హైదరాబాద్, ఏప్రిల్ 13,
రాజకీయాల్లో కొన్ని బహిరంగస్నేహాలు ఉంటాయి. అంతర్గత స్నేహాలూ ఉంటాయి. అయితే రాజకీయ స్నేహాలన్నీ పరస్పర ప్రయోజనాలను బట్టే ఉంటాయి. అలా గత ఆరేడేళ్ల నుంచి తెలంగాణ నుంచి బీఆర్ఎస్, ఏపీ నుంచి వైఎస్ఆర్‌సీపీ మధ్య స్నేహం ఉంది. ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత కూడా ఆ స్నేహం కొనసాగుతోంది. అసలు ట్విస్ట్ ఏమిటంటే ప్రభుత్వాలకు సంబంధించిన అధికారిక అంశాలపై వివాదాలు వస్తే.. సంబంధిత వ్యవస్థలను ఆశ్రయిస్తారు కానీ ఈ రెండు పార్టీలు ఎప్పుడూ రాజకీయంగా దూషించుకోలేదు.. పోటీ పడలేదు. అలా సత్సంబంధాలు నిర్వహిస్తున్న సమయంలో అప్పుడప్పుడూ రెండు పార్టీల మధ్య రాజకీయ అంశాల్లో దుమారం రేగుతూ ఉంటుంది. ఓ సారి కేటీఆర్ ఏపీ నరకం అయిందని వ్యాఖ్యలు చేసినప్పుడు.. మరోసారి వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టినప్పుడు హరీష్ రావు , ప్రశాంత్ రెడ్డి లాంటి మంత్రులు విమర్శలు చేసినప్పుడు..అలాగే గోదావరి వరదలు వచ్చినప్పుడు పోలవరం గురించి బీఆర్ఎస్ నేతలు స్పందించినప్పుడు వివాదాలొచ్చాయి. కానీ రెండు రోజుల్లో సద్దుమణిగి పోయాయి. మళ్లీ ఇప్పుడు హరీష్ రావు చేసిన వ్యాఖ్యలతో మళ్లీ దుమారం ప్రారంభమయింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై అవిశ్రాంతంగా పోరాడుతున్న కేసీఆర్.. విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్ లో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. అటు బీజేపీని ఇరుకున పెట్టడంతో పాటు ఏపీలోనూ అడుగు పెట్టినట్లవుతుందని వ్యూహం సిద్ధం చేసుకున్నారు. అయితే ఇది వైఎస్ఆర్‌సీపీకి ఇబ్బందికరం అవుతుందని ఆలోచించలేదు. అధికార పార్టీ వైసిపికి మింగుడు పడటం లేదు. స్టీల్ ప్లాంట్ చుట్టూ ఎపి రాజకీయాలు మొత్తం నడుస్తున్నాయి. సింగరేణి బృందం విశాఖ స్టీల్ ప్లాంట్ లో అడుగుపెట్టిన వెంటనే వైసిపి స్వరాన్ని మరింత పెంచింది.. విశాఖ జిల్లాకు చెందిన మంత్రి గుడివాడ అమర్నాథ్ బిఆర్ ఎస్ నిర్ణయాన్ని తప్పుపట్టారు. స్టిల్ ప్లాంట్ బిడ్ లో పాల్గొనడం అంటే ప్రైవేటీకరణకు బిఆర్ ఎస్ జై కొట్టడమే నంటూ ఆ పార్టీని విమర్శించారు.. తాము మాత్రం విశాఖ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తామని తేల్చి చెప్పారు..
స్టీల్ ప్లాంట్ విషయంలో బీఆర్ఎస్ తమ రాజకీయ లబ్ది కోసం ప్రయత్నిస్తోందని.. తమను ఇబ్బంది పెడుతోందన్న అసహనం వైఎస్ఆర్‌సీపీలో కనిపిస్తూండటంతో పాటు తాజాగా హరీష్ రావు ఏపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యాఖ్యలు చేశారు. ఎపిలో రోడ్లే సరిగా ఉండవన్న తెలంగాణ మంత్రి హారీష్ రావుపై మంత్రులు కారుమూరి, అప్పలరాజు , బొత్స వంటి వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధనిక రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే ఏం చేశారో తెలియదా? అంటూ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో వర్షం వస్తే ఇళ్ల మీద నుంచి నీళ్లు వెళ్తున్నాయి. మీ రాష్ట్రంలో స్కూళ్లు, మా రాష్ట్రంలో స్కూళ్ల తేడా చూసుకో. తెలంగానలో సంక్షేమ పథకాలు.. మా సంక్షేమ పథకాలకు తేడా చూడు. జీడీపీలో మేం దేశంలోనే నంబర్ వన్‌లో ఉన్నాం. ముందు మీ రాష్ట్రం సంగతి చూసుకో. ధనిక రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే ఏం చేశారో తెలియదా? అంటూ హారీష్ కు కౌంటర్ ఇచ్చారు. హరీష్ కూడా కౌంటర్ ఇచ్చారు. మాతో పెట్టుకుంటే మీకే నష్టమని హెచ్చరించారు. వైఎస్ఆర్‌సీపీ, బీఆర్ఎస్ రాజకీయాలపై చాలా మందికి డౌట్ ఉంది. ప్రస్తుతం జరుగుతున్న పరిమామాలు వ్యూహం కావొచ్చునన్న సందేహాలు కూడా ఉన్నాయి. ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీ తమకు మేలు చేస్తుందన్న అభిప్రాయంతో వైఎస్ఆర్‌సీపీ ఉందని చెబుతున్నారు. కాపు సామాజికవర్గం కార్డ్ తో బీఆర్ఎస్ ఏపీలోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ కారణంగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోతాయని రెండు, మూడు శాతం ఓట్లు చీలినా ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లుగా చెబుతున్నారు. అందుకే ఈ రెండు పార్టీలు తెర వెనుక మాట్లాడుకుని తెర ముందు రాజకీయ విమర్శలు చేస్తున్నారన్న్ విశ్లేషణలు కూడా ఉన్నాయి. రాజకీయాల్లో ఏది వ్యూహమో.. ఏది ఆవేశంతో చేస్తున్నారో అంచనా వేయడం కష్టం. కానీ రాజకీయాల్లో ఆవేశం చూపిస్తే నేతలు ఎక్కువ కాలం ఉండలేరు. ఏం చేసినా పకడ్బందీగా ఆలోచించి .. ఆవేశమో.. మరొకటో చూపించే నేతలే ఎక్కువ కాలం రాజకీయాల్లో ఉంటారు. అందుకే.. ఇప్పుడు ఈ రెండు పార్టీలు చేస్తున్న రాజకీయాలు పరస్పర ప్రయోజనకరంగానే ఉంటాయని ఎక్కువ మంది నమ్ముతున్నారు. ఏం జరగబోతోందో ముందు ముందు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.