YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో పొలిటికల్ వారసులు ఖర్చీఫ్ వేస్తున్న నేతాశ్రీలు

ఏపీలో పొలిటికల్ వారసులు ఖర్చీఫ్ వేస్తున్న నేతాశ్రీలు

విజయవాడ, ఏప్రిల్ 8, 
ఏపీ పాలిటిక్స్‌లో ఇప్పుడు వారసుల సీజన్‌ నడుస్తోంది. ఎక్కడికక్కడ పార్టీ సీనియర్‌ లీడర్స్‌ తమ కొడుకులు, కూతుళ్ళని వచ్చే ఎన్నికల కోసం సిద్ధం చేస్తున్నారు. ఈసారి టిక్కెట్‌ మాకు ఇవ్వకున్నా ఫర్లేదు… మా వాళ్ళకు ఇవ్వండంటూ పార్టీ నాయకత్వాలకు సంకేతాలు పంపుతున్నారు. మరికొందరైతే ఏకంగా అధిష్ఠానం పెద్దల దగ్గరే తమ మనసులోని మాటను చెప్పేస్తున్నారు. అట్నుంచి ఎలాంటి క్లారిటీ రాకున్నా…. ఎవరి ప్రయత్నాలు వారు మాత్రం చేస్తున్నారు. గతంలో ఇంటింటికీ మన ప్రభుత్వం కార్యక్రమంలోనే తమ వారసుల్ని దింపాలని కొందరు నాయకులు ప్రయత్నించినా… జగన్‌ వారించి… వారినే తిరగమనడంతో అప్పటికి తగ్గారు. తిరిగి ఇప్పుడు ప్రయత్నాలు మొదలుపెట్టారు.చిత్తూరు జిల్లాలో వారసుల హంగామా హాట్‌ టాపిక్‌ అయింది. తిరుపతి నుంచి కుప్పం దాకా కుదిరిన చోటల్లా… ముఖ్య నాయకుల కొడుకులు, కూతుళ్ళు క్రియాశీలకంగా మారుతున్నారు. అందులో అగ్ర భాగాన ఉన్నారు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. ఆయన కుమారుడు అభినయ్‌ రెడ్డికి మొదట్నుంచి రాజకీయాల మీద ఆసక్తి ఎక్కువ. నియోజకవర్గానికి ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డే అయినా… అనధికారికంగా అంతా అభినయే నడుపుతున్నారట. పార్టీ నాయకులతోనే కాకుండా అధికారులతో కూడా నేరుగా మాట్లాడే వాడట. చివరికి తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల్లో అభినయ్‌ రెడ్డి కార్పొరేటర్‌గా ఏకగ్రీవమయ్యాయి. తర్వాత డిప్యూటీ మేయర్ పదవి వచ్చింది. ఇప్పుడు అధికారిక హోదాలోనే సిటీ అంతా తిరుగుతున్న డిప్యూటీ మేయర్‌… ఈసారి ఎన్నికల్లో తిరుపతి బరిలో తానే దిగేందుకు సిద్ధమవుతున్నారట. కరుణాకర్‌రెడ్డి కూడా కొడుకుని ఎమ్మెల్యేగా చూడాలని తహతహలాడుతున్నారట. అందుకుతగ్గట్టే ఈసారి ఎన్నికలకు దూరంగా ఉంటానని గతంలోనే ఆయన ప్రకటించారు కూడా.ఇక చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఇదే రూట్లో ఆలోచిస్తున్నారట. ఆయన పెద్ద కుమారుడు మోహిత్ రెడ్డిని రాజకీయ నాయకుడిగా నిలబెట్టాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. వైసీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న మోహిత్ రెడ్డి తిరుపతి రూరల్‌ నుంచి ఎంపీటీసీగా ఎన్నికై ఎంపీపీ పదవి చేపట్టారు. అదే హోదాలో చంద్రగిరి నియోజకవర్గం మొత్తం పాదయాత్ర చేయడం హాట్‌ టాపిక్‌ అయింది. అంటే… నెక్స్ట్‌ నేను రెడీగా ఉన్నానన్న సంకేతాలు పంపారన్నది లోకల్‌ టాక్‌. నియోజకవర్గంలోని అభివృద్ధి పనుల్లో సైతం నేరుగానే జోక్యం చేసుకుంటున్నారు మోహిత్‌.మోహిత్ రెడ్డి పోటీకి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని స్వయంగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డే ప్రకటించారు. పార్టీ పరంగా 23 అనుబంధ సంఘాల బాధ్యతలను చెవిరెడ్డికి అప్పగించడంతో… ఆయన ఆ పెద్దరికపు బాధ్యతల్లో ఉండి కొడుకుని ఎమ్మెల్యేగా గెలిపించి వెనకుండి నడిపించాలనుకుంటున్నారట. ఎన్నికల తర్వాత చెవిరెడ్డికి టీటీడీ ఛైర్మన్‌గానీ… రాజ్యసభ సీటు గానీ ఇస్తానని చెప్పారట జగన్‌. అందుకే ఇక వారసుడి భవిష్యత్‌పై ఫుల్‌ ఫోకస్‌ పెట్టారట భాస్కర్‌రెడ్డి.వీరితో పాటు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న కుమారుడు సుధీర్ రెడ్డి సైతం పీలేరు, మదనపల్లె, పలమనేరులో ఏదో ఒక చోట నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది.సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కుమారుడు సుమన్ పరిస్థితి కూడా ఇంతే. ఆదిమూలం ఎమ్మెల్యే అయ్యాక సుమన్ నియోజకవర్గంలో చెలరేగిపోయారు. స్థానిక ఎన్నికల్లోనారాయణ వనం జడ్పీటీసీగా ఏకగ్రీవం అయ్యారు. తర్వాత అదే హోదాలో అధికారిక కార్యక్రమాలన్నిటికీ హాజరవుతున్నారు. జీడీ నెల్లూరులో డిప్యూటీ సిఎం నారాయణ స్వామి కూడా తన కుమార్తెకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలని అధినాయకత్వాన్ని అడిగినట్టు తెలిసింది. అయితే… ఇప్పటివరకు భూమన, చెవిరెడ్డి వారసులకు మాత్రమే గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చినట్టు తెలిసింది.ఉమ్మడి గుంటూరు జిల్లా విషయానికి వస్తే… గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న ముస్తఫా, తన కుమార్తెను రాజకీయ వారసురాలిగా ప్రకటించారు. అధిష్టానం ఆశీస్సులు ఉన్నాయని, 2024 ఎన్నికల్లో ఫాతిమాకు సీటు వస్తుందని ఇప్పట్నుంచే ప్రచారం చేసుకుంటున్నారు. అందుకు తగ్గట్టే ఫాతిమా కూడా గడప గడపకు కార్యక్రమంలో తిరుగుతూ… ప్రజలు, అధికారులకు పరిచయం అవుతున్నారు.రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు రేపల్లె నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. తాను ఎంపీగా ఉండగానే… కుమారుడికి పొలిటికల్‌ రూట్‌ క్లియర్‌ చేసే పనిలో ఉన్నారాయన. ఈసారి ఎన్నికల్లో మోపిదేవి రాజీవ్‌ను రంగంలోకి దింపే ప్రయత్నాల్లో ఉన్నారు వెంకటరమణ. ఇక మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి కుమారుడు పోటీ చేయబోతున్నారన్న ప్రచారం ఉంది. ఇటీవల కాలంలో అయోధ్య రామిరెడ్డి మంగళగిరి నియోజకవర్గాన్ని వదిలిపెట్టకుండా తిరుగుతున్నారు . ఇక్కడ ఇప్పటికే అయోధ్యరామిరెడ్డి సోదరుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈసారి పోటీకి ఆర్కే పోటీ చేయడానికి విముఖత చూపిస్తే, తన కుమారుడిని రంగంలోకి దింపాలన్న ఆలోచనలో ఉన్నారట అయోధ్య రామిరెడ్డి. తెనాలి నియోజకవర్గంలో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి కుమారుడు పోటీ చేయబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. కమ్మ సామాజిక వర్గానికి మిగిలిన పార్టీలు టిక్కెట్‌ ఇస్తే వైసిపి నుంచి కాపు సామాజిక వర్గ నేతగా ముద్రపడ్డ బాలశౌరి కుమారుడితో పోటీ చేయించాలన్న యోచనలో నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది .ఇక కృష్ణా జిల్లాలో తండ్రి వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన పేర్ని నాని తాను లైమ్‌లైట్‌లో ఉండగానే కుమారుడిని సెటిల్‌ చేయాలన్న ఆలోచనలో ఉన్నారట. మూడు సార్లు మచిలీపట్నం నుంచి ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు మంత్రిగా పనిచేసిన పేర్ని నాని ఇక రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని అనుకుంటున్నారట. తన తండ్రి ఏ విధంగా రిటైర్డ్ మెంట్ తీసుకున్నారో.. అలాగే ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేసిన తాను కూడా రిటైర్మెమెంట్ తీసుకోవాలని భావిస్తున్నారట. అందుకే ఇప్పుడు తన కుమారుడు కిట్టును వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకువచ్చి మచిలీపట్నం బరిలో దింపే ప్రయత్నాల్లో ఉన్నారట. కిట్టు అరంగేట్రానికి గడప గడపకు కార్యక్రమాన్నే వేదికగా మలుచుకుంటున్నారట పేర్ని. పార్టీ కార్యక్రమాల్లో తండ్రికంటే ఎక్కువగా కుమారుడు పాల్గొనడం ఇప్పుడు బందర్‌లో హాట్‌ టాపిక్‌ అయింది.