విజయవాడ, ఏప్రిల్ 17,
బీజేపీ అటా.. ఇటా అన్న అనుమానాలు పటాపంచలైపోతున్నాయి. సీఎం రమేష్, సుజనా చౌదరి వంటి తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీ గూటికి చేరిన నాయకులు అన్యాపదేశంగానైనా ఏపీలో తెలుగుదేశం తో బీజేపీ పొత్తు ఖాయమన్న సంకేతాలు ఇస్తున్నారు. తాజాగా పీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో బీజేపీ తెలుగుదేశం, జనసేనలు కూటమిగా ఏర్పాటు అనివార్యమన్న సంకేతాలు ఇచ్చారు.ఇంతకీ ఆయన ఏమన్నారంటే వచ్చే ఏడాది ఏపీ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీ కూటమే అని. అంటే ప్రస్తుతం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న బంధం కారణంగా బీజేపీ, వైసీపీల కూటమి అని జనం పొరపడతారన్న అనుమానం ఆయనకే వచ్చిందో ఏమో.. వెంటనే రాష్ట్రంలో జగన్ పాలనపై విమర్శలు గుప్పించారు. అదే సమయంలో రాష్ట్రంలో జనసేన, బీజేపీ మిత్ర పక్షాలన్న సంగతినీ గుర్తు చేశారు. అంటే బీజేపీ జనసేనతోనే ఉంటుందన్నది ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. అయితే ఆ జనసేన ఇప్పటికింకా అధికారికంగా ప్రకటించకపోయినా.. తెలుగుదేశం పార్టీతో జట్టు కట్టడం ఖాయమన్న సంకేతాలను విస్పష్టంగా ఇచ్చింది. ఇస్తోంది కూడా.పొత్తు, సీట్ల సర్దుబాటు వంటి విషయాలపై జనసేనాని పవన్ కల్యాణ్ అధికారికంగా ఎటువంటి ప్రకటనా చేయకపోయినా.. గౌరవానికి భంగం కలగని రీతిలో పొత్తులు ఉంటాయని పదే పదే చెప్పడం, అలాగే రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వను అంటూ పదే పదే చెప్పడం వెనుక ఆయన ఉద్దేశం తెలుగుదేశంతో పొత్తు ఉంటుందనే అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సీఎం రమేష్ బీజేపీ కూటమిదే ఏపీలో అధికారం అనడం అంటే తెలుగుదేశం, జనసేనతో కలిసే బీజేపీ నడుస్తుందని చెప్పడమేనని విశ్లేషిస్తున్నారు. అంతే కాకుండా రాష్ట్రంలో జగన్ పాలన అత్యంత దారుణంగా ఉందని విమర్శలు గుప్పించారు. మొత్తం మీద ఏపీలో బీజేపీ తెలుగుదేశంతో జట్టు కడుతుందా.. కట్టదా అన్నది పక్కన పెడితే.. ఆ పార్టీతో యుద్ధం చేయాలన్న ఉద్దేశం ఎంత మాత్రమూ లేదని, ఇటీవలి కాలంలో ఆ పార్టీ రాష్ట్ర నేతల స్వరంలో వచ్చిన మార్పును బట్టి ప్రస్ఫుటంగా అర్ధమౌతోంది. మొన్న మొన్నటి వరకూ తెలుగుదేశంపై విమర్శలతో విరుచుకుపడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఇటీవలి కాలంలో ఆ విమర్శల బాణాలను అధికార వైసీపీపై ఎక్కుపెట్టడం, ఇటీవల జనసేనాని హస్తిన పర్యటన అనంతరం అక్కడ మీడియాతో మాట్లాడుతూ తన వాణిని తెలుగుదేశం పార్టీకి అనుకూలంగానే వినిపించడం వంటి వాటిని గమనిస్తే ఏపీలో రాజకీయ సమీకరణాలలో గుణాత్మక మార్పు గోచరించక మానదు.సీఎం రమేష్ మాటలు, వ్యాఖ్యలు కూడా రానున్న రోజులలో కమలం ప్రభుత్వ వ్యతిరేక స్టాండ్ ను మరింత గట్టిగా వినిపించే అవకాశాలే ప్రస్ఫుటంగా ఉన్నాయన్న సంగతిని తేటతెల్లం చేస్తున్నాయి.