- రజనీకాంత్ రాజకీయాలపై కమల్ సంచలన వ్యాఖ్యలు..
- ఎంజీఆర్ సినిమా పేరుతో..
రాజకీయాల్లోకి రావడం వెనుక రజనీకాంత్ ది తనది ఒకటే లక్ష్యమని బహుబాష నటుడు, దర్శక నిర్మాత కమల్ హాసన్ చెప్పారు. చెన్నైలో మీడియాతో మాట్లాడిన కమల్ హాసన్ తమిళనాడు రాష్ట్రంలో అవినీతిని అంతం చెయ్యడానికే తాను పార్టీ పెడుతున్నానని చెప్పారు. అదే ధ్యేయంతో సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నారని కమల్ హాసన్ వివరించారు.
ఆధ్యాత్మికతో కూడిన రాజకీయపార్టీతో రజనీకాంత్ ప్రజల్లోకి వస్తున్నారని కమల్ హాసన్ వివరించారు. తనకు రజనీకాంత్ పోటీ కాదని, రజనీకాంత్ కు తాను పోటీ కాదని, ఇద్దరూ అవనినీతిని నిర్మూలించడానికే రాజకీయాల్లోకి వస్తున్నామని కమల్ హాసన్ వివరించారు.
తాను భిన్నమైన ధోరణితో రాజకీయాల్లోకి వస్తున్నానని, అవినీతి నిర్మూలన అనే లక్ష్యంలో రజనీకాంత్, తనకు ఏమాత్రం తేడా లేదని కమల్ హాసన్ అన్నారు. ఫిబ్రవరి 21వ తేదీ నుంచి చేపట్టబోతున్న రాష్ట్రవ్యాప్త పర్యటనకు నాళై నమదే (రేపు మనదే) అని నామకరణం చేశామని కమల్ హాసన్ చెప్పారు.
గతంలో ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) నటించిన చిత్రం నాళై నమదు (రేపు మనదే) పేరును తన పర్యటనకు పెట్టుకోవడంలో ఎలాం టి తప్పులేదని తాను భావిస్తున్నానని కమల్ హాసన్ అన్నారు. నాళై నమదు (రేపు మనదే) సినిమా విడుదల తరువాతే ఎంజీఆర్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఇప్పుడు ఎంజీఆర్ సినిమా పేరుతో పర్యటన చేస్తున్న కమల్ హాసన్ ఆయన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
ఫిబ్రవరి నెలలో పార్టీ పేరు..
తన పార్టీపేరు, చిహ్నాన్ని ఫిబ్రవరి నెలలో ప్రకటిస్తానని కమల్ హాసన్ అన్నారు. లక్ష్యసాధనలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా రాజకీయాల్లో వెనకడుగువేసే ప్రసక్తేలేదని కమల్ హాసన్ చెప్పారు. తన అభిమానులు, ప్రజలు తప్పకుండా నన్ను ఆశీర్వదిస్తారనే నమ్మకం ఉందని కమల్ హాసన్ ధీమా వ్యక్తం చేశారు.