తిరుపతి, ఏప్రిల్ 14,
తిరుపతి గంగమ్మ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించింది వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం.. తిరుపతి శ్రీతాతయ్యగుంట గంగమ్మ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకుంది.. ఇక నుంచి గంగమ్మ జాతరను అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.. గత ఏడాది ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు గంగమ్మ ఆలయాన్ని సందర్శించి.. అమ్మవారిని దర్శించుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఈ సందర్భంగా గంగమ్మ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించాలని కోరారు ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి.. ఇక, ఇప్పుడు దీనిపై నిర్ణయం తీసుకున్న సర్కార్.. గంగమ్మ జాతరను రాష్ట్ర పండుగగా పేర్కొంది.. సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో గంగమ్మ జాతర అత్యంత వైభవం జరుపనున్నట్లు ప్రకటించారు ఎమ్మెల్యే భూమన.
తిరుపతిలో వారం రోజులపాటు శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర నిర్వహిస్తుంటారు.. ఈ గంగమ్మ జాతరను వారం రోజులు వివిధ రకాల వేషదారణలను ధరించి అమ్మవారిని దర్శించుకుంటారు భక్తులు… ఈ జాతర జరిగినన్ని రోజులు అమ్మ వారిని తిట్లు తిడుతుంటారు అదేంటని ఇక్కడి ప్రజలను అడిగితే అమ్మ వారికి అలా తిట్టడం అంటెనే ఇష్టమని చెబుతుంటారు. అలా వారం రోజులు రోజు ఒక్కో వేషం వేస్తూ అమ్మ వారిని కొలవడం అనవాయితీ. ఈ వారం రోజులు తలపై వేయికళ్ల దుత్తలు పెట్టుకుని, శరీరానికి వేపాకును వస్త్రాలుగా ధరించి అడు గడుగునా పోర్లు దండాలు పెడుతూ, చిత్ర విచిత్ర వేషధారణలతో, డప్పుల దరువులతో, పంబాల వాయిద్యాలతో, సప్తసరాల నృత్యాల నడుమ అద్యంతం వైభవంగా తిరుపతి గంగమ్మ వారిని దర్శించుకుంటారు భక్తులు. అలా చేస్తే కొలిచిన వారికి కొలిచినన్ని వరాలనిస్తుందని భక్తుల నమ్మకం.. ఇక, అమ్మ వారిని వరాల తల్లి గంగమ్మ అని, విశ్వరూప మాత అని కొలుస్తుంటారు భక్తులు..ఇక, గంగమ్మ జాతరను తెలంగాణ రాష్ట్ర పండుగగా చెప్పుకునే బోనాలు, బతుకమ్మ, సమ్మక్క సారలమ్మ జాతరలతో పోలుస్తుంటారు.. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా గంగమ్మ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించింది.. వారం రోజుల పాటు జరిగే జాతరలో నాలుగో రోజున గంగమ్మ అన్నయ్య అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వద్ద నుండి గంగమ్మకు సారె తిసుకురావడం అనవాయితీగా వస్తుంది. జాతర నాలుగో రోజున శ్రీవారి ప్రతినిధులుగా అధికారులు, అర్చకులు కలిసి పసుపుకుంకుమ శేషవస్త్ర్రాలు గంప, చేట తదితర మంగళద్రవ్యాలను మేళతాళాలతో తీసుకొచ్చి పుట్టింటి సారెగా అందజేస్తారు. పూర్వం తిరుమల వచ్చే భక్తులు ముందుగా గంగమ్మను పూజించిన తర్వాతే స్వామివారి దర్శనానికి వెళ్లేవారట. ఇప్పటికీ అదే తరహాలో గంగమ్మ తల్లిని దర్శించుకున్నాకే శ్రీవారి దర్శనం చేసుకునే భక్తులు కూడా ఉన్నారు..ఈ జాతరకు ఎందుకంత ప్రాధాన్యత? అసలు గంగమ్మ ఎవరు? ఆమెకు భక్తులు ఎందుకు కొలుస్తారనే విషయాల్లోకి వెళ్తే.. రాజుల కాలంలో పాలెగాళ్లు తిరుపతిని పరిపాలించే వారు. ఆ రోజుల్లో ఒక పాలెగాడు తన రాజ్యంపై అధిక పెత్తనం చెలాయించే వాడు. ప్రజలు రాజు మాట జవధాటకుండా భయాందోళనకు గురిచేసేవాడు.. అంతేకాదు.. ఆ ప్రాంతంలోని అందమైన యువతులను చెరపట్టేవాడు.. ఎవరైనా పెళ్లి చేసుకున్నారంటే.. ఆ నవ వధువును ముందుగా పాలెగాడి దగ్గరకి పంపాల్సిందే.. వాడు అనుభవించాకే.. పెళ్లి చేసుకున్న వరుడు అనుభవించాలనే ఆంక్షలు విధించాడు.. ఆ సమయంలో స్త్రీ జాతిని రక్షించేందుకు జగన్మాత తిరుపతికి 2 కిలోమీటర్ల దూరంలోని అవిలాల గ్రామంలో కైకాల కులంలో గంగమ్మగా జన్మించిందని భావిస్తారు.. ఇక, యుక్తవయసుకొచ్చిన గంగమ్మపై యథావిధిగా పాలెగాడి కన్నుపడి ఆమెను బలాత్కరించబోయాడట. దీంతో గంగమ్మ తన విశ్వరూపాన్ని ప్రదర్శించిందట. తనను అంతమొందించేందుకు అవతరించిన పరాశక్తే గంగమ్మ అని తెలుసుకున్న పాలెగాడు పరుగులుపెట్టాడు.. దాక్కున్నాడు.. అలా దాక్కున్న పాలెగడిని భయటకు రప్పించేందుకు గంగమ్మ తల్లి వేరువేరు వేషాలను దరించిదట. అలా గంగమ్మ అనేక వేషాలు ధరించి మూడు రోజులపాటు పాలెగాడి కోసం గాలిచింది.. అయినా పాలెగాడు దొరకకపోవడంతో నాలుగోరోజు గంగమ్మ దొరవేషం వేయడంతో.. తన ప్రభువైన దొర వచ్చాడనుకుని పాలెగాడు బయటకు రాగానే.. వాడి తల నరికి సంహరించిందని.. ఈ దుష్టశిక్షణను తలచుకుంటూ ఆ తల్లి తమను చల్లగా కాపాడాలని కోరుకుంటూ ఏటా ప్రజలు ఈ జాతర వైభవంగా జరుపుకోవడం అనవాయితిగా వస్తుంది