హైదరాబాద్
తెలంగాణ హైకోర్టులో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. చీఫ్ జస్టిస్ బెంచ్‌లో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. మధ్యాహ్నం 2:30 గంటలకు అవినాష్ రెడ్డి పిటిషన్ విచారణకు అనుమతించే అవకాశం ఉంది. హైకోర్టులో ఉన్న అన్ని కేసుల వివరాలు తమ ముందు ఉంచాలని ధర్మాసనం ఆదేశించింది. పిటిషన్ విచారణ పెండింగ్‌లోనే ఉండగా భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసి అవినాష్ రెడ్డిని సీబీఐ విచారణకు పిలిచిందని లాయర్ కోర్టుకు వివరించారు.అయితే, అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌లో కీలక అంశాలు ఉన్నాయి. సీఆర్పీసీ 160 కింద నోటీసులు ఇచ్చారని, తన స్టేట్మెంట్ రికార్డు చేశారని అన్నారు .వివేకా కూతురు సునీత స్థానిక ఎమ్మెల్సీ ద్వారా చంద్రబాబు, సీబీఐ ఆఫీసర్ కుమ్మక్కు అయ్యారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసులో తనను కుట్రతో ఇరికిస్తున్నారని వివరించారు. గూగుల్ టేకౌట్ ఆధారంగానే తనను నిందితుడిగా చేర్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అందుకే తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు.వివేకానందరెడ్డి హత్య కేసులో నేడు మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో ఎంపీ అవినాష్ రెడ్డి విచారణకు హాజరు కానున్నారు. విచారణకు రావాలని నిన్న సీబీఐ అధికారులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేయడం ఇది ఐదోసారి. ఇప్పటికే ఎంపీ అవినాష్ ను జనవరి 28, ఫిబ్రవరి 24, మార్చి 10, మార్చి 14 తేదీల్లో సీబీఐ విచారణ చేశారు. అవినాష్ రెడ్డి విచారణ సమయంలో గతంలో తరహాలోనే వీడియోలు, ఆడియోలు రికార్డ్ చేయనున్నారు.ముందస్తు బెయిల్ కోసం వేసిన పిటిషన్‌పై హైకోర్టు నిర్ణయం తర్వాత విచారణకు వెళ్తానని ఓ టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. అప్పటివరకు సీబీఐ విచారణకు హాజరు కాలేనని అన్నారు. కోర్టుపై తమకు నమ్మకం ఉందని, సంబంధం లేని కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. న్యాయం గెలుస్తుందని తాము నమ్ముతున్నట్లు చెప్పారు. సీబీఐ అధికారుల ఎదుట హాజరు కావడం కోసం పులివెందులలోని తన నివాసం నుంచి నేడు తెల్లవారుజామునే అవినాష్ రెడ్డి హైదరాబాద్‌కు బయలు దేరారు. ఉదయం 5.30 గంటలకు అవినాష్ రెడ్డి పులివెందులలోని తన ఇంటి నుంచి బయలుదేరారు. ఏకంగా 10 వాహనాల్లో తన అనుచరులతో కలిసి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హైదరాబాద్ కు ప్రయాణం అయ్యారు. వీరిలో వైఎస్ఆర్ సీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఉన్నారు. నిన్ననే (ఏప్రిల్ 16) తండ్రి భాస్కర్ రెడ్డిని వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. నేడు కుమారుడు అవినాష్ రెడ్డిని విచారణకు పిలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. వివేకా హత్య కేసు దర్యాప్తును ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సీబీఐ దూకుడు ప్రదర్శిస్తోంది.వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుల జాబితాలో తాజాగా ఎంపీ అవినాష్ రెడ్డి పేరు కూడా సీబీఐ చేర్చింది. ఇప్పటివరకూ జరిగిన సీబీఐ విచారణల్లో అనుమానితుడిగానే సీబీఐ పరిగణించింది. కానీ, తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్టు తర్వాత ఆయన్ను సీబీఐ జడ్జి ముందు ప్రవేశపెట్టినప్పుడు భాస్కర్ రెడ్డి కస్టడీ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌లో అవినాష్ రెడ్డిని సహ నిందితుడిగా పేర్కొన్నారు.