YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కొప్పులకు పొంచి ఉన్న పదవీ గండం...

కొప్పులకు పొంచి ఉన్న పదవీ గండం...

కరీంనగర్, ఏప్రిల్ 14, 
బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్‌. తొలుత మేడారం నుంచి రెండు సార్లు గెలిచిన ఆయన… పునర్విభజనలో ఆ నియోజకవర్గం రద్దు కావడంతో కొత్త గా ఏర్పడ్డ ధర్మపురికి మారి విజయం సాధించారు. గత ఎన్నికల్లో ఆయన గెలుపుపై వివాదం తలెత్తింది… స్వల్ప మెజార్టీతో గట్టెక్కిన మంత్రి మీద ప్రత్యర్థి అడ్లూరి లక్ష్మణ్ హైకోర్టుకు వెళ్లారు.. ప్రస్తుతం విచారణలో ఉన్న ఆ కేసు కొప్పులకు తలనొప్పిగా మారింది… స్ట్రాంగ్ రూం తెరిచి ఎన్నికల డాక్యమెంట్లు, సీసీ పుటేజ్‌ తమ పరిశీలనకు పంపాలని కోర్టు ఆదేశించింది..కానీ, స్ట్రాంగ్ రూం తెరవాలని చూసిన అధికారులకు తాళం చెవి దొరక్కపోవడంతో కొత్త వివాదం తలెత్తింది… ఇది కొప్పుల పనేనంటూ కాంగ్రెస్ నేత అడ్లూరి లక్ష్మణ్ ఆరోపిస్తూ మరోసారి హైకోర్ట్ తలుపు తట్టారు. నాలుగేళ్లుగా నడుస్తున్న ఎన్నికల ఫలితాల కేసులో తాళం చెవి పోవడం ప్రతిపక్షాలకు ఆయుధంగా మారింది…తన నియోజకవర్గ పరిధిలోని వెల్గటూర్ మండంలో క్రిబ్‌కో భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా నిరసనలు సాగుతున్నాయి. ఆ పరిశ్రమ వెదజల్లే కాలుష్యం వల్ల తాము నష్టపోతామని నాలుగు గ్రామాల ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. కలెక్టర్ ఆఫీసు ముందు నిరసనలు, పాదయాత్రలు నిర్వహించారు. మాకు ఇథనాల్ పరిశ్రమ వద్దంటూ గ్రామసభలు నిర్వహించి తీర్మానాలు కూడా చేసాయి పంచాయతీలు. నియోజకవర్గ యవతకు ఉపాధి లభిస్తుందని చెప్పి కొప్పుల ఈశ్వర్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని భూసేకరణ చేయించి, ఫ్యాక్టరీ ఏర్పాటుకు శంకుస్థాపన చేసారు. ఈ ఆందోళనలతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా సాగుతున్న ఆందోళనలకు ప్రతిపక్షాలు మద్దతు ప్రకటించడంతో మరింత ఉధృతం అయ్యాయి… స్వయంగా మంత్రి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా.. వినకుండా ఆయన్ని వెనక్కు పంపారు నాలుగు గ్రామాల ప్రజలు. మంత్రిగా ఉన్న కొప్పులకు తన నియోజకవర్గంలోనే ప్రజల నుంచి తిరుగుబాటు రావడం మింగుడు పడటం లేదట…ఏ చిన్న అవకాశం దొరికినా ఇరుకున పెడుతున్న ప్రతిపక్షాలు ఓ వైపు ఉంటే.. స్వపక్షంలోనే తన వైఖరితో కొందరికి టార్గెట్ అవుతున్నారట కొప్పుల. ఇటీవల జిల్లా కేంద్రంలో నిర్వహించిన పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌పై ఆయన అసహనం వ్యక్త చేశారట… దీన్ని జీర్ణించుకోలేని సంజయ్ అనుచరులు మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సంజయ్‌కి వ్యతిరేకంగా జడ్పీ చైర్మన్‌ని కొప్పుల ప్రోత్సహిస్తున్నారని ద్వితీయ శ్రేణి నేతలు అంటున్నారు… జిల్లాలో అందరిని కలుపుకుపోవాల్సిన మంత్రి ఇలా చేయడంతో నేతలు ఒకింత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారట… మంత్రికి తన స్వంత నియోజకవర్గంలోనూ ద్వితీయ శ్రేణి నేతలతో ముప్పు పొంచి ఉందంటున్నారు.. బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎంపీ వివేక్ ధర్మపురిలో పోటీ చేసేందుకు రంగం సిద్దం చేసుకుంటున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ క్యాడర్‌ను ఎలా కాపాడుకోవాలా అని ఆలోచిస్తున్నారట ఈశ్వర్… కొప్పుల కొంతమంది నేతలనే కోటరీగా చేసుకున్నారని, వారి మాటలే వింటున్నారని స్థానిక సంస్థల ప్రతినిధులు వాపోతున్నారట.ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇంటా బయట పోరుతో కొప్పుల ఎలా నెగ్గుకు వస్తారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది… కోర్టు కేసును ప్రతిపక్షాలు ఆయుధంగా మార్చుకోవడం… ప్రతిష్టాత్మక పరిశ్రమ ఏర్పాటుకు నిరసనలు రావడం… సొంత నియోజకవర్గంలో క్యాడర్‌ అసంతృప్తి… మరోవైపు ఆర్థికంగా, రాజకీయంగా బలంగా ఉన్న ప్రత్యర్థులతో పోరాడాల్సిన పరిస్థితులు… కొప్పులకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టబోతున్నాయన్నది లోకల్‌ టాక్‌.

Related Posts