విశాఖపట్టణం, ఏప్రిల్ 6,
డీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు నేటి చంద్రబాబు సమావేశానికి హాజరవుతారా? డుమ్మా కొడతారా? ఇదే తెలుగుదేశం పార్టీలో చర్చ జరుగుతుంది. ఈరోజు విశాఖపట్నంలో టీడీపీ జోనల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశాన్ని చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత అత్యంత ఉత్సాహంగా విశాఖపట్నానికి చంద్రబాబు వస్తున్నారు. గతంలో వచ్చినా అనేక ఇబ్బందులు. కానీ ఈసారి అలా కాదు రెట్టించిన ఉత్సాహంతో చంద్రబాబు విశాఖకు వస్తున్నారు. అయితే ఈ సమావేశానికి అయ్యన్న పాత్రుడు హాజరుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే కొందరు నేతలు అయ్యన్నతో సంప్రదింపులు జరుపుతున్నారు. గంటా శ్రీనివాసరావు పార్టీలో యాక్టివ్‌గా మారినప్పటి నుంచి అయ్యన్న పాత్రుడు కొంత సైలెంట్ అయ్యారు. చంద్రబాబు తొలినాళ్లలో చెప్పిన విధంగా చేయడం లేదని ఆయన నొచ్చుకుంటున్నారని తెలిసింది. మూడేళ్ల పాటు వైసీీపీని ఎదిరించి, అనేక కష్టాలు పడిన తమ కుటుంబం కేసులను ఎదుర్కొనిందని, అయినా భయపడకుండా పార్టీ కోసం నిలబడిందని, కానీ గంటా శ్రీనివాసరావు మాత్రం మూడున్నరేళ్లు పార్టీకి, చివరకు శాసనసభకు కూడా దూరంగా ఉన్నా నాలుగో ఏడాది యాక్టివ్ కాగానే చంద్రబాబు దగ్గర తీయడం అయ్యన్న సహించలేకపోతున్నారు. ఇక తొలి నుంచి కష్టపడిన వారికి పార్టీలో గుర్తింపు ఎలా ఉంటుందని అయ్యన్న పాత్రుడు సన్నిహితుల వద్ద ప్రశ్నించినట్లు తెలిసింది. అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావుకు తొలి నుంచి పడదు. ఆధిపత్య పోరు నడుస్తుంది. 2014 నుంచి 2019 వరకూ ఇద్దరూ చంద్రబాబు మంత్రివర్గంలో సభ్యులే. అయినా ఒకరిపై ఒకరు తరచూ విమర్శలు చేసుకునే వారు. పార్టీకి ఇబ్బంది కలిగించే వారు. అయినా చంద్రబాబు ఇద్దరూ సామాజికంగా, ఆర్థికంగా బలమైన నేతలు కావడంతో చూసీ చూడనట్లు వ్యవహరించారు. అయితే అయ్యన్న సీనియర్. పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి అయ్యన్న ఆ పార్టీలోనే ఉన్నారు. మధ్యలో ఎన్ని సంక్షోభాలు ఎదురైనా పార్టీ జెండా వీడలేదు. పార్టీనే నమ్ముకుని ఉన్నారు. పార్టీ జెండాను ఏనాడు వదిలిపెట్టలేదు. అందుకే అయ్యన్న తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ మంత్రివర్గంలో ఉంటారు. నమ్మకమైన నేతగా పార్టీలో గుర్తింపు పొందారు. 2029లో పదవీ విరమణ చేయాలనుకుంటున్నారు. తాను వచ్చే ఎన్నికల్లో నర్సీపట్నం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. తనకుమారుడు విజయ్‌ను అనకాపల్లి పార్లమెంటు నుంచి బరిలోకి దింపాలని ప్రయత్నిస్తున్నారు. కానీ గంటా శ్రీనివాసరావు అలా కాదు. పార్టీలు మారి మారి టీడీపీలోకి వచ్చారు. సామాజికవర్గం, ధనం అండదండలతో ఆయన మంత్రిపదవి చేపడుతున్నారు. టీడీపీ, ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలకు వెళ్లి తిరిగి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి సెటిల్ అయ్యారు. మొన్నా మధ్య ఆయన జనసేనలో చేరతారని ప్రచారం జరిగింది. వైసీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నించారని, కానీ అక్కడ అధినాయకత్వం గంటా డిమాండ్లకు అంగీకరించకపోవడంతో ఆయన టీడీపీలో కొనసాగుతున్నారని అయ్యన్న అనుచరులు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఇందులో ఎంతోకొంత నిజముందని టీడీపీ హైకమాండ్ కూడా నమ్ముతుంది. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో గంటాకు స్పెషల్ ట్రీట్‌మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. మాజీ మంత్రి నారాయణకు వియ్యంకుడు కావడం కూడా గంటాకు అదనపు బలం. అందుకే టీడీపీ అధినేత గంటాను తిరిగి దగ్గరకు తీసుకోవాల్సి వచ్చిందంటున్నారు. అయితే అయ్యన్న మాత్రం గంటా విషయంలో కొంత ఇబ్బందిగానీ ఫీలవుతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి. పార్టీని వీడేంత నిర్ణయం తీసుకోకపోయినా అధినాయకత్వం ముందు మాత్రం తన అసంతృప్తిని అయ్యన్న వెల్లడిస్తారని, నేడుజరిగే సమావేశానికి హాజరైనా గంటాపై పరోక్షంగా విరుచుకుపడతారని మాత్రం చెప్పక తప్పదు.