YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

విశాఖ కేంద్రంగా బీఆర్ఎస్ రాజకీయం

విశాఖ కేంద్రంగా బీఆర్ఎస్ రాజకీయం

విశాఖపట్టణం,  ఏప్రిల్ 11, 
జాతీయ పార్టీగా మారిన బీఆర్‌ఎస్‌... ఏపీలో విస్తృతంగా దూసుకెళ్లాలని చూస్తోంది. పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ ఆదేశాల మేరకు ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ తోట చంద్రశేఖర్ విశాఖలో మకాం వేశారు. ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలను ముఖ్యంగా వివిధ పార్టీల్లో ఉంటూ అసంతృప్తికి లోనైన వారిని తమ పార్టీలోకి ఆహ్వానించే పనిలో పడ్డారాయన. ముఖ్యంగా ఉత్తరాంధ్ర నేతలపై దృష్టి పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. ప్రస్తుతం BRS పార్టీ వైఖరి చూస్తుంటే విశాఖనే తమ పార్టీ కార్యకలాపాలకు కేంద్రంగా మార్చుకునే ఉద్దేశ్యంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఆ పార్టీ ఏపీలో తమ తొలి కార్యక్రమంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ రద్దు ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులకు బాసటగా నిలించారు. వైజాగ్‌లోని ఆర్కే బీచ్ నుంచి ర్యాలీగా వెళ్లి మరీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు,ఉద్యోగులు చేస్తున్న ఉద్యమానికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్ర శేఖర్ సంఘీభావం ప్రకటించారు. కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ తమ మద్దతు పూర్తిగా కార్మికులకు ఉంటుందని... స్టీల్‌ప్లాంట్‌ను కాపాడకుంటామన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ రద్దు ఉద్యమానికి తమ మద్దతు తెలిపారు. విశాఖ పొట్టను ప్రధాని, ఆదానియే కొడుతున్నారని విమర్శలు చేశారు. దీన్ని ఇలానే వదిలేస్తే రేపు తెలంగాణ లోని సంస్థలను కూడా కేంద్రం ప్రవేటు పరం చేస్తుందని ఆయన అన్నారు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే స్టీల్‌ ప్లాంట్ ఉద్యాన్ని కేంద్రంగా చేసుకొని ఆంధ్రప్రదేశ్‌లో పాగా వేయాలనేది బీఆర్‌ఎస్‌ మాస్టర్‌ ప్లాన్‌గా తెలుస్తుంది. దీనిపై ప్రజల్లో కూడా విస్తృతంగా చర్చ నడుస్తోంది. ఉద్యమ నేపథ్యంలో ఉన్న బీఆర్‌ఎస్ పార్టీ ఒకవేళ స్టీల్‌ప్లాంట్‌ ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచన చాలా మందిలో ఉంది. దీన్ని బేస్‌గా చేసుకొని వివిధ పార్టీల్లో ఉన్న అసంతృప్త నేతలపై ఫోకస్ పెట్టింది బీఆర్‌ఎస్‌. ఉత్తరాంధ్రలో అధికార, విపక్షాలకు చెందిన అసంతృప్తి నేతలను BRS లోకి ఆహ్వానించే పనిలో ఉంది ఆ  పార్టీ అగ్రనాయకత్వం. ముందుగా అలాంటి వాని గుర్తించి ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌ మాట్లాడతారు. వాళ్లు ఓకే అంటే నేరుగా పార్టీ అధినాయత్వం రంగంలోకి దిగనుంది. ఇందులో భాగంగా ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన ఒకరిద్దరు కీలక నేతలతో మంతనాలు సాగించినట్టు తెలుస్తోంది. వైసిపీ , టీడీపీ బలంగా ఉన్న రాయలసీమ, కోస్తా ప్రాంతాల కన్నా ఉత్తరాంధ్రపై ఫోకస్ చేస్తేనే పని ఈజీగా అవుతుందని అధినాయకత్వం నుంచి డైరెక్షన్ వచ్చినట్టు బీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్‌ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఎక్కువ మంది ఉండటం కూడా ఆ పార్టీకి కలిసి వచ్చే అంశంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఉత్తరాంధ్రతోపాటే గోదావరి జిల్లాల నుంచి కూడా నేతలను తమ పార్టీ వైపు ఆకర్షించే పనిలో పడింది బీఆర్‌ఎస్‌. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్ర శేఖర్ ఆదివారం రాజమండ్రిలో పర్యటించారు. ముఖ్యంగా తన సొంత సామాజిక వర్గానికి చెందిన కాపులను గోదావరి జిల్లాల్లో పార్టీని ఆదరించేలా ఆకట్టుకోవాలని భావిస్తున్నారు. చాలా మంది బీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారని త్వరలోనే వాళ్లంతా క్యూ కడతారని చెబుతున్నారు. అదే ధీమాతో తమ పార్టీ రానున్న ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీ చెయ్యడం ఖాయమంటున్నారు తోట చంద్ర శేఖర్.

Related Posts