YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

సావిత్రి... వివాదాలు

సావిత్రి... వివాదాలు

అలనాటి మేటి నటి.. నిన్నటితరం సూపర్ స్టార్ సావిత్రి జీవితవిశేషాల ఆధారంగా తెరకెక్కింది మహానటి. ఈ చిత్రాన్ని అంతా క్లాసిక్ గా ప్రశంసిస్తున్నారు. అందరూ గొప్ప చిత్రంగా పేర్కొంటున్న మహానటిని విమర్శిస్తున్నవారూ ఉన్నారు. అద్భుత దృశ్యకావ్యంగా మహానటి చిత్రం ప్రశంసలందుకుంటోంది. అయితే జెమిని గణేషన్ ఫ్యామిలీ నుంచి మాత్రం అసంతృప్తి వెల్లువెత్తుతోంది. ఆయన మొదటి భార్య కుమార్తె కమల సెల్వరాజ్ కొన్ని సీన్స్ పై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. అంతేకాదు..సావిత్రికి తన తండ్రి అంటే ఇష్టం లేదనీ అన్నారు. దీంతో జెమినీగణేశన్ కుమార్తెల మధ్య చిచ్చు రేగిందన్న వార్తలు గుప్పుమన్నాయి.సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన 'మహానటి' సినిమాపై తెలుగునాట ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ సినిమా చిత్రీకరించిన తీరుపై ఇప్పటి వరకు ఎక్కడా ఎలాంటి వ్యతిరేకత వ్యక్తం కాలేదు. సావిత్రి పిల్లలు విజయ ఛాముండేశ్వరి, సతీష్ సైతం ఈ సినిమాపై పూర్తి సంతృప్తిగా ఉన్నారు. అమ్మ గురించి నిజాలు చూపించారని సంతోషం వ్యక్తం చేశారు. అయితే తొలిసారిగా ఈ సినిమాపై వ్యతిరేక గళం వినిపించింది. జెమినీ గణేశన్ మొదటి భార్య అలమేలు కూతురు, వైద్యురాలు కమలా సెల్వరాజ్‌ సినిమాలో తన తండ్రిని చిత్రీకరించిన తీరుపై మండి పడ్డారు.మహానటిలో జెమిని గణేషన్ చిత్రీకరణపై కమలా సెల్వరాజ్ తీవ్ర ఆవేదనే వ్యక్తంచేశారు. సావిత్రి గొప్పే కానీ.. మా నాన్న కాదా అంటూ ప్రశ్నించారు కూడా. అంతేకాదు.. తన తండ్రి ఎలాంటి వారో వివరించారు. దీంతో అలమేలు, సావిత్రి పిల్లల మధ్య అభిప్రాయ బేధాలు రావచ్చన్న టాక్ వినిపించింది. అయితే విజయ చాముండేశ్వరి మాత్రం కమలను కూల్ చేసే విధంగానే మాట్లాడారు. మహానటిలో కొన్ని సీన్స్ వాస్తవ విరుద్ధంగా ఉన్నాయని ఒప్పుకున్నారు. తండ్రి ద్వారా లభించిన అపురూప ఆస్తి తన అక్కాచెల్లెళ్లే అని అన్నారు. తమ బంధం ఎప్పటికీ ప్రభావితం కాదని స్పష్టంచేశారు. కమల కూడా మహానటి సినిమా తమ వ్యక్తిగత అనుబంధంపై పడదని తేల్చి చెప్పారు. కానీ సినిమాలో తన తండ్రిని చిత్రీకరించిన విధానం మాత్రం నచ్చలేదని స్పష్టంచేశారు.మహానటి’ సినిమాలో తన తండ్రి పాత్రను చిత్రీకరించిన తీరు వేదన కలిగించిందని కమలా సెల్వరాజ్‌ అన్నారు. తమిళ చిత్రపరిశ్రమలో ఎంజీఆర్‌, శివాజీగణేశన్‌లతో పాటు తన తండ్రి జెమినీగణేశన్‌ కూడా అగ్రహీరో అని అందరికీ తెలుసునన్నారు. అలాంటి వ్యక్తి పాత్రను సోమరిపోతుగాను, చిన్నచిన్న పనులు చేసే వ్యక్తిగాను, కించపరిచేలా చిత్రీకరించారని ఆమె ఆరోపించారు. సావిత్రికి మద్యం అలవాటు చేసింది నాన్నే అన్నట్లు చిత్రీకరించడం తనను ఎంతగానో బాధించిందన్నారు.ప్రాప్తం చిత్ర నిర్మాణం చేయాలన్న పంతంతో ఉన్న సావిత్రి నిర్ణయాన్ని వెనక్కు తీసుకోమని చెప్పడానికి నాన్నతో కలసి తానూ ఆమె ఇంటికి వెళితే తమపై కుక్కను వదిలి గెంటేశారని కమల తెలిపారు. అంతేకాక తన తండ్రి  ప్రేమించిన వారినే ఆయన పెళ్లి చేసుకున్నారని, పెళ్లయిన వారినెవరిని ఆయన చెడగొట్టలేదని స్పష్టంచేశారు. సినిమాలో చూపించిన వివిధ దృశ్యాలపై కమల అభ్యంతరం వ్యక్తంచేశారు. సావిత్రిగారు గొప్ప స్టార్‌ అని ఎలివేట్‌ చేశారు. మా నాన్నగారు కూడా  పెద్ద స్టార్‌. అది ఎలివేట్‌ చేసినట్లు అనిపించలేదని అన్నారు. ఆయనేదో అవకాశాలు తగ్గిపోయి బాధపడినట్లు చూపించారు. అది నిజం కాదు. సావిత్రమ్మను ఆయన మోసం చేయాలని ఏనాడూ అనుకోలేదని ‘నా భార్య’ అని సమాజానికి చెప్పారని తేల్చి చెప్పారు. మోసం చేయాలనే ఉద్దేశం ఉంటే అసలు పెళ్లి చేసుకునేవారు కాదని పేర్కొన్నారు. సావిత్రమ్మ తరఫున వాళ్ల పిల్లలతో మాట్లాడినట్లే నాన్నగారి తరఫున మాతో మాట్లాడి ఉండాలి. అప్పుడు ఇంకా చాలా విషయాలు చెప్పేదాన్ని. అసలైన నిజాలతో సినిమా ఇంకా బాగా వచ్చి ఉండేదని అన్నారు.మహానటి సినిమాపై తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కిన కమలా సెల్వరాజ్.. సావిత్రమ్మపై మాత్రం అభిమానమే చూపారు. సావిత్రి చాలా మంచివారని చెప్పారు. తమను చాలా ఆప్యాయంగా చూశేవారని గుర్తుచేసుకున్నారు. ఎవరికైనా తమను పరిచయం చేసిన తర్వాతే సొంత పిల్లలు విజయ చాముండేశ్వరి, సతీష్ లను పరిచయం చేసేవారని అన్నారు. తన తల్లి అలమేలు, సావిత్రిల మధ్యా చాలా అభిమానం ఉండేదని చెప్పారు.సావిత్రి తన జీవితాన్ని తానే నాశనం చేసుకున్నారన్నది కమల అభిప్రాయం. సావిత్రమ్మ కొన్ని విషయాల్లో మొండిగా ఉండేవారని, ఇక ఆమె చుట్టుపక్కల ఉన్నవారు కూడా ఆమెను సరిగా గైడ్ చేయకపోవడంతో నష్టపోయారని తెలిపారు. సావిత్రిని చాలామంది మోసం చేశారని స్పష్టంచేశారు. ఈ విషయాన్ని నాన్నగారు చెప్పాలని ప్రయత్నిస్తే చాన్స్‌ ఇవ్వలేదని ఆయన్ను దగ్గరికే రానివ్వలేదని తెలిపారు. బంధువులు కొందరు, ఇంట్లో పని చేసినవాళ్లు కొందరు ఎవరి చేతికి చిక్కినవి వాళ్లు తీసుకెళ్లిపోవడంతో ఆర్ధికంగా ఒడిదొడుకులకు గురయ్యారని అన్నారు. నమ్మినవాళ్లు మోసం చేయడంవల్లే సావిత్రి ఆర్ధికంగా ఇబ్బందుల్లో పడ్డారని కమల స్పష్టంచేస్తున్నారు. తన తండ్రి ఆమెకు అండగా ఉండేందుకే యత్నించారని అయితే ఆమె చుట్టూ చేరిన వారు తమ ప్రయోజనాలు దెబ్బతింటాయన్న ఉద్దేశంతో వ్యవహించారని తేల్చి చెప్పారు. సావిత్రి ఆఖరి రోజుల్లో హాస్పిటల్ ఖర్చంతా తన తండ్రే భరించారని అన్నారు. ఆమె అంత్యక్రియలు సైతం తమ ఇంట్లోనే జరిగాయని తన తల్లి అలమేలు, పిన్ని పుష్పవల్లి దగ్గరుండి ఆ కార్యక్రమాన్ని జరిపించారని చెప్పారు. భర్త బతికి ఉండగా చనిపోయిన స్త్రీ అంతిమ యాత్ర ఎలా జరుగుతుందో అలా సంప్రదాయానుసారం తన తల్లే దగ్గరుండి చేయించారని స్పష్టం చేశారు.

Related Posts