హైదరాబాద్, ఏప్రిల్ 5,
మాదక ద్రవ్యాల కోసం యువత చిన్నచిన్న చోరీల నుంచి హత్యలు చేయడానికి, ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా వెనుకాడటం లేదు. ఇటీవలికాలంలో నగరంలో పెరుగుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా బంజారాహిల్స్ రాడిసన్‌బ్లూ హోటల్లో దొరికిన 150 మందిలో 80 శాతం మంది 35ఏళ్లలోపు వారే. మధ్య తరగతి యువతీ, యువకులు ఎక్కువగా గంజాయి తీసుకుంటున్నారు.ఆర్థికంగా ఉండి, పబ్బులకు వెళ్లేవాళ్లు కొకైన్, హెరాయిన్, ఓపీయం, ఎల్ఎస్డీ వంటి ద్రావణాలను తీసుకుంటున్నారు. ఆవేశంతోనో, ఆనందం కోసమో మొదలవుతున్న ఈ అలవాటు క్రమంగా వ్యసనంగా మారుతోంది. ఆ తర్వాత వారి భవిష్యత్‌నే కబళిస్తోంది. వారి జీవితాలను పాడుచేసుకోవడమే కాదు... మత్తులో వాహనాలు నడిపి ఇతరుల మరణానికీ కారణమవుతున్నారు. చాలా ఘటనల్లో పిల్లలు డ్రగ్స్‌కు అలవాటు పడడానికి స్నేహితులు, తల్లిదండ్రులే కారణమవుతున్నారని నిపుణులు చెబుతున్నారు. చిన్నచిన్న జాగ్రత్తలతో పిల్లలను కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు. మాదక ద్రవ్యాలు తీసుకున్న వారి ప్రవర్తనలో విపరీతమైన మార్పులుంటాయి. చిన్న విషయాలకు చిరాకు, కోపం తెచ్చుకుంటారు. వేళకు తినరు. ఒక్కోసారి అతిగా తింటారు. వ్యక్తిగత శుభ్రత ఉండదు. చదువు, పనితీరులో వెనకబడుతుంటారు. ఆసక్తి తగ్గుతుంది. ఏకాగ్రతను కోల్పోతారు. పరధ్యానంలో ఉంటారు. విపరీతమైన దూకుడు ప్రదర్శిస్తారు. నలుగురిలో కలిసేందుకు ఇష్టపడరు. తల్లిదండ్రుల కళ్లల్లోకి సూటిగా చూడలేక పోతారు. ఇలాంటి లక్షణాలుంటే డ్రగ్స్ తీసుకుంటున్నారని అనుమానించొచ్చు. పిల్లలు ఎక్కడికి, ఎవరితో వెళ్తున్నారు? తిరిగి ఇంటికెప్పుడొస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? ఏం తింటున్నారు? ఏం తాగుతున్నారు? ఎలాంటివారితో స్నేహం చేస్తున్నారు? వంటి అంశాలు తెలుసుకోవాలి. లేదంటే పిల్లలు చేయిదాటిపోవడమే కాదు అసాంఘీక శక్తులుగా మారే ప్రమాదం ఉంది.గంజాయి, కొకైన్, హెరాయిన్, మారిజువానా, మార్పిన్, చేరస్ వంటివన్నీ ఈ కోవలోకే వస్తాయి. డ్రగ్స్ తీసుకున్న వారు ఊహా లోకంలో విహరిస్తుంటారు. దీన్నే యూపోరియా అంటాం. ఒకసారి ఈ భావన పొందిన వ్యక్తి మళ్లీ, మళ్లీ అలాంటి అనుభూతినే పొందాలని భావిస్తుంటాడు. ఉన్నత వర్గాల్లో ఈ సంస్కృతి విపరీతంగా పెరిగింది. డ్రగ్స్ వాడకంతో మానసిక, శారీరక ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇవి దొరక్కపోతే అసాంఘీక కార్యకలాపాలకు, నేరాలకు పాల్పడుతారు. పిల్లలు డ్రగ్స్ బారిన పడితే.. కౌన్సిలింగ్ ఇచ్చి కాపాడుకోవచ్చు. వ్యసనంగా మారిన డ్రగ్స్ యువత ఆరోగ్యంపై దీర్ఘకాల ప్రభావం చూపుతున్నాయి. నిరంతరం ముక్కు నుంచి నీరు కారడం, లోపల మంట, గొంతులో పుండ్లు, బొంగురు పోవడం, చర్మంపై దద్దుర్లు, కీలకమైన సిరలు దెబ్బ తినడం, మొదడు పోటు, నిద్రలేమి/అతినిద్ర వంటి సమస్యలు తలెత్తడం, రాపిడికి గురై పళ్లు పాడైపో వడం, గుండెపోటు, వాల్వ్‌లకు ఇన్ఫెక్షన్లు, రక్తకఫం, పిల్లికూతలు, ఆయాసం, ఉబ్బసం, నిమోనియా వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆల్కహాల్‌తోపాటు డ్రగ్స్ తీసుకోవడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ కేసులు పెరుగుతున్నాయని నిమ్స్ న్యూరో సర్జన్ విభాగం అధిపతి డాక్టర్ ఎర్రంనేని వంశీకృష్ణ తెలిపారు. డ్రగ్స్‌తో రక్తనాళాలు వ్యాకోచించి, మెదడులో రక్తస్రావం అవుతుందని.. ఇది ప్రాణాలకు ప్రమాదకరమని స్పష్టం చేశారు. డ్రగ్స్ వినియోగం వల్ల మానసిక ఒత్తిడి, భావోద్వేగ సమస్యలు పెరిగి.. తమ పనులను సక్రమంగా చేసుకోలేని స్థితికి చేరుకుంటారని చెప్పారు. కొన్ని సందర్భాల్లో డ్రగ్స్ బాధితులు గుండెపోటుతో చనిపోతున్నారన్నారు.ఆల్కహాల్‌తో డ్రగ్స్ కలిపి తీసుకునేవారి సంఖ్య పెరిగిందని.. వారిలో చాలా మంది విద్యావంతులు కావడం, 29 నుంచి 35 ఏళ్ల మధ్య వయసువారే అధికంగా ఉండటం ఆందోళనకరమని చెప్పారు. కొకైన్, గంజాయిలను ఆల్కహాల్‌తో కలిపి తీసుకున్న యువకుడు ఇటీవల మెదడులో రక్తస్రావంతో చనిపోయాడని.. ఓ ఐటీ ఉద్యోగిని గంజాయికి అలవాటుపడి రెండుసార్లు బ్రెయిన్ స్టోక్‌కు గురైందని వివరించారు. డ్రగ్స్ వల్ల చేజేతులా జీవితాలను కోల్పోయే ప్రమాదముందని.. యువత ఆల్కహాల్, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు.