విశాఖపట్టణం, ఏప్రిల్ 8,
వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణను బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని తెలంగాణ ఐటీ మంత్రి కేటిఆర్ వ్యాఖ్యానించిన రెండు రోజుల బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ వైజాగ్ లో బహిరంగ సభ నిర్వహించాలని డిసైడ్ చేయడం వెనుక..స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవాలనే ఆత్రం కన్నా.. తమ పార్టీని ఏపీలో విస్తరించాలన్న ఆరాటమే ఎక్కువగా కనిపిస్తోంది. స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతుగా కేసిఆర్ బహిరంగ సభ నిర్వహించేందుకు నిర్ణయించారు.ఆ సభను ఈ నెలలోనే అంటే ఏప్రిల్ లోనే నిర్వహించేందుకు ఏపీ బీఆర్ఎస్ అప్పుడే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అయితే ఇది స్టీల్ ప్లాంట్ కార్మికుల కోసం కాదు.. ఏపీలో పార్టీ విస్తరణకేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే బీఆర్ఎస్ వర్గాలు మాత్రం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న కార్మికులకు సంఘీభావంగా ఈ సభ నిర్వహిస్తున్నట్లు చెప్తున్నాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవే టీకరణకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమంలో బీఆర్ఎస్ ఏపీ శాఖ భాగస్వామ్యం అయ్యింది. కేంద్రం లోని మోడీ సర్కార్ అన్ని ప్రభుత్వరంగ సంస్థలను తన కార్పొరేట్ మిత్రులకు అప్పనంగా కట్టబెడుతోందని ఇటీవల కేసీఆర్, కేటీఆర్ అన్ని వేదికలపైనా విమర్శలు గుప్పిస్తున్నారు. ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభ తర్వాతే వైజాగ్లో పార్టీ బహిరంగ సభ నిర్వహించాలని భావించినా ఆ తరువాత మళ్లీ ఇప్పటి దాకా కేసీఆర్ ఆ ఊసే ఎత్తలేదు.మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించిన కేసీఆర్.. నాందేడ్ జిల్లాలో సభలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని అస్త్రంగా చేసుకొని ఏపీలో పార్టీ ప్రస్థానం షురూ చేసే ప్ర యత్నాల్లో ఉన్నారు. సభకు సంబంధించిన ఏర్పాట్ల ను ఏపీ బీఆర్ఎస్ చీఫ్ తోట చంద్రశేఖర్, ఇతర నేతలకు అప్పగించినట్లు చెబుతున్నారు. ఈ నెలలోనే కేసీఆర్ సభ ఉండే అవకాశముందని అంటున్నారు. తెరాస బీఆర్ఎస్ గా మారిన తర్వాత కేసీఆర్ ఏపీపైనే ఫోకస్ పెట్టారు. పలువురు నాయకులను చేర్చుకోవడంతో పాటు పెద్ద ఎత్తున సిట్టింగ్ ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారని బాంబు పేల్చారు. అయితే, దీనికి ఏపీ ఎమ్మెల్యేలు, ఇతరుల నుంచి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. ఏపీలో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తో బీఆర్ఎస్ కలిసి పనిచేయబోతోంద నే ప్రచారం సాగినా అది వాస్తవం కాదని వెంటనే తేలిపోయింది. దీంతో కేసీఆర్ ఏపీలో పార్టీ విస్తరణ ప్రయత్నాలను తగ్గించారనే ప్రచారమూ జరిగింది. ఇప్పుడు ఏపీలో పార్టీ విస్తరణ కు తెలంగాణ సీఎం కేసీఆర్ నడుంబిగించారని పార్టీ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. గద్వాల జిల్లాతో పాటు ఏపీలోని ఉమ్మడి కర్నూల్ జిల్లాలో ప్రభావం చూపగల చల్లా వెంకట్రామిరెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడానికి కూడా అదే కారణమని అంటున్నారు. అయితే ఏపీలో మళ్లీ అధికారం నిలబెట్టుకోవాలని వైసీపీ, గత ఏడాది ఒంగోలు మహానాడు సక్సెస్ తర్వాత .. జనంలో పాపులారిటీ క్రమంగా పెంచుకుంటున్న తెలుగుదేశం, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తాం అంటూ జనసేన ఇలా ఏపీలోని మూడు ప్రధాన పార్టీల హోరులో బీఆర్ఎస్ వెంట నడిచేవారెవరుంటారన్న సందేహాన్ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.