీసుకొచ్చే అమ్మాయిల పూర్తి బాధ్యత నిర్వాహకులదే. వారికి జీతాలతోపాటు, రూమ్ రెంట్, ఇతరత్రా అవసరాలన్నీ వారే చూసుకుంటారు. వారు స్పా లో మినహా ఇంకెక్కడా పనిచేయకూడదు, బయటకు వెళ్లకూడదనే రూల్స్ కూడా పెడతారట. నెల్లూరులో మూడు స్పా సెంటర్లపై దాడులు చేశామని, ఇకపై కూడా దాడులు కొనసాగుతాయని హెచ్చరించారు పోలీసులు. స్పా ముసుగులో అసాంఘిక కార్యక్రమాలకు ఎవరు పాల్పడినా క్షమించేది లేదన్నారు. నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని, విటులపై కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. బెజవాడలోని ఓ స్పా సెంటర్ పై కొన్ని రోజుల కిందట పోలీసులు దాడులు నిర్వహించారు. స్పా పేరుతో వ్యభిచారం చేయిస్తున్న ఇద్దరు నిర్వాహకులను, 8 మంది బాధిత మహిళలు, యువతులను, ముగ్గురు అబ్బాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెజవాడ కేంద్రంగా హైటెక్ వ్యభిచారం కొనసాగిస్తున్నారు. విజయవాడ నగరంలో పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో గురునానక్ కాలనీలో ఉన్న కె స్టూడియో స్పాలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులే మారువేషంలో అమ్మాయిల కోసం వెళ్లి బేరసారాలు జరిపారు. అందులోనూ పక్కా సమాచారం అందటంతో ప్రత్యేక పోలీసు బలగాలు స్పాలో సోదాలు చేయటంతో 8 మంది అమ్మాయిలలను రక్షించారు పోలీసులు. అమ్మాయిల కోసం స్పా సెంటర్‌కు వచ్చిన ముగ్గురు యువకులు, ఇద్దరు నిర్వాహకులను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు విడిపించిన మహిళలు అంతా పలు రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు