YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

హూ కిల్డ్ బాబాయ్...

హూ కిల్డ్ బాబాయ్...

కడప, ఏప్రిల్ 14, 
వివేకా హత్య కేసు..ఎన్ని ట్విస్టులు, ఎన్ని మలుపులు.. ఇవన్నీ కూడా హత్య కేసు ఎప్పటికీ తేలకూడదన్న ఉద్దేశంతో ఒక ప్రణాళిక ప్రకారం రచించిన వ్యూహంలో భాగమేనన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమౌతున్నాయి. ఒక నేరం ఎప్పటికీ రుజువు కాకుండా చేయడం ఎలా అంటే వైఎస్ వివేకా హత్య కేసులో ఇప్పటికీ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు న్యాయస్థానాలను ఉపయోగించుకుంటున్న తీరును ఉదాహరణగా చూపవచ్చు.  వంద మంది నేరస్థులు తప్పించుకున్నా ఫరవాలేదు ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అంటారు. అయితే ఆ మాటకు అర్ధం మాత్రం నేరస్థులెవరైనా తప్పించుకు పోవచ్చు అని మాత్రం కాదు.  అయితే ఈ నాలుగేళ్ల కాలంలో వైఎస్ వివేకా హత్యకు మోటివ్ ఎమిటి? లబ్ధి పొందింది ఎవరు? వెనుక ఉన్న రాజకీయం ఏమిటి? అన్నది దాదాపుగా జనానికి అవగతమైపోయింది. నాలుగేళ్లనాడు వివేకా హత్య జరిగిన మరుక్షణం ఆయన గుండెపోటుతో మరణించారంటూ.. అప్పటి విపక్ష నాయకులు ఊరూవాడా ఏకమయ్యేలా ప్రచారం చేశారు. అలా ప్రచారం చేస్తున్న గంటల వ్యవధిలోనే వివేకా మరణానికి గుండెపోటు కారణం కాదు గొడ్డలి పోటన్నది వెల్లడైంది. అంటే గుండెపోటు ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టేసి.. అప్పటి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, ఆయన కుమారుడిపై ఆరోపణలు గుప్పించారు. నారాసుర రక్త చరిత్ర అంటూ గగ్గోలు పెట్టారు.మొత్తం మీద అప్పటి ఎన్నికలలో ఈ ప్రచారం ప్లస్ అయ్యింది.  2019 ఎన్నికలలో వైసీపీ విజయం సాధించి రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టింది. అప్పటి వరకూ సొంత బాబాయ్ ను అత్యంత దారుణంగా, కిరాతకంగా హత్య చేశారు. ఈ హత్య కేసు విచారణ రాష్ట్ర పోలీసులతో కాదు, సీబీఐతో చేయించాలని డిమాండ్ చేసిన వారు.. అధికారం చేపట్టగానే సీబీఐ విచారణ అవసరం లేదంటూ ప్లేటు ఫిరాయించారు.  జగన్ సీఎం అయిన తరువాత వివేకా హత్య కేసు దర్యాప్తు వేగం పుంజుకుంటుందని అంతా భావించారు. అయితే అందుకు భిన్నంగా కేసు దర్యాప్తు సాగింది.దీనితో తన తండ్రి హంతకులు ఎవరన్నది తేలాల్సిందే అంటూ వివేకా కుమార్తె సునీత్ న్యాయస్థానాలను ఆశ్రయించి సీబీఐ దర్యాప్తును సాధించుకున్నారు. దీంతో వివేకా హత్య కేసు దర్యాప్తు సవ్యంగా సాగడం ఆరంభమైంది. అంతే వెంటనే గతంలో తాము చేసిన నారాసుర రక్త చరిత్ర ఆరోపణలను పూర్తిగా మరిచిపోయిన వైసీపీ అగ్రనాయకత్వం ఆరోపణాస్త్రాలను వివేకా అల్లుడు అంటు కుమార్తె డాక్టర్ సునీత భర్తపై ఎక్కు పెట్టారు. అలాగే కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. బెదరించారు. కేసులు పెట్టారు. దీంతో ఏపీలో అయితే కేసు దర్యాప్తు సవ్యంగా జరగదని భావించిన డాక్టర్ సునీత మరోమారు సుప్రీంను ఆశ్రయించి కేసు దర్యాప్తును పొరుగు రాష్ట్రానికి బదలాయించేలా  ఉత్తర్వలు సాధించారు. అంతే వెంటనే  వైఎస్ వివేకా రెండో పెళ్లి అంటూ మరో ప్రచారం తెరపైకి తెచ్చారు. కేసు తెలంగాణకు మారిన తరువాత దర్యాప్తు వేగం పుంజుకుంది. తీగ లాగి డొంక వద్దకు వచ్చేసింది.  వివేకా హత్య కేసులో సూత్రధారులు, పాత్ర ధారులు ఎవరన్నది ఇహనో ఇప్పుడో వెల్లడి కావడం ఖాయమన్న భావన అందరిలోనూ నెలకొంది.   ఆ దశలో అప్పటి వరకూ కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న రాం సింగ్ ను తొలగించారు. దీని వెనుక ముఖ్యమంత్రి జగన్ హస్తిన పర్యటన మర్మం ఏదో ఉందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. సరే అదలా ఉంటే ఇప్పుడు తాజాగా వివేకా క్యారక్టర్ ను అశాసినేట్ చేసేలా మరో కథనం బయటకు వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సునీల్ యాదవ్ తల్లిని వివేకా లైంగిక వేధింపులకు గురి చేయడంతో ఆగ్రహించి సునీల్ యాదవే వివేకాను గొడ్డలి పోటుతో హత్య చేశారని మరో కథనాన్ని బయటకు తెచ్చారు.నారాసుర రక్త చరిత్ర, వివేకా రెండో పెళ్లి, ఆస్తి కోసం అల్లుడే ఈ హత్య చేశాడు వంటి వన్నీ వెనక్కు నెట్టి ఇప్పుడు వివేకా లైంగిక వేథింపుల కారణంగానే హత్యకు గురయ్యాడంటే కొత్త వాదనను తెరమీదకు తెచ్చారు.  ముందు ముందు మరెన్ని వాదనలు తెరమీదకు వస్తాయో అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అసలింతకీ హుకిల్డ్ బాబాయ్ అన్న ప్రశ్నకు ఎప్పటికైనా సమాధానం దొరుకుతుందా అంటే ఏమీ చెప్పలేని పరిస్థితి. అసలు వివేకా హత్య కేసులో సూత్రధారులు, పాత్రధారుల గుట్టు బయటకు వస్తుందా? అంటే ఏమో అన్న సమాధానమే వస్తోంది.

Related Posts