YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కేజ్రీవాల్ కు సీబీఐ సమన్లను సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ఆగ్రహం

కేజ్రీవాల్ కు సీబీఐ సమన్లను సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ఆగ్రహం

న్యూఢిల్లీ ఏప్రిల్ 15
ఢిల్లీ మద్యం విధానం కేసు లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కు సీబీఐ సమన్లను జారీ చేయడంపై సీనియర్ అడ్వకేట్, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ తీవ్రంగా స్పందించారు. ఈ కేసులో సాక్షిగా ప్రశ్నించేందుకు ఆదివారం ఉదయం హాజరు కావాలని కేజ్రీవాల్‌ను సీబీఐ కోరింది.
జాతీయ మీడియా కథనాల ప్రకారం, సీబీఐ గత ఏడాది ఆగస్టు 17న దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ లో కేజ్రీవాల్‌ను నిందితునిగా పేర్కొనలేదు. ఈ కేసులో కొందరు సాక్షులు, నిందితులను ప్రశ్నించిన తర్వాత ఆయన పేరు వెలుగులోకి వచ్చింది. ఆయన నుంచి వివరణ కోరాలని సీబీఐ కోరుకుంటోంది. కొందరు సాక్షులు, నిందితులు ఢిల్లీ మద్యం విధానం రూపకల్పన, అమలుకు సంబంధించి చెప్పిన విషయాలపై వివరణ కోరేందుకే ఆయనను సీబీఐ పిలిచింది.ఈ నేపథ్యంలో కపిల్ సిబల్ శనివారం ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, కేజ్రీవాల్‌పై సీబీఐ చర్యను తాను ముందుగానే ఊహించానని చెప్పారు. ఆయనకు సీబీఐ సమన్లు జారీ చేయడంపై బీజేపీని ఎండగట్టారు. ప్రతిపక్షాలు లేని భారత దేశాన్ని బీజేపీ కోరుకుంటోందన్నారు. ఆ పార్టీకి ఎదురు నిలిచే నేతల పరువు, ప్రతిష్ఠలను భంగపరిచేందుకు ప్రయత్నిస్తోందన్నారు. కేజ్రీవాల్ రాజకీయంగా ఎదుగుతున్నారని, అందువల్ల ఆయనను సీబీఐ పిలుస్తుందని తాను కొద్ది నెలల క్రితం ఓ వ్యాసంలో రాశానని తెలిపారు. గత ఏడాదిలో కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగపరిచారని ఆరోపించారు. రాజకీయ పార్టీలన్నీ తమ విభేదాలను పక్కనబెట్టి, ఈ అన్యాయంపై ముక్తకంఠంతో మాట్లాడాలని చెప్పారు. ఇది ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమేనని తెలిపారు. ప్రతిపక్ష పార్టీల నేతలందరిపైనా బీజేపీ దాడి చేస్తోందని ఆరోపించారు. ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాలైన జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, కేరళ ముఖ్యమంత్రులను, ఇతర నేతలను ఏ విధంగా బీజేపీ లక్ష్యంగా చేసుకున్నదో మనం చూస్తూనే ఉన్నామన్నారు.ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూల్చడం కోసం రాజ్యాంగంలోని పదో షెడ్యూలు నిబంధనలను బీజేపీ దుర్వినియోగపరుస్తోందన్నారు. ప్రతిపక్ష పార్టీల నేతల పరువును మంటగలిపేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను దుర్వినియోగపరుస్తోందని ఆరోపించారు.
కపిల్ సిబల్ ఇచ్చిన ట్వీట్‌లో, కేజ్రీవాల్‌కు సీబీఐ సమన్లను జారీ చేసిందని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని బీజేపీ అంటుందని, అయితే అణచివేత తన పని తాను చేస్తోందనేది తన అభిప్రాయమని చెప్పారు.
ఖజానాకు భారీ నష్టం
ఢిల్లీ మద్యం విధానం కేసులో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.2,600 కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని సీబీఐ ఆరోపించింది. రూ.100 కోట్ల మేరకు ముడుపులు చేతులు మారినట్లు ఆరోపించింది. ఈ కేసులో ఇప్పటికే సుమారు 11 మంది అరెస్టయి, జైలులో ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా కూడా అరెస్టయి, జైలులో ఉన్నారు. తెలంగాణ ఎమ్మెల్సీ కవితను కూడా ఓ దర్యాప్తు సంస్థ ప్రశ్నించింది.
కేజ్రీవాల్ స్పందన
ఇదిలావుండగా, కేజ్రీవాల్ శనివారం స్పందిస్తూ, అవినీతికి వ్యతిరేకంగా అసెంబ్లీలో మాట్లాడినప్పుడే సీబీఐ సమన్లు పంపుతుందనే విషయం తనకు తెలుసునని చెప్పారు. మద్యం పాలసీ దర్యాప్తునకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థలు కోర్టులో తమపై అబద్ధాలు చెబుతున్నాయని ఆరోపించారు. అరెస్టు చేసిన వ్యక్తులను చిత్రహింసలు పెడుతూ, వారిపై ఒత్తిడి పెంచడం ద్వారా తమను ఇరుకునపెట్టేందుకు చూస్తున్నాయని అన్నారు. మద్యం విదానంలో మనీష్ సిసిడియాపై సీబీఐ తప్పుడు ఆరోపణలు చేసిందని, అబద్ధపు స్టేట్‌మెంట్లు ఇవ్వాలంటూ సాక్షులను చితకబాదుతున్నారని, అవినీతిని నిర్మూలించే గొప్ప విధానం ఇదే కావచ్చునని విమర్శలు గుప్పించారు.

Related Posts