తన మనసులోని మాటను పార్టీ అధిష్టానం దగ్గర చెప్పారట పేర్ని. కానీ… అట్నుంచి ఇంకా క్లారిటీ రాలేదట.రాజకీయ వారసులకు మంచి టేకాఫ్ ఇవ్వాలనే ఆలోచన ఉమ్మడి విశాఖ జిల్లా సీనియర్స్‌లో కూడా కనిపి స్తోంది. ఈ జాబితాలో టీడీపీ నుంచి మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్న పాత్రుడు ఉన్నారు. ప్రస్తుతం విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా ఉన్న గంటా శ్రీనివాసరావు వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గం మారాలని చూస్తున్నారు. అది కూడా సెమీ అర్బన్ లుక్ ఉన్న భీమిలి, పెందుర్తి, య లమంచిలిలో ఏదో ఒకటి ఐతే.. విజయం తేలిక అవుతుందని లెక్కలేసుకుంటున్నారు. అదే సమయంలో గంటా కుమారుడు రవితేజ రాజకీయ ఆరంగేట్రం కోసం కసరత్తు జరుగుతోందట. కాపు సామాజిక వర్గం ఎక్కువగా వున్న చోడవరం స్థానం నుంచి పోటీ పెడితే ఎలా ఉంటుందనే చర్చ జరుగు తోందట. కానీ.. టీడీపీలో తండ్రీ, కొడుకులకు టిక్కెట్లు దక్కే అవకాశాలపై చర్చ జరుగుతోందట. ఇక్కడే కొత్త లెక్కలు తీస్తోంది గంటా వర్గం. పార్టీలో కీలకంగా ఉన్న మాజీమంత్రి నారాయణకు అల్లుడు రవితేజ. ఈ కోటా వర్కవుట్ అయితే అవకాశాలు మెరుగుపడ తాయనే అభిప్రాయం ఉంది.ఇక, మరో మాజీమంత్రి., పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్న కూడా ఈసారి రాజకీయ వారసుడి కోసం గట్టిగా పట్టుబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పార్టీ ఐటీ వింగ్‌ను పర్యవేక్షిస్తున్న చింత కాయల విజయ్ ఈసారి ఎన్నికలలో పోటీకి సిద్ధం అవుతున్నారట. ఆరోగ్యకారణాలతో అయ్యన్న  2029నాటికి యాక్టివ్ పాలిటిక్స్ లో ఉండకపోవచ్చు. అంతకంటే ముందే.. అంటే వచ్చే ఎన్నికల నాటికి వారసుడికి బలమైన పునాదులు వేయాలని….అనకాపల్లి ఎంపీగా పోటీకి సిద్ధం చేయాలన్న ప్లాన్‌లో ఉన్నారట. అయితే..ఎన్నికల నాటికి సీట్ల కోసం పోటీ పెరుగుతుంది. పొత్తులు తెరపైకి వస్తాయి. అప్పటి సమీకరణాలు ఎంత వరకు విజయ్ కి సానుకూలంగా ఉంటాయనేది అనుమానమే.ఇక, వైసీపీ నుంచి వారసులకు సీట్లు ఆశిస్తున్న నేతలకు కొదవ లేదు. ఈ జాబితాలో మొదట చర్చ గాజువాక గురించే జరుగుతుంది. 2019 ఎన్నికల్లో పవవన్‌ కల్యాణ్‌ పోటీతో ఇక్కడ బాగా హైప్‌ వచ్చేసింది. పవన్‌ను ఓడించిన సిట్టింగ్‌ ఎమ్మెల్యే నాగిరెడ్డి వయోభారం కారణంగా వచ్చే ఎన్నికల్లో పోటీకి అంత ఆసక్తిగా లేరట. దీంతో తన కుమారుడు దేవన్ రెడ్డి పేరును పరిశీలిచాలని హైకమాండ్ ను అభ్యర్థిస్తున్నారట ఎమ్మెల్యే. ఈ దిశగా ఇప్పటి వరకు ఎలాంటి హామీ రాకున్నా…సిట్టింగ్‌ని కాదని ఇక్కడ పోటీకి దిగితే వ్యతిరేక ఫలితం ఉంటుందన్న అభిప్రాయం పార్టీ వర్గాలది. మరో శాసనసభ్యుడు కన్నబాబురాజు సైతం వచ్చే ఎన్నికల్లో పోటీపై హైకండ్ దగ్గర తన ప్రతిపాదనలు పెట్టారట. ఆరోగ్యపరమైన కారణాలతో తన కుమారుడు సుకుమార్ వర్మ అభ్యర్థిత్వాన్ని పరిశీలించమని కోరుతున్నారట కన్నబాబు. ఈ దశగా హామీ లభించిందనే చర్చ జరుగుతోంది. మరోవైపుడిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు తన కుమార్తె కోసం ప్లాట్ ఫామ్ సిద్ధం చేయాలని బలంగా కోరుకుంటున్నారట. ముత్యాల నాయుడు కుమార్తె అనురాధ ప్రస్తుతం కె.కోటపాడు జడ్పీటీసీగా, అనకాపల్లి జిల్లా మహిళ అధ్యక్షురాలుగా పని చేస్తున్నారు. ఆమెను మాడుగుల నుంచి పోటీ చేయించాలన్న ఆలోచనలో ఉన్నారట ముత్యాల నాయుడు.

Related Posts