YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వివేకా హత్య కేసు నెక్స్ట్ ఎవరు...

వివేకా హత్య కేసు నెక్స్ట్ ఎవరు...

కడప, ఏప్రిల్ 17, 
వైఎస్ వివేకా హత్యకేసు విచారణలో సీబీఐ అధికారులు  వేగం పెంచారు. ఈ కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కరరెడ్డిని ఆదివారం   పులివెందులలో అరెస్టు చేశారు.  అంతకు ముందు తెల్లవారు జామునే రెండు వాహనాలలో పులివెందులలోని అవినాష్ రెడ్డి నివాసానికి చేరుకున్న సీబీఐ అధికారులు అక్కడ భాస్కరరెడ్డిని విచారించారు. అనంతరం ఆయనను అదుపులోనికి తీసుకుని హైవదరాబాద్ తరలించారు.ఈ కేసులో రెండు రోజుల కిందట అరెస్టైన అవినాష్ రెడ్డి సన్నిహితుడు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి విచారణలో వెల్లడించిన వివరాల ఆధారంగా భాస్కరరెడ్డిని విచారించిన పోలీసులు భాస్కరరెడ్డిని అదుపులోనికి తీసుకున్నారు. భాస్కరరెడ్డి అరెస్టు విషయం  తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో భాస్కరరెడ్డి నివాసానికి చేరుకున్నారు. పటిష్ట బందోబస్తు మధ్య భాస్కరరెడ్డిని సీబీఐ అధికారులు మైదరాబాద్ తరలించారు. వివేకా హత్య కేసులో వరుస అరెస్టులతో సీబీఐ దూకుడు పెంచింది. గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి, ఇప్పుడు భాస్కరరెడ్డి తరువాతి వంతు వైసీపీ ఎంపి అవినాష్ రెడ్డే అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వారి విశ్లేషణలు సరైనవేనని అనిపించే విధంగానే పరిణామాలు సంభవిస్తున్నాయి. పులివెందులలో భాస్కరరెడ్డి అరెస్టు కాగానే.. హైదరాబాద్ లోని వైఎస్ అవినాష్ రెడ్డి నివాసానికి సీబీఐ అధికారులు చేరుకున్నారు. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని ఇప్పటికే నాలుగుసార్లు విచారించిన సీబీఐ, ఇప్పుడు మరోసారి ఆయన నివాసానికి వెళ్లడంతో ఇహనో, ఇప్పుడో ఆయన అరెస్టు కూడా అనివార్యమన్న భావన వ్యక్తమౌతోంది.అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తామని గతంలోనే సీబీఐ హైకోర్టుకు తెలిపింది. ఇప్పుడు అవినాష్ రెడ్డి తండ్రి భాస్కరరెడ్డిని అరెస్టు చేయడం, హైదరాబాద్ లోని అవినాష్ రెడ్డి నివాసానికి సీబీఐ అధికారులు చేరుకోవడం చూస్తుంటే ఆయనను కూడా అదుపులోనికి తీసుకునే అవకాశాలున్నాయని అంటున్నారు. గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో అవినాష్ రెడ్డి పేరు ప్రస్తావించడం, అలాగే వివేకా హత్య కేసులో మరిన్ని అరెస్టులు ఉంటాయని సీబీఐ పేర్కొనడం.. అందుకు తగ్గట్టుగానే ఉదయమే భాస్కరరెడ్డిని పులివెందులలో అదుపులోనికి తీసుకోవడం, అలాగే హైదరాబాద్ లోని అవినాష్ రెడ్డి నివాసానికి సీబీఐ అధికారులు చేరుకోవడం చూస్తుంటే వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని కూడా అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.వరుస అరెస్టుల నేపథ్యంలో వివేకా హత్య కేసు కొలిక్కి వస్తున్నట్లే అనిపిస్తోంది. గజ్జట ఉదయ్ కుమార్ ను అరెస్టు చేసిన  సీబీఐ అతడి రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలను పేర్కొన్న సంగతి తెలిసిందే. వివేకా హత్య జరిగిన నిముషాల వ్యవధిలో ఉదయ్ కుమార్ రెడ్డి, అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డిలు ఘటనాస్థలానికి చేరుకున్నారనీ, సాక్ష్యాలను మాయం చేసి గొడ్డలి పోటును గుండెపోటుగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారనీ రిమాండ్ రిపోర్టులో పేర్కొనడమే కాకుండా అందుకు సంబంధించి గూగుల్ లుకౌట్ ఆధారాలు కూడా సమర్పించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలోనే వివేకా హత్య కేసు తార్కిక ముగింపునకు వస్తోందని న్యాయ నిపుణులు అంటున్నారు.

Related Posts