YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జగన్ కు సింపతి కోసమే దాడి...

జగన్ కు సింపతి కోసమే దాడి...

విజయవాడ, ఏప్రిల్ 15, 
వైసీపీ అధినేత జగన్ పై కోడికత్తి ఘటనలో కుట్రకోణం లేదని ఎన్ఐఏ(జాతీయ దర్యాప్తు సంస్థ) తేల్చిన సంగతి తెలిసిందే. రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్‍కు కూడా ఘటనతో సంబంధం లేదని స్పష్టం చేసింది. కోర్టులో విచారణ ప్రారంభమైనందున ఇంకా దర్యాప్తు అవసరం లేదని ఎన్ఐఏ కోరింది. జగన్ వేసిన పిటిషన్‍ను కొట్టి వేయాలని ఎన్ఐఏ కోరింది. ఈ మేరకు కోడికత్తి కేసులో గురువారం కౌంటర్ దాఖలు చేసింది. అయితే ఎన్ఐఏ వాదనలపై తమకు సమయం కావాలని జగన్ తరపు న్యాయవాదులు కోరారు. ఇరవైపు వాదనలు విన్న న్యాయస్థానం... కోడికత్తి కేసు తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.ఇదే సమయంలో ఈ కేసులోని ప్రధాన నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావు చెప్పిన విషయాలను ఎన్ఐఏ రికార్డు చేసింది. చార్జ్ షీట్, కౌంటర్ తో పాటు ఈ-స్టేట్‍మెంట్‍ను ఎన్ఐఏ జతచేసింది. ఇందులో శ్రీనివాసరావు కీలక విషయాలను పేర్కొన్నాడు. తాను మొదటి నుంచి వైఎస్సార్ అభిమానిని అని... జగన్ అధికారంలోకి రావాలని కోరుకున్నానని పేర్కొన్నాడు. ప్రజల్లో సానుభూతి కోసం జగన్‍పై అటాక్ చేశానని తెలిపారు " మీడియా ద్వారా జగన్ పై సానుభూతి పెరుగుతుందని భావించా. ప్రమాదం జరగకుండా కోడికత్తిని 2 సార్లు స్టెరిలైజ్ చేయించా. జగన్‍కు టీ ఇచ్చేందుకు వెళ్లి ఈసారి ఎన్నికల్లో 160 సీట్లతో గెలుస్తారని కూడా ఆయనకు చెప్పాను. నా మాటలకు ఆయన చిరునవ్వు చిందించారు. అటాక్ జరిగిన వెంటనే వైసీపీ వారు నాపై దాడి చేశారు. పోలీసులు నన్ను కాపాడి ఓ గదిలో బంధించారు. అనంతరం పోలీస్‍స్టేషన్‍కు తరలించారు. అప్పట్లో ఆంధ్రా పోలీసులు నన్ను భాగా కొట్టారు. ఈ సంఘటన వెనుక ఎవరున్నారని విచారణ చేశారు. నా సొంత ఆలోచనతోనే దాడికి పాల్పడ్డానని చెప్పాను. ఎన్నిసార్లు అడిగినా ఇదే విషయం చెప్పాను. కట్టు కథలు చెప్పాలని పోలీసులు నాపై ఎటువంటి ఒత్తిడి తేలేదు. అందువల్లే జడ్జి దగ్గర నేను పోలీసులపై ఏ ఆరోపణలు చేయలేదు. ఇదే అంశంపై నేను 24 పేజీల పుస్తకం రాశాను. పుస్తకం పూర్తి చేద్దామంటే విశాఖ జైలు సిబ్బంది లాగేసుకున్నారు. ఈ సంఘటన తప్పు అని నాకు తెలుసు. జగన్‍కు అధికారం రావాలనే అభిమానంతో దాడికి పాల్పడ్డాను." అని జనిపల్లి శ్రీనివాసరావు చెప్పినట్లు ఎన్ఐఏ కోర్టులో వేసిన కౌంటర్ పిటిషన్ లో ప్రస్తావించింది.2018లో విశాఖ విమానాశ్రయంలో అప్పటి విపక్ష నేత, సీఎం జగన్‌పై జనిపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి కోడికత్తితో దాడి చేశాడు. అప్పట్లో జగన్ ఉత్తరాంధ్రలో పాదయాత్ర చేస్తున్నారు. సిబిఐ కేసులకు సంబంధించి ప్రతి శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో కోర్టుకు హాజరుకావ్వాల్సి ఉండేది. అందుకే గురువారం మధ్యాహ్నం కల్లా ఆయన పాదాయత్ర ముగించుకుని విశాఖ ఎయిర్ పోర్టు నుంచి హైదరాబాద్ వెళ్లేవారు.జగన్ విశాఖపట్నం ఎయిర్ పోర్టుకు వచ్చిన సమయంలో అక్కడి క్యాంటీన్‌లో పనిచేసే శ్రీను అనే వ్యక్తి వీఐపీ లాంజ్‌లోకి వెళ్లి టీ, కాఫీలు అందించే ఉద్దేశంతో కోడికత్తితో దాడికి పాల్పడ్డాడు. అయితే వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్నారు. చిన్న గాయంతో జగన్ బయటపడ్డారు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత సిటీ న్యూరో ఆస్పత్రిలో చేరి వైద్యం తీసుకున్నారు. వైద్యులు ఆయనకు తొమ్మిది కుట్లేసినట్లుగా ప్రకటించారు. జగన్ విజ్ఞప్తిపై ఈ కేసు దర్యాప్తును ఎన్‌ఐఏకు అప్పగించారు. ఫలితంగా ఈ కేసు విచారణ చేపట్టేందుకు రంగంలోకి దిగింది ఎన్ఐఏ. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పర్సనల్ పీఏ కోర్టుకు హాజరయ్యారు. అడ్వకేట్ కమిషనర్ ద్వారా సాక్ష్యం నమోదుకు సీఎం జగన్ పిటిషన్ వేశారు. ఎన్ఏఐ కోర్టులో సీఎం జగన్ రెండు పిటిషన్లు దాఖలు చేశారు. అలాగే రాష్ట్రానికి సీఎంగా బాధ్యతల నిర్వహణ ఉందని పిటిషన్‍లో వెల్లడించారు. ఎన్ఐఏ తాజా వాదనల నేపథ్యంలో… జగన్ తరపు న్యాయవాదులు ఎలా ముందుకెళ్తరనేది ఆసక్తికరంగా మారింది. 17వ తేదీన కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనేది కూడా చర్చనీయాంశంగా మారింది.

Related Posts