తిరుపతి, ఏప్రిల్ 17,
అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదనకు అలవాటు పడిన కొందరు కేటుగాళ్లు తిరుమల తిరుపతి దేవస్థానంపై నకిలీ వెబ్ సైట్లను సృష్టించి అమాయకులైన భక్తులను మోసంచేస్తున్నారు. కొంత కాలంగా టీటీడీ ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డికి వస్తున్న ఫిర్యాదులపై అప్రమత్తమైన టీటీడీ నకిలీ వెబ్ సైట్లపై దృష్టి సారించింది. దాదాపు నలభైకు పైగా నకిలీ వెబ్ సైట్లను గుర్తించి వాటిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తిరుమల శ్రీవారి దర్శనానికి దేశ విదేశాల నుంచి నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. క్షణకాలం పాటు జరిగే శ్రీనివాసుడి దివ్య మంగళ దర్శనం కోసం ఎన్ని రోజులైనా నిరీక్షిస్తారు. తిరుమలకు వచ్చే భక్తులకు అనేక రకాలుగా స్వామి వారి దర్శన ఏర్పాట్లు చేస్తుంటుంది టీటీడీ. ఇందులో ముఖ్యంగా సిపార్సు లేఖలు, ఆన్లైన్ బుకింగ్ ద్వారా అంటే టీటీడీ వెబ్ సైట్ ద్వారా నమోదు చేసుకుంటూ ఉంటారు. ఇలా వచ్చే భక్తులు స్వామి వారిని అతిదగ్గరగా చూసే వీఐపీ బ్రేక్ దర్శనం లభిస్తే చాలు.. వారి జన్మ ధన్యం అయినట్లుగా భావిస్తుంటారు. వీటితో పాటుగా స్వామి నిత్య సేవలంటే ఎన్నో జన్మల పుణ్యఫలంగా భావిస్తారు. ఇంతటి డిమాండ్ ఉండే ఆర్జిత సేవల్లో పాల్గొనాలంటే మహద్భాగ్యంగా భావిస్తారు భక్తులు. శ్రీనివాసుడికి నిత్యం నిర్వహించే సేవలను కేవలం ఒక్కటి రెండు సేవలకు మాత్రమే సిపార్సు లేఖలు వర్తిస్తుంది. టీటీడీ ఆన్లైన్ ద్వారా నిర్వహించే లక్కీ డ్రిప్ విధానం ద్వారా సేవా టిక్కెట్లు పొందాల్సి ఉంటుంది. శ్రీనివాసుడి భక్తుల కోసం టీటీడీ అధికారిక వెబ్ సైట్ లో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి, వర్చువల్ ఆర్జిత సేవ, వయోవృద్దులు, అంగప్రదక్షణ, వంటి టిక్కెట్లను tirupatibalaji.ap.gov.in ద్వారా విడుదల చేస్తూ వస్తుంది. శ్రీనివాసుడి దర్శనాలకు భారీ డిమాండ్ ఉండే వాటిపై కన్నేసిన కొందరు కేటుగాళ్లు నకిలీవెబ్ సైట్లు సృష్టించి వాటిలో ఆర్జీత సేవలు బుక్కింగ్ చేసుకోవచ్చు అంటూ నమ్మబలికి అమాయకులైన భక్తులను మోసగిస్తున్నారు. అయితే ఇలాంటి మాయగాళ్ల వలలో పడి ప్రతినిత్యం ఎంతో మంది భక్తులు నిలువు దోపిడికి గురి అవుతున్నారు. రోజూ పదుల సంఖ్యలో భక్తులు మోసపోయి తిరుమలకు వచ్చి తాము మోసపోయాం అంటూ గ్రహించి టీటీడీ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేసి తిరిగి వెళ్తుంటారు. ఎన్నో ఆశలతో తిరుమలకు వచ్చిన వారికి చివరికి వారి ఆశలు అంతా అడియాశలుగా మిగిలిపోతుంటాయి. భక్తుల ఫిర్యాదుపై కేసు నమోదు చేసి తిరిగి వారి నగదు వారికి ఇప్పించడంతో పాటుగా, భక్తులను మోసగించిన కేటుగాళ్లలను చాకచక్యంగా వల పన్ని మరి పట్టుకుని కటకటాల పాలు చేస్తుంటారు విజిలెన్స్, పోలీసులు. ఎప్పటికప్పుడు కొత్త రకం మోసాలతో భక్తులను మోసగించే మాయగాళ్లు నకిలీ వెబ్ సైట్ లను పుట్టగొడుగులు లాగా సృష్టించి సామాన్య భక్తుల నుంచి ధనవంతుల వరకూ ఎంతో ఈజీగా మోసగిస్తున్నారు. కేవలం ఆంధ్ర, తెలంగాణాలోనే కాకుండా, తమిళనాడు,కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, దిల్లీ, ముంబై, కేరళ, వంటి రాష్ట్రాల్లో సైతం కేటుగాళ్లు తమ పంజా విసురుతున్నారు. టీటీడీ నకిలీ వెబ్ సైట్లపై ఉక్కు పదం మోపేందుకు సిద్ధం అయింది. టీటీడీ టికెట్స్ బుకింగ్ అంటే చాలా వెబ్ సైట్లు వివిధ సెర్చ్ ఇంజిన్ లో చూపిస్తున్నాయి. అందులో నిజమైన వెబ్ సైట్ కనుకోవడం చాలా కష్టతరంగా మారిన నేపథ్యంలో దాదాపు 40కు పైగా నకిలీ వెబ్ సైట్లను గుర్తించింది టీటీడీ. టీటీడీ పేరుతో భక్తులును మోసగిస్తున్న 40 వెబ్ సైట్ల ఐపీలపై పోలీసులుకు టీటీడీ ఐటీ జీఎం సందీప్ రెడ్డి ఫిర్యాదు చేశారు. నకిలీ వెబ్ సైట్ నిర్వాహకులు దర్శన టిక్కెట్లు, వసతి గదులు కేటాయింపు, ఉద్యోగాలు కల్పిస్తామంటూ మోసం చేస్తున్నట్లు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి 40 నకిలీ వెబ్ సైట్లపై దర్యాప్తు చేపట్టారు పోలీసులు. భక్తులు కేవలం టీటీడీ అఫీషియల్ వెబ్ సైట్ లో మాత్రమే టిక్కెట్లు బుక్ చేసుకోవాలని, మోసగాళ్లను నమ్మి మోసపోవద్దని టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది.