హైదరాబాద్, ఏప్రిల్ 15,
జనసేనాని పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుకు .. జనసేనలో కీలక పదవి అప్పగించారు. ఇప్పటి వరకూ ఆయన రాజకీయ వ్యవహారాల కమిటీలో సభ్యుడు మాత్రమే. ఇప్పుడు ప్రధాన కార్యదర్శి పదవిని ఇచ్చారు. దీంతో ఆయన పాత్ర జనసేన పార్టీలో పెరగనుంది. ఓ రకంగా ఇక నుంచి ఆయన నెంబర్ టు గా ఉంటారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ప్రధాన కార్యదర్శి అంటే ఏ పార్టీలో అయినా కీలకం. పార్టీ వ్యవహారాలన్నీ చక్కదిద్దేది ప్రధాన కార్యదర్శే. అధ్యక్షుడు అన్ని విషయాలూ పట్టించుకోలేరు. రోజు వారీ వ్యవహారాలను అసలుచూసుకోలేరు. అందుకే ప్రధాన కార్యదర్శి పదవి కీలకం. జనసేనానికి ప్రస్తుతం కొన్ని సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెట్టలేని పరిస్థితి ఉంది. ఎన్నికలకు ముందు వీటన్నింటినీ కంప్లీట్ చేసి రాజకీయ యాత్రలు ప్రారంభించాలన్న ఉద్దేశంలో ఉన్నారు. మరో వైపు ఇప్పుడు పార్టీలో నెంబర్ 2గా నాదెండ్ల మనోహర్ ఉన్నారు. ఆయన ఒక్కరే కొంత కాలంగా పార్టీ వ్యవహారాలన్నీ చూసుకుంటున్నారు. జిల్లాల్లో పర్యటిస్తున్నారు. అయితే నాదెండ్ల మనోహర్.. రోజువారీ పార్టీ వ్యవహారాలు చూసుకుని… నాగబాబు జిల్లాల్లో పర్యటిస్తే మంచి హై వస్తుందని జనసైనికులు భావిస్తూ ఉంటారు. పవన్ కూడా అదే అనుకున్నారేమో కానీ కీలక పదవి ఇచ్చారు. నాగబాబుకు రాజకీయంగా పర్యటనలు చేయడంలో చాలా అనుభవం ఉంది.రోవైపు వచ్చే ఎన్నికల కోసం పవన్ సిద్ధమవుతున్నారు. మొన్నటివరకు టీడీపీతో పొత్తు ఉంటుందన్న చర్చ గట్టిగా నడిచింది. చాలా ఏళ్లుగా బీజేపీతో మెత్రి కొనసాగిస్తూ వస్తున్న పవన్... వచ్చే ఎన్నికల్లో కలిసి పని చేసే అవకాశం లేదన్న వాదన కూడా ఉంది. ఇక ఇప్పటికే ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత.... టీడీపీ ఫామ్ లోకి వచ్చేసింది. అధికార వైసీపీని ఢీకొట్టేలా దూకుడుగా ముందుకెళ్తోంది. అవసరమైతే ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లే ఆలోచన కూడా చేస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్... యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇక అధికార వైసీపీ సైతం జగనన్నే మా భవిష్యత్తు అంటే మెగా పీపుల్స్ సర్వే చేపడుతోంది. మొత్తంగా ప్రధాన పార్టీలన్నీ లైన్ లోకి వస్తున్న వేళ… ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇక వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు వారాహి వాహనాన్ని కూడా సిద్ధం చేసుకున్నారు పవన్ కల్యాణ్. ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటుకు ముందే ఆయన అభిమానులతో సమావేశాలు నిర్వహించి పార్టీ ఏర్పాటు దిశగా వారిని సిద్ధం చేశారు. జనసేన విషయంలోనూ ఆయన యాక్టివ్ గా ఉంటున్నారు. విమర్శించేవారు ఎప్పుడూ విమర్శిస్తూనే ఉంటారు కానీ ఎలాంటి పరిస్థితుల్లోనూ పార్టీకి మేలు చేసేందుకు ప్రయత్నించే నేతల్లో నాగబాబు కంటే ఎవరూ ముందు ఉండరని.. ఆయనకు కీలక బాధ్యతలు ఇవ్వడం మంచి నిర్ణయమని జనసైనికులు సంతోషపడుతున్నారు.