YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

విష్ణువర్ధన్ రెడ్డి యత్నం...కమలం గూటికి కిరణ్‌

విష్ణువర్ధన్ రెడ్డి యత్నం...కమలం గూటికి కిరణ్‌

అనంతపురం, ఏప్రిల్ 8, 
ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరడం అనూహ్య పరిణామం. ఆయన కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడు. రాష్ట్ర విభజన నిర్ణయంతో పార్టీపై విశ్వాసం కోల్పోయారు. తర్వాత మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరినా యాక్టివ్ కాలేకపోయారు. కాంగ్రెస్ హైకమాండ్ తన సూచనలు పట్టించుకోకపోవడం ఎలాంటి బాధ్యతలు ఇవ్వకపోవడంతో ఆయన సైలెంట్ అయిపోయారు. అయితే బీజేపీలో చేరడం మాత్రం అనూహ్యం.  కిరణ్‌ను బీజేపీలోకి తీసుకురావడంలో  ఏపీబీజేపీ ప్రధాన కార్యదర్శి  విష్ణువర్ధన్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఆయన నిరంతరం..  అటు హైకమాండ్‌తో ఇటు కిరణ్ కుమార్ రెడ్డితో చర్చలు జరిపి  బీజేపీలో చేరికకు మార్గం సుగమం చేసినట్లుగా తెలుస్తోంది. విష్ణువర్ధన్ రెడ్డి విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఆయన కీలకపాత్ర పోషించారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రాష్ట్ర విభజన జరిగింది. అయితే ఈ విభజనను కిరణ్ కుమార్ రెడ్డి వ్యతిరేకించారు. ఆ సమయంలో సమైక్యాంధ్ర ఉద్యమం ప్రారంభించారు. ఆ సమయంలో పదవులు ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరూ కిరణ్ కుమార్ రెడ్డితో నడవడానికి ముందుకు రాలేదు. కానీ రాయలసీమ జిల్లాల నుంచి విష్ణువర్ధన్ రెడ్డి..  కిరణ్ కుమార్ రెడ్డి చేపట్టిన సమైక్య ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఆ సమయంలో  కిరణ్ కుమార్ రెడ్డికి విష్ణువర్ధన్ రెడ్డి సన్నిహితమయ్యారు.  అప్పట్నుంచి ఉన్న సన్నిహిత సంబంధాలతో ఇప్పుడు పార్టీని బలోపేతం చేయడానికి విష్ణువర్ధన్ రెడ్డి ఉపయోగించుకున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం తర్వాత రాష్ట్ర విభజన జరగడంతో పూర్తి స్థాయిలో బీజేపీలో యాక్టివ్ అయిన విష్ణువర్ధన్ రెడ్డి నెహ్రూ యువ కేంద్ర వైస్ చైర్మన్‌గా సమర్థంగా పని చేస్తూ జాతీయ స్థాయి నేతల అభిమానాన్ని చూరగొన్నారు. పార్టీ బలోపేతం కోసం విష్ణువర్దన్ రెడ్డి కష్టరపడే తీరు పెద్దలకు నచ్చింది. కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరితే మంచి ఫలితాలు వస్తాయని ఆయన భావించారు. మొదట కిరణ్ కుమార్ రెడ్డిని సంప్రదించారు. ఏపీలో బీజేపీ ఎదడగానికి ఉన్న అవకాశాలపై చర్చించి..  పార్టీలో చేరేలా ఒప్పించారు. తర్వాత విష్ణువర్ధన్ రెడ్డి బీజేపీ హైకమాండ్ పెద్దలతోనూ మాట్లాడారు.  నిజానికి మాజీ ముఖ్యమంత్రి స్థాయి నేతను పార్టీలో చేర్చుకోవాలంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే పార్టీలో చేరే ఆ నేతకు సముచిత గౌరవం ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి సమస్యలన్నింటినీ విష్ణువర్ధన్ రెడ్డి పరిష్కరించారు. ఇటు కిరణ్ రెడ్డితో  అటు హైకమాండ్‌తో సంప్రదింపులు జరిపి చివరికి లైన్ క్లియర్ చేశారు. ఆయన పట్టుదల ఫలించి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ సభ్యుడయ్యారు. అందుకే ఢిల్లీలో కిరణ్ రెడ్డి బీజేపీలో చేరిక సమయంలో కూడా విష్ణువర్ధన్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు.

Related Posts