తిరుమల, ఏప్రిల్ 4,
కలియుగ శ్రీనివాసుడు పై అపారమైన భక్తిభావంతో గోవిందనామాలు స్మరించుకుంటూ మొక్కుబడిగా మెట్టుమెట్టుకు నమస్కరించుకుంటూ వేల సంఖ్యలో భక్తులు పురాతన మార్గమైన నడకదారిలో ఏడుకొండలవాడి చెంతకు చేరుకుంటారు. తిరుమల చేరుకోవడానికి ఉన్నవి రెండు నడకమార్గాలు. ఒకటి అలిపిరి, మరోక్కటి శ్రీవారి మెట్టు మార్గం. తిరుపతి నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో చంద్రగిరి పట్టణానికి సమీపంలో ఉండేది ఈ శ్రీవారి మెట్టు నడకమార్గం, పద్మావతి అమ్మవారిని కళ్యాణం చేసుకున్న తరువాత సాక్షాత్తు ఆ స్వామి అమ్మవార్లు కొండపైకి నడిచివెళ్లిన మార్గం కాబట్టే దానికి శ్రీవారి మెట్టు నడకమార్గంగా ప్రసిద్ధి చెందిందిఇంతటి ప్రాశస్త్యం కలిగిన నడకమార్గం గతేడాది నవంబర్ నెలలో కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా దెబ్బతింది. దాదాపు 500 పైగా మెట్లు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. నాలుగు కల్వర్ట్‌లతో పాటు మెట్లకు ఇరువైపులా ఉండే రిటైనింగ్ వాల్స్ ధ్వంసమైపోయాయి. వరద ప్రభావంతో శ్రీవారి మెట్టు నడకమార్గం గుర్తుపట్టలేనంత.. పెద్దపెద్ద బండరాళ్లు, గుండులు, మట్టిపెళ్లలు, కొండచరియలతో నిండిపోయింది. తిరుమల చరిత్రలో మొదటిసారి మెట్లమార్గం భారీస్థాయిలో దెబ్బతింది.గత ఏడాది నవంబర్ 19వ తేదీ శ్రీవారి మెట్టు నడకమార్గాన్ని టీటీడీ మూసివేసింది. శ్రీవారి మెట్టు మార్గంలో రోజూ టీటీడీ 6వేల సర్వదర్శనం టోకెన్లు మంజూరు చెసేది. ప్రస్తుతం ఆ మార్గాన్ని మూసి వేయడంతో కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి పాదయాత్రగా వచ్చే గోవింద మాలధారణ భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదనంగా 15 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది.ఇక నెల రోజుల్లో శ్రీవారిమెట్టు మార్గం పనులు పునరుద్ధరణ చేస్తామని చెప్పారు అధికారులు.. అయితే 5 నెలల గడుస్తున్నా పనులు ముందుకు సాగడం లేదని స్థానికులు, భక్తులు ఆరోపిస్తున్నారు. 800వ మెట్టు, 1200వ మెట్టు వద్ద 30 అడుగుల వెడల్పు, 30అడుగుల లోతు గోతులు ఏర్పడ్డాయి. వాటిని పునర్నిర్మాణం చేయడానికి చాలా సమయం పట్టేట్లు ఉంది. మరో 2 నెలల గడిచినా పనులు పూర్తయ్యే అవకాశం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా పనులు వేగవంతం చేయాలని కోరుతున్నారు భక్తులు.