అనంతపురం, ఏప్రిల్ 13,
వ్యవసాయంలో కాలక్రమేణా విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. ఒకప్పుడు రైతులు తమ పొలాల్లోనే నారు పోసుకునేవారు. అనంతరం మొక్క నాటుకుని సాగు చేసేవారు. ఈ క్రమంలో ఒక్కోసారి నాసిరకం విత్తనాలు విత్తడం, నారు పెంపకంలో చిన్న చిన్న పొరబాట్లు, సక్రమంగా యాజమాన్య పద్ధతులు పాటించకపపోవడం కారణంగా పంట నష్టపోయేవారు.ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. ఇబ్బడిముబ్బడిగా నర్సరీలు పుట్టుకొచ్చాయి. రైతులు తమకు కావాల్సిన పంటకు సంబంధించి మొక్కలను నేరుగా నర్సరీల్లోనే కొనుగోలు చేసుకుంటున్నారు. ఈ విధానం ముందుగా పువ్వులు, పండ్లు, కూరగాయల పంటల్లో ప్రారంభమైంది. మలిదశలో వరి, చెరుకు తదితర పంటలకు కూడా వ్యాప్తి చెందింది. ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో భాగంగా నర్సరీలు ప్రారంభమయ్యాయి. కార్పొరేట్ కంపెనీలు సైతం తమ విత్తన వ్యాపారం అభివృద్ధి చేసుకునేందుకు నర్సరీలకు శ్రీకారం చుట్టాయి. ప్రస్తుతం దాదాపు అన్ని పంటలకు సంబంధించిన మొక్కలను నర్సరీల్లో పెంచుతున్నారు. వరి, చెరుకు, టమాట, వంగ, బీర ,కాకర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, మామిడి, సపోటా, నిమ్మ, చీనీ, జామ, దానిమ్మతోపాటు అన్ని రకాల పువ్వుల మొక్కలను కూడా ఉత్పత్తి చేస్తున్నారు.ఈ క్రమంలో ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటించే నర్సరీలు విజయవంతంగా నడుస్తున్నాయి. ఒక్కోసారి ఈ నర్సరీలు సరఫరా చేసే మొక్కలు నాణ్యంగా లేకంటే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకే ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. నర్సరీ యజమాన్యాలు బాధ్యతాయుతంగా మొక్కలను పెంచాలని ఆదేశాలు జారీ చేసింది. నాణ్యమైన విత్తనాలను సేకరించడం, వాటిని విత్తటం, మొలకెత్తించటం, మొక్కలను పొలంలో నాటే వరకు నిరంతరం పరిశీలించాలని స్పష్టం చేసింది. అన్నదాత నాసిరకం నారు కారణంగా నష్టపోకూడదని ఉద్యానశాఖ ఆధ్వర్యంలో కట్టుదిట్టంగా నిఘా పెట్టింది. ఉద్యానవన చట్టం– 2010 ప్రకారం నర్సరీలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఆదేశించింది. ఈ ప్రక్రియను జిల్లా ఉద్యానవన శాఖ అధికారి, డైరెక్టర్ ఆఫ్ హార్టీకల్చర్ విభాగం పర్యవేక్షిస్తోంది. నర్సరీ ఏర్పాటు చేసిన ప్రదేశం, దానికి సంబంధించిన లేఅవుట్ మ్యాప్, భూమి స్థితిగతులు, భూసార పరీక్షల రిపోర్టు డిజిటల్ ఫొటోలతో పాటు యజమాని ఆధార్ కార్డు వివరాలను పొందుపరుస్తూ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అలాగే రైతులు ఏమాత్రం నష్టపోకుండా చూసే బాధ్యతను సైతం నర్సరీల యాజమాన్యంపైనే ఉంచుతున్నారు.
నర్సరీల్లో మొక్కల సంరక్షణ పద్ధతులను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోంది.విత్తనాల కొనుగోలు నుంచిమొక్కలను రైతులకు అప్పగించే వరకు సమగ్ర సమాచారాన్ని సేకరిస్తోంది. ఒకవేళ రైతు నష్టపోతే నర్సరీల యాజమాన్యాలు, విత్తనాలు సరఫరా చేసిన కంపెనీలే బాధ్యత వహించేలా సర్కారు చర్యలు చేపట్టింది. నర్సరీ రంగంలో దాదాపు 20 ఏళ్లుగా ఉన్నా. మరోవైపు వ్యవసాయం చేస్తున్నా. సాగుకు చేసిన సేవలకు గుర్తింపుగా డాక్టర్ వైఎస్సార్ లైఫ్ అచీవ్‌మెంట్ అవార్డు వచ్చింది. ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల మేరకు నాణ్యమైన మొక్కలను సరఫరా చేస్తున్నాం. ఈ విధానం ద్వారా నర్సరీ యాజమాన్యాలు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాయి. వ్యవసాయంలో నష్టపోకుండా ఉండాలంటే ముందు నాణ్యమైన మొక్కలను నాటుకోవాలి. రూ.లక్షలు వెచ్చించే రైతు విషయంలో నర్సరీలవారిపై ప్రభుత్వం బాధ్యత పెట్టడం మంచి నిర్ణయం. దీంతో రైతులకు న్యాయం జరుగుతుంది.